యావత్ దేశానికే తెలంగాణ ఆదర్శం: బడ్జెట్ ప్రసంగంలో గవర్నర్ తమిళిసై
Governor Tamilisai | తెలంగాణ రాష్ట్ర సమ్మిళిత సమగ్రాభివృద్ధితో యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడారు. కాళోజీ నారాయణరావు వాక్కులతో గవర్నర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది’ అని కాళోజీ అన్నారని పేర్కొన్నారు. దేశం ఆశ్చర్యపోయేలా అన్నిరంగాల్లోనూ అద్భుతమైన ప్రగతిని ఆవిష్కరిస్తూ పురోగమిస్తుందన్నారు. ప్రజల ఆశీస్సులు, సీఎం కేసీఆర్ పరిపాలన […]

Governor Tamilisai | తెలంగాణ రాష్ట్ర సమ్మిళిత సమగ్రాభివృద్ధితో యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడారు. కాళోజీ నారాయణరావు వాక్కులతో గవర్నర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది’ అని కాళోజీ అన్నారని పేర్కొన్నారు.
దేశం ఆశ్చర్యపోయేలా అన్నిరంగాల్లోనూ అద్భుతమైన ప్రగతిని ఆవిష్కరిస్తూ పురోగమిస్తుందన్నారు. ప్రజల ఆశీస్సులు, సీఎం కేసీఆర్ పరిపాలన దక్షతతో రాష్ట్రం అపూర్వ విజయాలను సాధించిందన్నారు. గతంలో కరెంటు కోతలతో కొట్టుమిట్టాడిన రాష్ట్రం.. ప్రభుత్వ కృషితో నేడు 24 గంటల విద్యుత్ సరఫరాతో వెలుగు జిలుగుల రాష్ట్రంగా విరాజిల్లుతుందన్నారు.
కుదేలై విలవిలలాడిన వ్యవసాయం నేడు.. దేశానికే అన్నం పెట్టే ధాన్యాగారంగా అవతరించిందన్నారు. తాగునీటి కోసం తల్లడిల్లిన పరిస్థితుల నుంచి పూర్తిగా బయటపడిందని, వంద శాతం గ్రామాల్లో ఇంటింటికీ ఉచితంగా స్వచ్ఛమైన, సురక్షితమైన జలాలను సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు.
అత్యుత్తమ జీవన ప్రమాణాలతో ఆదర్శంగా పల్లెలు
ప్రస్తుతం తెలంగాణ గ్రామాల రూపురేఖలు మారి.. నేడు అత్యున్నత జీవన ప్రమాణాలతో ఆదర్శవంతంగా తయారయ్యాయని చెప్పుకొచ్చారు. పెట్టుబడులకు స్వర్గధామంగా, ప్రపంచ స్థాయి సంస్థలకు గమ్యస్థానంగా, ఐటీ రంగంలో మేటి రాష్ట్రంగా ప్రగతిపథంలో పరుగులు పెడుతోందన్నారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపులోనూ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటుందన్నారు.
2014-15లో రూ.62 వేల కోట్లుగా ఉన్న రాష్ట్ర ఆదాయం.. ప్రభుత్వం కృషితో 2021 నాటికి రూ.1.84కోట్లకు పెరిగిందన్నారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చే నాటికి రూ.1.24లక్షలుగా ఉన్న తలసరి ఆదాయం 2022-23 నాటికి రూ.3.17 లక్షలకు పెరిగిందని చెప్పారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లోనూ అభివృద్ధి రెట్టింపుస్థాయిలో జరిగిందన్న గవర్నర్.. అద్భుత ప్రగతి సాధించిన రాష్ట్రాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నానన్నారు. అన్నిరంగాల్లో పెట్టుబడి వ్యయాన్ని అధికంగా చేస్తూ అనూహ్యమైన ప్రగతిని సాధించిందన్నారు.
కాళేశ్వరం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది..
కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు సమయంలో నిర్మించామని, ఈ ప్రాజెక్టు మహాద్భుతంగా ప్రపంచ దృష్టిని ఆకర్షించిందన్నారు. సాగు 20లక్షల ఎకరాల నుంచి 73.33 లక్షల ఎకరాలకు పెరిగిందన్నారు. త్వరలో కోటి ఎకరాలకుపైగా నీరందిస్తామన్నారు. రైతుబంధు పథకం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును పొందిందని, రైతుబంధు పథకాన్ని ఐరాసలోనూ ప్రశంసించారని గవర్నర్ తమిళిసై అన్నారు.
రైతులకు రూ.65వేలకోట్లు పెట్టుబడి సాయం అందించామని, రైతుకు రూ.5లక్షల విలువైన జీవిత బీమాను అందిస్తున్నామని వివరించారు. రైతుబీమా సదుపాయం రాష్ట్రంలో తప్పా ప్రపంచంలో మరెక్కడా లేదన్న గవర్నర్.. ధాన్యం ఉత్పత్తి 68.17లక్షల టన్నుల నుంచి 2.02కోట్ల టన్నులకు చేరిందని వివరించారు.
జీఎస్‌డీపీలో 18.2 శాతం వ్యవసాయరంగం నుంచే వస్తుంది. విద్యుత్ సామర్థ్యం 7,778 మెగావాట్ల నుంచి 18,453 మెగావాట్లకు పెరిగిందన్నారు. రాష్ట్రంలో ఫ్లోరైడ్ పీడ విరగడైందని పార్లమెంట్‌లో కేంద్రమే ప్రకటించిందన్నారు. దళితబంధు పథకాన్ని ఉద్యమ స్ఫూర్తితో కొనసాగిస్తున్నామని, వృద్ధాప్య పింఛన్ వయోపరిమితి 57ఏళ్లకు తగ్గించామన్నారు.