విధాత: ‘సమయం లేదు మిత్రమా… అసెంబ్లీ ఎన్నికలకు ఉన్నది కేవలం 8 నెలలు మాత్రమే… ఇది చాలా కీలకమైన సమయం.. అందరూ అవిశ్రాంతంగా పని చేయండి.. అధికారం మనదే’ అని పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఏ.రేవంత్‌రెడ్డి (Revanth Reddy) పార్టీ నేతలకు స్పష్టం చేశాడు. నాయకులంతా కలిసి కట్టుగా ఎవరికి కేటాయించిన పనులను వారు పకడ్భందీగా అమలు చేయాలని సూచించారు. ఈ మేరకు శనివారం గాంధీ భవన్‌లో పలువురు ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణిక్‌రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిలు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా పార్టీ నేతలకు పీసీసీ అధ్యక్షులు ఏ.రేవంత్‌రెడ్డి పార్టీకి రాష్ట్రంలో ఉన్న సానుకూల పరిస్థితుల గురించి వివరించారు. తన పాదాయాత్ర సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన స్పందన, విన్నపాలను వివరించారు. పాదయాత్రకు ఎక్కడా బ్రేక్ లేకుండా ఏఐసీసీ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క చేస్తున్న పాదయాత్ర గురించి తెలియజేశారు. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడానికి అనుకూల పరిస్థితులు బలంగా ఉన్నాయని తెలిపారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బలంగా పోరాటం చేశాయని తెలిపారు. విద్యార్థులు, నిరుద్యోగులు మన పోరాటంలో కలిసి వచ్చారని, ఎన్‌ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ నాయకులు వీరందరినీ కలుపుకు రావడంలో విజయవంతం అయినట్లు తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ల తీరుపై ప్రజల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయని, ఈ రెండు పార్టీల మధ్య అంతర్గత సంబంధాలున్నాయని చర్చించుకుంటున్నారని రేవంత్ వివరించినట్లు తెలిసింది.
రాష్ట్రంలో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలను గమనించి దెబ్బతీయాలని బీఆర్‌ఎస్, బీజేపీలు కుట్రలు పన్నుతున్నాయని, ఈ కుట్రలను తిప్పి కొట్టి అధికారాన్ని హస్తగతం చేసుకోవాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలందరిపైన ఉన్నదని రేవంత్ హితబోధ చేసినట్లు సమాచారం. ఈ మేరకు బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు ఎవరి కోసం పని చేస్తున్నాయో ప్రజలకు వివరించాలన్నారు.
క్యాడర్‌లో గందర గోళం సృష్టంచే కుట్రలు..
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో గందరగోళం సృష్టించే సరికొత్త కుట్రలకు, కుతంత్రాలకు ఆ పార్టీలు తెరలేపుతున్నాయని రేవంత్ పార్టీనేతలకు చెప్పినట్లు తెలిసింది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌తో పొత్తులు ఉంటాయని సోషల్ మీడియా, ప్రసార మాధ్యమాల్లో ఉద్ధేశపూర్వకంగా ప్రచారం సాగిస్తూ నేతలపై, కార్యకర్తలపై థాట్ పోలీసింగ్ చేస్తున్నారని, దీనికి కొంత మంది మీడియా ప్రతినిధులు కూడా వంత పాడుతున్నారని, అలాంటి ఆధారాలు లేని ప్రచారాల ప్రభావానికి గురి కావద్దని నేతలకు స్పష్టపర్చారని సమాచారం.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇలాంటి చిల్లర మల్లర ప్రచారాలు జరుగుతాయని, వాటిని విశ్వాసంలోకి తీసుకోవద్దని, పార్టీ అధినేతలు సోనియా గాంధీ, రాహుల్ ఆదేశాల ప్రకారం పనిచేయాలని అన్నట్లు తెలిసింది. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌తో ఎలాంటి పొత్తు ఉండదని, తను పీసీసీ అధినేతగా ఉన్నంత వరకు పొత్తులు పెట్టుకునే ప్రసక్తి లేదని రేవంత్‌రెడ్డి నేతలకు మరోసారి కుండబద్దలు కొట్టి చెప్పారని తెలిసింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పోరాటం అధికార బీఆర్‌ఎస్ ప్రభుత్వం పైననే అని వెల్లడించినట్లు తెలిసింది. మతోన్మాద బీజేపీ పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఈ రెండు పార్టీలు అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాల పట్ల విస్తృత ప్రచారం చేపట్టి, పార్టీ నాయకులు ప్రజామద్దతును కూడగట్టాలని రేవంత్ రెడ్డి చెప్పినట్లు తెలిసింది.
అలుపు లేకుండా 8 నెలలు పనిచేయాలి…
ఈ మేరకు వచ్చే ఎనిమిది నెలలు అవిశ్రాంతంగా పని చేయాలని నేతలకు ఆదేశాలు ఇచ్చారు. ఈ కీలకమైన సమయంలో అందరూ కలిసి కట్టుగా పని చేయాలని రేవంత్ అన్నారు. పార్టీ అధిష్టానం ఎవరికి టికెట్లు ఇచ్చినా అందరూ కలిసి గెలుపు కోసం పని చేయాలని కోరారు. కలిసి కట్టుగా పని చేసి విజయం సాధిస్తే అందరికి పదవులు వస్తాయని, పూర్వవైభవం వస్తుందని చెప్పినట్లు తెలిసింది. నాయకులందరూ ఎవరి కేటాయించిన బాధ్యతల్లో వారు పకడ్బందీగా పని చేయాలని కోరినట్లు తెలిసింది.
మరో వైపు రాష్ట్రంలోని ప్రసార, ప్రచార మాధ్యమాలలో మన వాదన బలంగా వినిపించేందుకు ప్రతి నాయకుడు సిద్ధంగా ఉండాలని ఆదేశించనట్లు తెలిసింది. ఈ మేరకు నేతలంతా బాగా ప్రిపేర్ కావాలని, రోజు వారి అంశాలపై అధ్యయనం చేయాలని తెలిపినట్లు తెలిసింది. తాము ఇప్పటికే పని విభజన చేసామని, ఎవరికి ఇచ్చిన బాధ్యతలను వారు సక్రమంగా నిర్వహించాలని కోరినట్లు సమాచారం.
నియోజవర్గాల వారిగా రిపోర్ట్ ఉంది… ఠాక్రే
తమ వద్ద రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా కాంగ్రెస్ పార్టీ బలం, నాయకుల శక్తి, బలహీనతలపై నివేదికలు తమ వద్ద ఉన్నాయి.. అందరూ చేయి చేయి కలిపి పని చేయండి… అప్పుడు విజయం కాంగ్రెస్ పార్టీదేనని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రే నేతలకు ఉద్భోద చేశారని ఓ నాయకుడు చెప్పారు. రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్‌పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్రల వల్ల పార్టీకి ప్రజల్లో పలుకుబడి బాగా పెరిగిందని, ఇటీవల కాలంలో ప్రజల్లో వచ్చిన అనుకూల వాతావరణాన్ని ఎన్నికల్లో ఓట్లుగా మలుచుకోవాలని సూచించారు.
రానున్న ఎన్నికల్లో పని ప్రాతిపదికనే పదవులు, టికెట్లు ఉంటాయని, ప్రజల్లో నిత్యం తిరుగుతూ తమ నిబద్దత నిరూపించుకోవాలని నేతలకు స్పష్టం చేశారంటున్నారు. బూత్‌ల వారిగా కాంగ్రెస్ కార్యకర్తలంతా కష్టపడి పని చేయాలని, అప్పుడు ఫలితం కూడా మీకే అనుకూలంగా వస్తుందని భరోసా ఇచ్చినట్లు తెలిసింది. ఈ సమావేశంలో పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరీ, నదీమ్ జావెద్ పాల్గొన్నారు.
పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళండి
అనంతరం గాంధీభవన్ లో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మానిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిలు సోషల్ మీడియా టీంతో భేటీ అయ్యారు. రాబోయే ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలి, పార్టీ కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి అనే విషయాలపై చర్చించారు. ఈ సమావేశంలో సోషల్ మీడియా చైర్మన్ మన్నె సతీష్, స్టేట్ కోఆర్డినేటర్ పెట్టెం నవీన్, సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శులు ఏఐసీసీ ఇంచార్జీలు నదీమ్ జావేద్, రోహిత్ చౌదరి , టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ , వైస్ ప్రెసిడెంట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి లు పాల్గొన్నారు