క‌ష్ట‌ప‌డి నేపాల్‌పై గెలిచి సెమీస్ చేరిన భార‌త్.. సెంచ‌రీతో దుమ్మురేపిన య‌శ‌స్వి

  • By: sn    latest    Oct 03, 2023 6:47 AM IST
క‌ష్ట‌ప‌డి నేపాల్‌పై గెలిచి సెమీస్ చేరిన భార‌త్.. సెంచ‌రీతో దుమ్మురేపిన య‌శ‌స్వి

ఏషియన్ గేమ్స్‌లో భాగంగా చైనాలోని హాంగ్‌జౌలో జరిగిన మ్యాచ్‌లో భార‌త్ శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన ఏషియన్ గేమ్స్ మెన్స్ టీ20 క్రికెట్ క్వార్టర్ ఫైనల్‌లో భారత్..నేపాల్‌కి 203 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ముందుంచ‌గా, నేపాల్..20 ఓవర్లలో 9 వికెట్ నష్టానికి 179 పరుగులకు పరిమితమైంది.



దీంతో వరుస విజయాలతో టోర్నీలో దూకుడు ప్రదర్శిస్తున్న నేపాల్ విజ‌యాల‌కి బ్రేక్ ప‌డింది.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో కేవ‌లం 4 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో య‌శ‌స్వి జైస్వాల్ 8 ఫోర్లు, 7 సిక్స్ లతో 47 బంతుల్లోనే సెంచరీ చేసి ఔట‌య్యాడు. యశ‌స్వి సునామి ఇన్నింగ్స్‌తో భార‌త్ భారీ స్కోర్ సాధించింది.



అయితే భార‌త బ్యాట్స్‌మెన్స్‌లో రింకు సింగ్ 14 బంతుల్లోనే 35, శివమ్ దూబె 19 బంతుల్లోనే 25 రన్స్ చేయ‌డంతో భారీ స్కోర్ వ‌చ్చింది. ఇక ఓపెన‌ర్‌గా వ‌చ్చిన రుతురాజ్ 23 బంతుల్లో 25 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక 203 పరుగుల లక్ష్యంతో బ‌రిలోకి దిగిన నేపాల్ ల‌క్ష్యాన్ని చేధించలేకపోయింది.



ఈ మ్యాచ్‌లో భార‌త్ విజ‌యం సాధించ‌డంతో రుతురాజ్ టీం సెమీఫైనల్స్‌కి చేరుకోగా.. నేపాల్ ఇంటి బాట పట్టింది. నేపాల్ తరఫున దీపేందర్ సింగ్(32), సున్దీప్ జోరా(29), కుశల్ మల్ల(29), కుశల్ భూర్తల్(28), కరణ్ కేసీ(18*) పర్వాలేదనిపించినా.. వారు పెద్ద స్కోర్ చేయ‌క‌పోవ‌డంతో ప‌రాజ‌యం పొందాల్సి వ‌చ్చింది.




ఇక భారత బౌలర్లలో రవి బిష్ణోయ్ 3, అవేష్ ఖాన్ 3, అర్షదీప్ సింగ్ 2 వికెట్లు తీసుకోగా..సాయి కిషోర్ ఓ వికెట్ పడగొట్టారు.. అయితే ఒకానొక ద‌శ‌లో నేపాల్ బ్యాట్స్‌మెన్స్ విజృంభించ‌డంతో సులువుగా ల‌క్ష్యాన్ని చేదిస్తారని అంతా అనుకున్నారు. కాని మ‌ధ్య‌మ‌ధ్య‌లో కాస్త స్ట్రిక్ట్ బౌలింగ్ చేయ‌డంతో భార‌త్ విజ‌యం సులువ‌గా ద‌క్కింది.



మొత్తానికి టీమిండియా పురుషుల క్రికెట్ జట్టు ఏషియ‌న్ గేమ్స్‌లో శుభారంభం చేసింది . క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో భార‌త్ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే టీమిండియా బ్యాటింగ్ చేస్తున్న స‌మ‌యంలో ఓవైపు వరుసగా వికెట్లు పడుతున్నా.. యశస్వి మాత్రం జోరు తగ్గించకుండా బౌండరీల వర్షం కురిపించాడు. యశస్వి ఇన్నింగ్స్ లో కేవలం ఫోర్లు, సిక్స్ ల రూపంలోనే 74 పరుగులు రావడం విశేషం.