వ్యాపారులే చట్టసభలకు ఎన్నికవుతున్నారు: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని

వ్యాపారులు, కాంట్రాక్టర్లే ఎంపీలు, ఎమ్మెల్యేలవుతున్నారని ఈ తరహా రాజకీయ పోకడలను సీపీఎం తీవ్రంగా నిరసిస్తుందని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం

  • Publish Date - March 26, 2024 / 01:15 PM IST

విచ్చలవిడిగా పార్టీ ఫిరాయింపులు

విధాత: వ్యాపారులు, కాంట్రాక్టర్లే ఎంపీలు, ఎమ్మెల్యేలవుతున్నారని ఈ తరహా రాజకీయ పోకడలను సీపీఎం తీవ్రంగా నిరసిస్తుందని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. భువనగిరిలో పార్టీ ఎంపీ అభ్యర్థి ఎండి. జహంగీర్‌, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డిలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. భువనగిరి సీపీఎం అభ్యర్థి జహంగీర్‌ను గెలిపించాలని, సుదీర్ఘంగా రాజకీయాల్లో కొనసాగుతూ ఎర్రజెండా నీడన ప్రజాపక్ష పోరాటాలు చేసిన ఆయనను గెలిపిస్తే చట్టసభలలో పేదలు, మహిళలు, శ్రామికుల సమస్యల తరుపున గళం వినిపించిన వారవుతారన్నారు. పార్టీ మార్పు అనేది నేటీ రాజకీయాల్లో విచ్చలవిడిగా, సాధారణమైనదిగా మారిపోయిందన్నారు. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీగా మారిన వెంటనే ఆ పార్టీ నుంచి అధికారంలో ఉన్న పార్టీలోకి వలసలు సాగుతున్నాయని విమర్శించారు.

అధికారం లేకపోతే పార్టీ ఖాళీ అవుతుందన్నారు. బీజేపీ గతంలో చేసిన వాగ్ధాలను అమలు చేయడం లేదన్నారు. మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయని ఆరోపించారు. ఎలక్టోరల్‌ బాండ్లను సీపీఎం వ్యతిరేకించిందన్నారు. కోర్టు కేసుల్లో ఇంప్లీడ్‌ అయ్యామన్నారు. అందులో బీజేపీ 8వేలకోట్లు, కాంగ్రెస్‌కు 2వేల కోట్లు విరాళాలు వచ్చాయన్నారు. ఆర్థికంగా సీపీఎం పార్టీ వెనుకబడిందని.. ప్రజలు అందరు కలిసి విరాళాలు వేసుకొని జహంగీర్‌ను ఆయన గ్రామానికి సర్పంచ్‌గా గెలిపించారని అదే స్ఫూర్తితో భువనగిరి ఎంపీగా ప్రజల తరుపున ప్రశ్నించే సీపీఎం అభ్యర్థిగా ఆయనను గెలిపించాలని తమ్మినేని కోరారు. జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ పార్టీల ఫిరాయించే వారికి బుద్ధి చెప్పాలన్నారు. రాష్ట్రంలో వర్షాభావంతో చెరువుల్లో నీటి చుక్క లేదని, ప్రజలు సాగు, తాగు నీటికి ప్రస్తుతం ఇబ్బందిగా ఉందన్నారు. రైతుబంధు రాలేదని.. రైతులను ఆదుకోవాలన్నారు. కూలీల వలసలను ఆపేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.