తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన మంత్రివర్గ సహచరులకు శాఖలను కేటాయించారు. కీలకమైన హోం శాఖ విద్యుత్ శాఖలు రేవంత్ వద్దనే ఉన్నాయి.
విధాత : సీఎం రేవంత్ రెడ్డి తన కేబినెట్లోని మంత్రులకు ఎట్టకేలకు శాఖలు కేటాయించారు. రేవంత్‌తోపాటు 11 మంది మంత్రులు గురువారం ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. మూడురోజులవుతున్నా శాఖలు కేటాయించకపోవడంతో ఇప్పటివరకు మంత్రులెవరూ బాధ్యతలు స్వీకరించలేదు. ఇదే విషయమై ఢిల్లీకి వెళ్లొచ్చిన సీఎం రేవంత్.. శనివారం ఉదయం మంత్రులకు శాఖలు కేటాయిస్తూ ప్రకటన విడుదల చేశారు.
డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కకు కీలకమైన ఆర్థిక శాఖ అప్పగించగా, శ్రీధర్‌బాబుకు ఐటీ, పరిశ్రమల శాఖ కేటాయించారు. మరో సీనియర్ నేత అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి నీటిపారుదల శాఖ అప్పగించారు. ఇక హోం, పురపాలక, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలను ముఖ్యమంత్రి తనవద్దే ఉంచుకున్నారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆర్ అండ్ బి, దామోదర రాజనర్సింహకు ఆరోగ్య శాఖ, శ్రీధర్ బాబుకు ఐటి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాలు, పొన్నం ప్రభాకర్ కు రవాణా శాఖ, సీతక్కకు పంచాయితీ రాజ్, తుమ్మల నాగేశ్వరరావుకు వ్యవసాయ శాఖ, జూపల్లి కృష్ణారావుకు ఎక్సైజ్ శాఖ, కొండా సురేఖకు అటవీశాఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సమాచార శాఖలను కేటాయించారు.
కాగా రేవంత్ రెడ్డి తన మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న ఆరు స్థానాలను కూడా నేడు భర్తీ చేయనున్నట్లుగా తెలుస్తుంది. మంత్రుల శాఖలతోపాటు ఆరు ఖాళీల భర్తీకి సంబంధించి నియమించబోతున్న మంత్రుల పేర్లను కూడా రాజ్ భవన్ కు ఇదే రోజు పంపిస్తారని ప్రభుత్వ వర్గాల కథనం. రేవంత్ రెడ్డి మంత్రివర్గ సహచరులకు శాఖల కేటాయింపు తో పాటు ఆరు ఖాళీల భర్తీకి సంబంధించి నిన్న ఢిల్లీకి వెళ్లి హైకమాండ్ తో చర్చించడం జరిగింది.