విధాత: సినిమా నటులు అన్న తర్వాత హిట్లు ఫ్లాపులు సర్వ సాధారణం. ఉప్పెన సినిమాతో బేబమ్మగా తెలుగు ప్రేక్షకుల హృదయాలలో సముచిత స్థానం సంపాదించుకున్న భామ కృతిశెట్టి. ఈ బెంగుళూరు బ్యూటీ మొదటి సినిమా బ్లాక్ బస్టర్ పడేసరికి వరుస ఆఫర్లు వచ్చాయి.
దాంతో కథను పట్టించుకోకుండా వాటికి ఓకే చెప్పింది. అయినా సరే ఆమెకు ఉప్పెన తరువాత శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు వంటి రెండు హిట్లు పడ్డాయి. వరుస హిట్స్‌తో సూపర్ ఫామ్‌లో ఉందనుకున్న టైంలో హ్యాట్రిక్ ఫ్లాపులు వచ్చాయి. రామ్‌తో చేసిన ది వారియర్, సుధీర్ బాబుతో చేసిన ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, నితిన్ మాచర్ల నియోజకవర్గం చిత్రాలతో హ్యాట్రిక్ ఫ్లాప్లు నమోదు చేసింది.
దాంతో ఇకపై ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకోవాలని భావిస్తోంది. డైరెక్టర్, హీరో, ప్రొడ్యూసర్స్ స్టామినా, ట్రాక్ రికార్డు ఇలాంటివన్నీ పరిశీలించి గానీ కొత్త చిత్రాలకు ఓకే చెప్పకూడదని నిర్ణయం తీసుకుందట. ఎక్కువగా లవ్ స్టోరీస్ మాత్రమే చేయాలని నిర్ణయించుకుందని సమాచారం.
కమర్షియల్ సినిమాల్లో నటించాలంటే తన పాత్రకు వెయిట్ ఉంటేనే ఓకే చెప్పాలని భావిస్తుంది. మొత్తం మీద హ్యాట్రిక్ విజయాలతో ఊపు మీద ఉన్న ఆమెకు హ్యాట్రిక్ ఫ్లాపులు ఎదురు కావడంతో కెరీర్‌పై భయం ఏర్పడినట్టుంది. కథలో విషయం ఉంటేనే సినిమా ఓకే చేయాలని నిర్ణయించుకుంది.
నాగచైతన్య హీరోగా నటిస్తున్న కస్టడీ చిత్రంలో మాత్రమే ఈమె నటిస్తోంది. ఇది తప్ప ఆమె చేతిలో మరో తెలుగు చిత్రం లేదు. ఇటీవలే మలయాళంలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. టోవినో థామస్‌తో ఒక సినిమా చేస్తోంది. ఇది పీరియాడికల్ మూవీ. ఇందులో ఆమె పాత్రకు చాలా ప్రాధాన్యం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇలా చేయడం మంచిదే గానీ మరీ ఎక్కువగా గ్యాప్ ఇస్తే మాత్రం ఫేడౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వరుసగా సినిమాలు చేయాల్సిందే… హీరోయిన్లు అన్న తర్వాత అది తప్పదు కానీ వచ్చిన వాటిల్లోనే సరైన కథలను ఎంపిక చేసుకుంటూ మరీ బెట్టు చేయకుండా కెరీర్ స్మూత్ గా సాగేటట్టు చూసుకోవడం బెటర్. మొత్తానికి కృతిశెట్టి మరలా ఫామ్‌లోకి రావాలని విశ్వప్రయత్నాలు చేస్తోంది. మరి ఆమె ఆశలు ఫలిస్తాయో లేదో వేచి చూడాలి..!