విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కొన్ని ఆరాచక శక్తులు ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని, అస్థిర పరచాలని చూస్తున్నాయి. అలాంటి శక్తులే తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు పన్నుతున్నాయి. బిఆర్ ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసే పనిలో బీజేపీ ఉంది. కాంగ్రెస్ పార్టీ బీజేపీకి వంత పాడుతున్నది. అలాంటి కుట్రలను ఛేదిస్తూ పార్టీని ప్రభుత్వాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
కుట్రలను దీటుగా ఎదుర్కోవాలి. సిఎం కెసిఆర్ ను, పార్టీని, ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి. అందుకు పార్టీ శ్రేణులు సర్వ సన్నద్ధంగా ఉండాలని మంత్రి ఎర్రబెల్లి పిలుపునిచ్చారు.
పాలకుర్తి నియోజకవర్గంలోని వావిలాల, ముత్తారం గ్రామాల్లో జరిగిన బి ఆర్ ఎస్ ఆత్మీయ సమ్మేళనాల్లో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి మాట్లాడారు. మంత్రికి గ్రామ పొలిమేరలో స్వాగతం పలికి పూలు చల్లుతూ, కోలాటాలు, డప్పు చప్పుళ్ళు, నృత్యాలు చేస్తూ, ఎద్దుల బండి పై ఊరేగిస్తూ ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దంపతులు కోలాటం, లంబాడా నృత్యాలు చేశారు.
మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ మనమంతా పార్టీకి, కెసిఆర్ కి అండగా నిలవాలి. అలాంటి అరాచక శక్తుల ఆట కట్టించాలని ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, ముఖ్యులు, కార్యకర్తలు, యువత విభాగం రైతుబంధు సమితి బాధ్యులు, బిఆర్ ఎస్ పార్టీ వివిధ విభాగాల బాధ్యులు, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.