ఊపిరి పీల్చుకున్న శంకర్ కుటుంబం
విధాత, నిజామాబాద్: చేయని నేరానికి ఉరిశిక్షతో క్షణమొక గండంగా ఏళ్ల తరబడి నరకయాతన అనుభవించిన ఓ కుటుంబానికి క్షమాభిక్షతో ఊరట లభించింది. ఈ సంఘటన వివరాలు శంకర్, ఆయన కుటుంబీకులు శుక్రవారం నిజామాబాదులో మీడియాకు వివరించారు.
నిజామాబాద్ జిల్లా మెండోర మండలానికి చెందిన మకూరి శంకర్ 17 సంవత్సరాల క్రితం బ్రతుకు తెరువు కోసం దుబాయ్ వెళ్ళాడు. అక్కడ పుజిర స్టేట్‌లో ఒక చిన్న కంపెనీలో ఫోర్‌మెన్‌గా పని చేస్తు ఉన్నాడు. అతను దుబాయ్‌కి వెళ్లే సమయంలో శంకర్ భార్య గర్భంతో ఉంది. ఆ తర్వాత మగ బిడ్డకు జన్మనిచ్చింది. మూడేండ్ల తర్వాత సెలవుల్లో శంకర్ ఇంటికి తిరిగి రావాల్సి ఉంది.
ఇంతలో అనుకోకుండా అదే కంపెనీలో పని చేస్తున్న రాజస్థాన్‌కు చెందిన రామవతార్ కుమవత్ అనే వ్యక్తి 6 అంతస్తులపై నుంచి ప్రమాదవశాత్తు కిందపడి మరణించాడు. చనిపోయిన వ్యక్తి పని చేస్తున్న సైట్‌లో ఫోర్ మెన్‌గా శంకర్ పనిచేస్తుండగంతో ఆ కంపెనీ యజమాని ఎక్కడ తనపై నేరం పడుతుందోనని భావించి ఆ నేరాన్ని శంకర్‌పై మోపాడు.
దీంతో చేయని నేరానికి శిక్ష ఎందుకు వేస్తున్నారని శంకర్ పలుమార్లు కోర్టుకు విన్నవించారు. అందుకు సరైన ఆధారాలు కావాలంటూ కోర్టు పట్టించుకోలేదు. దీనికి తోడు పోలీసులు బలవంతంగా ఈ నేరం తానే చేసినట్లుగా ఒప్పుకోవాలని కఠినంగా వ్యవహరించారు. దాంతో పాటు పలు రకాలుగా ఆంక్షలు విధించి శంకర్ ద్వారా నేరం తానే చేసినట్లుగా ఒప్పించారు.
ఈ కారణంగా కోర్టు 2013లో శంకర్‌కు మరణశిక్ష విధించింది. అయితే బాధిత కుటుంబం నుంచి క్షమాబిక్షను రాత పూర్వకంగా ఇస్తే మరణ శిక్ష నుంచి బయటపడొచ్చని కోర్టు తీర్పులో పేర్కొన్నది. దీంతో శంకర్ భార్య భూదేవి తన భర్తను బయట పడ వేసేందుకు అనేక ప్రయత్నాలు చేసింది.
గతంలో ఇలాంటి సమస్యలను పరిష్కరించిన దేగామ్ యాదగౌడ్‌ను కలిసి సమస్యను వివరించి తన భర్తను కాపాడాలంటూ మొర పెట్టుకున్నారు. యాదగౌడ్ తనకున్న సంబంధాలు, పలుకుబడిని ఉపయోగించి శంకర్‌ను బతికించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
దుబాయిలో ఉన్న న్యాయవాది అనురాధను సంప్రదించారు. రాజస్థాన్‌లోని రామవతార్ కుమవత్ కుటుంబం చిరునామా గుర్తించి రాజస్థాన్‌కు పలుమార్లు వెళ్లారు. రాజస్థాన్‌లో బాధిత కుటుంబీకులను బతిమాలి విషయాన్ని వారికి వివరించి ఒప్పించారు.
చివరకు వారి కుటుంబానికి రూ. ఐదు లక్షల ఆర్థిక సాయం చేస్తానని ఒప్పందం కుదుర్చుకున్నారు. చందాల రూపంలో దాతల నుంచి రూ. ఐదు లక్షలు సేకరించి సెప్టెంబర్ నెలలో ఆ మొత్తాన్ని రామావతర్ కుటుంబానికి డీడీ రూపంలో అందజేశారు.
అనంతరం ఆ కుటుంబ సభ్యుల నుంచి క్షమాభిక్ష లేఖను తీసుకొని, లేఖతో పాటు అవసరమైన ఇతర పత్రాలను న్యాయవాది అనురాధ ద్వారా పుజీరా జైలుకి సంబంధించిన కోర్టులో సమర్పించి శంకర్‌ను శిక్ష నుంచి తప్పించారు. వారం రోజుల క్రితం జైలు సిబ్బంది టికెట్ ఇవ్వగా శంకర్ శుక్రవారం నిజామాబాద్ చేరుకున్నాడు.
శంకర్ విడుదల కోసం సహాయ సహకారాలు అందించి, ఆర్థికంగా ఆదుకున్న రాజస్థాన్ వాసి గోయాంకకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాజస్థానీ భాషలో బాధితులతో మాట్లాడి వారిని నిజామాబాద్ రప్పించి డీడీ అందజేయడం, క్షమాబిక్ష కోసం వారిని ఒప్పించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అదేవిధంగా యాదగౌడ్‌తో పాటు ఎండల లక్ష్మీనారాయణలకు శంకర్, అతని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ప్రత్యేక అభినందనలు తెలిపారు.