వైద్య ఆరోగ్య సేవల్లో.. తెలంగాణ దేశానికి రోల్ మోడల్‌: మంత్రి హరీశ్‌రావు

  • Publish Date - September 25, 2023 / 04:05 PM IST
  • పదేళ్ల ప్రగతి నివేదిక వెల్లడిలో హరీశ్‌రావు


విధాత : సీఎం కేసీఆర్ మార్గనిర్ధేశంలో తెలంగాణ వైద్యారోగ్య శాఖ పదేళ్లలో దేశానికి రోల్ మోడల్‌గా నిలిచిందని, అరవై ఏళ్లలో సాధ్యం కాని అద్భుతాలను దశాబ్ద కాలంలోనే ఆవిష్కరించిందని మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. రవీంద్ర భారతి వేదికగా తెలంగాణ వైద్యారోగ్య శాఖ పదేళ్ల ప్రగతి నివేదిక విడుదల చేసిన మంత్రి ఇదే వేదికగా 310 మంది ఫార్మసిస్టులకు పోస్టింగ్ ఆర్డర్స్ అందజేశారు.


అనంతరం ఆయన మాట్లాడుతూ 2014లో నీతి ఆయోగ్ ఆరోగ్య సూచిలో 11 వ స్థానంలో ఉంటే ఇప్పుడు 3 వ ర్యాంకుకు చేరుకున్నామన్నారు. మొదటి స్థానానికి చేరడానికి అడుగులు వేస్తున్నామని, ఇదంతా వైద్య సిబ్బంది సమిష్టి కృషివల్లే ఇది సాధ్యమైందన్నారు. 9 ఏళ్లలో వైద్య శాఖలో 22,600 పోస్టులు భర్తీ చేసుకున్నామని, మరో 7291 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నదన్నారు.


ఇందులో 5204 స్టాఫ్ నర్స్ పరీక్ష పూర్తీ అయ్యిందని, వారంపది రోజుల్లో ఫలితాలు ఇస్తామన్నారు. 156 ఆయుష్ మెడికల్ ఆఫీసర్లు, 1931 ఎంపీహెచ్‌ఏ (అప్లికేషన్ స్టేజ్) పోస్టుల భర్తీ కూడా పూర్తయితే పదేళ్లలోనే 30 వేల ఉద్యోగాలు వైద్య శాఖలో ఇచ్చిన ఘనత కేసిఆర్ కు దక్కుతుందన్నారు. ఒకప్పుడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన అంటే, నేడు సీఎం కేసీఆర్ పాలనలో పోదాం బిడ్డో సర్కారు దవాఖానాలకే అనేలా మార్పు జరిగిందన్నారు.


మంత్రమేస్తెనో, మాయ చేస్తెనో జరిగిన అద్భుతం కాదిదన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రూ. 12,364 కోట్ల బడ్జెట్ పెట్టుకున్నామని, ఒక్కొక్కరి వైద్యం పట్ల రూ. 3,532లు తలసరి ఖర్చు చేస్తూ దేశంలో మూడోస్థానంలో ఉన్నామన్నారు. తెలంగాణ వైద్యారోగ్య రంగం ఎటువంటి హెల్త్ ఎమర్జెన్సీని అయినా తట్టుకోవడానికి సర్వ సన్నద్ధంగా రూపొందిందన్నారు. మొత్తం 50 వేల పడకలతో కరోనా తాత వచ్చినా ఎదుర్కొనేలా సిద్దమైందన్నారు.



 


గ్రామ స్థాయిలో పల్లె దవాఖానలు, పట్టణ స్థాయిలో బస్తీ దవాఖానలు, మండల స్థాయిలో పీహెచ్‌సీలు, నియోజక వర్గ స్థాయిలో 100 పడకలు, జిల్లాకో మెడికల్ కాలేజీ, జిల్లాకో నర్సింగ్ కాలేజీ, జిల్లాకో పారా మెడికల్ కాలేజీ, వరంగల్ హెల్త్ సిటీ నిర్మాణం, రాజధాని నలువైపులా టీమ్స్ ఆసుపత్రులు, 4000 పడకలుగా నిమ్స్ విస్తరణ, సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్‌ నిర్మాణం చేపట్టామన్నారు.


119 నియోజక వర్గాల్లో ఒక్కో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారన్నారు. అవయవ మార్పిడుల్లో దేశంలోనే తెలంగాణ నెంబర్‌వన్‌గా ఉందన్నారు. ముఖ్యంగా నిమ్స్ ఆస్పత్రిలో ఆరు నెలల్లోనే 100 కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ ఆపరేషన్లు పూర్తయ్యాయన్నారు. గాంధీ ఆసుపత్రిలో 8వ అంతస్తులో ట్రాన్స్ ప్లాంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని, ఎం.ఎన్.జే క్యాన్సర్ హాస్పిటల్ లో ప్రతినెల సగటున 8 మందికి బోన్ మారో ట్రాన్స్ ప్లాంట్ ఉచితంగా చేస్తున్నామన్నారు.


ఔషధాల అందుబాటు, పంపిణీ ప్రక్రియలో తెలంగాణ గతంలో మూడో స్థానంలో ఉండేదన్నారు. త్వరలో రెండో స్థానంలోకి చేరబోతుంది. కొత్తగా ఫార్మసిస్టులు చేరికతో మొదటి స్థానానికి చేరుకుంటుందని ఆశిస్తున్నామన్నారు. త్వరలో సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఎయిర్ అంబులెన్సులు ప్రవేశపెట్టబోతున్నామన్నారు. రాష్ట్రంలో ఏ మూలన అత్యవసర పరిస్థితి ఏర్పడిన హెలికాప్టర్ ద్వారా వారిని దవాఖానకు తరలిస్తామన్నారు. నిమ్స్ లో ఈరోజు నుంచి వారం రోజులపాటు బ్రిటన్ కు చెందిన వైద్యుల బృందం ఉచితంగా చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లు చేస్తున్నారన్నారు.