ఉద్యోగులకు.. గవర్నర్ ఎపాయింట్మెంట్ ఖరారు చేసినందుకేనా!
*
విధాత: ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు అడుగు వేసినా జగన్ ఊరుకోరు.. ఒకవేళ ఎవరైనా అలాంటి ఆలోచన చేసినా.. దానికి సహకరించినా చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీనికి మరో చక్కని ఉదాహరణ తాజాగా జరిగిన ఐఏఎస్ ఆఫీసర్ల బదిలీలు.
నాల్రోజులు కిందట సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ల బదిలీలు జరగ్గా అందులో రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న ఆర్పీ సిసోడియా కూడా ఉన్నారు. బదిలీల్లో భాగంగా ఆయన్ను జీఎడికి రిపోర్ట్ చేయలని ఆదేశించారు. ఆయనకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. సిసోడియా స్థానంలో టీటీడీ మాజీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ను గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు.
అయితే సిసోడియాను బదిలీ వెనుక ఆయనపై ప్రభుత్వానికి ఆగ్రహం ఉండటమే కారణమని అంటున్నారు. ఇటీవల తమకు ప్రభుత్వం ప్రతి నెలా వేతనాలు చెల్లించడంలో జాప్యం చేస్తోందని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఆ సంఘ ప్రతినిధులు గవర్నర్‌ను కలసి వినతిపత్రం అందజేశారు.
తమకు ప్రభుత్వం సకాలంలో జీతభత్యాలు ఆర్థిక ప్రయోజనాలు చెల్లించేలా ప్రత్యేక చట్టం తేవాలని గవర్నర్‌ను కలసి సూర్యనారాయణ కోరారు. జీతాల కోసం ఉద్యోగ సంఘం నేతలు గవర్నర్‌ను కలవడం అప్పట్లోనే చర్చనీయాంశమైంది.
ఈ పరిణామం మీద ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. దీంతో సూర్యనారాయణకు షోకాజు నోటీసులు జారీ చేసింది. నిబంధనలను అతిక్రమించి గవర్నర్‌కు ఫిర్యాదు చేయడంపై మీ ఉద్యోగ సంఘం గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలంటూ ఆయనకు నోటీసులు జారీ చేసింది.
మరోవైపు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు సూర్యనారాయణ తదితరులు గవర్నర్‌ను కలవడం వెనుక ఆర్పీ సిసోడియా సహాయం చేశారని రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం చెందిందని అంటున్నారు. వారికి గవర్నర్ అపాయింట్మెంట్ ఇవ్వడానికి సిసోడియా సహకరించారని, ఆయన అడ్డుకుని ఉంటే వాళ్ళు గవర్నర్‌ను కలిసేవాళ్లు కాదని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఆయన్ను బదిలీ చేసిందని, పోస్టింగ్ కూడా ఇవ్వలేదని అంటున్నటు.