టెట్ నిర్వాహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్‌.. 3లక్షల మందికి అవకాశం

డీఎస్సీ-2024 కంటే ముందుగానే టీచర్‌ అర్హత పరీక్ష(టెట్‌)నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది

  • Publish Date - March 14, 2024 / 02:23 PM IST

విధాత, హైదరాబాద్ : డీఎస్సీ-2024 కంటే ముందుగానే టీచర్‌ అర్హత పరీక్ష(టెట్‌)నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు విద్యా శాఖ కమిషనర్‌కు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 3 లక్షల మంది అభ్యర్థులకు డీఎస్సీ రాసే అవకాశం దక్కనుంది.

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల 11,062 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ-2024ను ప్రకటించింది. మార్చి 4వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తున్నది. అయితే టెట్‌ నిర్వహించిన తర్వాతనే డీఎస్సీ నిర్వహించాలని డీఈడీ, బీఈడీ పూర్తి చేసిన నిరుద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగార్థులతో పాటు ప్రతిపక్షాలు కూడా టెట్ నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాయి. ఇదే విషయమై మాజీ మంత్రి హరీశ్‌రావు కూడా సీఎం రేవంత్‌ రెడ్డికి బహిరంగ లేఖ కూడా రాశారు. టెట్‌ నిర్వహించక పోవడం వల్ల ప్రస్తుతం విడుదలైన డీఎస్సీ-2024 ద్వారా ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అర్హతను అనేకమంది కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుడు సెప్టెంబర్‌లో బీఆరెస్‌ ప్రభుత్వం టెట్‌ నిర్వహించిందని, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టెట్‌ నిర్వహించలేదని పేర్కొన్నారు.


గత డిసెంబర్‌లో డీఈడీ, బీఈడీ పూర్తిచేసిన అభ్యర్థులు దాదాపు 50 వేల మంది ఉన్నారని వివరించారు. టెట్‌ నిర్వహిస్తే ఇందులో అర్హత సాధించిన వారందరూ డీఎస్సీ దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. డీఈడీ, బీఈడీ నిరుద్యోగ అభ్యర్థులకు ఉద్యోగావకాశాలు దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే స్పందించిన తెలంగాణ ప్రభుత్వం డీఎస్సీ కంటే ముందుగానే టెట్‌ నిర్వహించాలని నిర్ణయించడంలో అభ్యర్థుల్లో హర్షాతీరేకాలు వ్యక్తమవుతున్నాయి.

Latest News