Head Bath: సాధారణంగా అందరూ నిత్యం స్నానం చేస్తుంటారు. కొంతమంది మాత్రం ప్రతిరోజు తలను తడపరు. కేవలం భుజాలపై నుంచి స్నానం చేసి ముఖం కడుక్కుంటారు. ఇలా చేస్తే దాన్ని స్నానం అంటారు. తలస్నానం అనరు. పురుషులు ఎవరో కొందరు తప్ప అందరూ తలస్నానం చేస్తుంటారు. మహిళలకు అది సాధ్యపడదు. ఎందుకంటే వారికి తల వెంట్రుకలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆరడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందువల్ల రోజు తలస్నానం చేస్తే జలుబు, జ్వరం లాంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఆడవాళ్లు వారంలో రెండు మూడు రోజులు మాత్రమే తలస్నానం చేస్తారు.
అయితే ఈ తలస్నానం రెండు రకాలుగా ఉంటుంది. అందులో ఒకటి సాధారణ తలస్నానం, రెండోది తలంటు స్నానం. సాధారణ తలస్నానం అంటే ఎప్పటిలాగే తలపై నీళ్లు పోసుకుని చేసే స్నానం. తలంటు స్నానం అంటే మాత్రం ఒంటికి, నెత్తికి నూనె రాసుకుని ఆ తర్వాత కుంకుడు కాయ రసం లేదా షాంపూతో చేసే స్నానం. తలస్నానం తలలో మురికి పోవడానికి వారంలో రెండు మూడు సార్లు చేస్తుంటారు. తలంటు స్నానం మాత్రం కొన్ని ప్రత్యేక పర్వదినాల్లో, ఆలయాలకు వెళ్లే రోజుల్లో మాత్రమే చేస్తారు. దీన్నే అభ్యంగన స్నానం అని కూడా అంటారు.
సాధారణ స్నానాల సంగతి పక్కన పెడితే.. ఈ తలంటు స్నానం విషయంలో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయట. తలంటు స్నానం సూర్యోదయానికి ముందే చేస్తే చాలా మంచిదట. పొద్దుపోయిన తర్వాత లేదంటే ఏదైనా తిన్న తర్వాత తలంటు స్నానం చేస్తే దాని ఫలితం ఉండకపోగా అనారోగ్యాలు కలుగుతాయట. అయితే వృద్ధులు మాత్రం కాస్త పొద్దుపోయిన తర్వాత చేసినా పర్వాలేదట. అయితే ఈ తలంటు స్నానం ఎప్పుడుపడితే అప్పుడు చేయకూడదట. వారంలో కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో మాత్రమే చేయాలట. వేరే రోజుల్లో చేస్తే మంచిది కాదట.
ముఖ్యంగా బుధ, శనివారాల్లో తలంటు స్నానం చేస్తే సత్ఫలితాలు ఉంటాయని శాస్త్రం చెబుతోందట. మిగతా రోజుల్లో తలంటు స్నానం చేస్తే ప్రతికూల ఫలితాలు కలుగుతాయట. ఆదివారం రోజు తలంటు స్నానం చేస్తే అనారోగ్యం కలుగుతుందట. సంతానానికి కీడు చేకూరుతుందట. సోమవారం తలంటు స్నానం చేస్తే లేనిపోని ఆందోళన ఉంటుందట. భయం వెంటాడుతుందట. శరీరం కాంతిని కోల్పోతుందట. మంగళవారం తలంటు స్నానం చేస్తే ఆయు క్షీణం కలుగుతుందట. భర్తకు విరోధం, అపాయం కలుగుతుందట.
అదేవిధంగా గురువారం రోజు తలంటు స్నానం చేస్తే ధన వ్యయం కలుగుతుందట. శత్రు బాధలు అధికమవుతాయట. అశాంతి కలుగుతుందట. శుక్రవారం తలంటు స్నానం చేస్తే అశాంతి కలుగడమేగాక రోగాలు ఎక్కువవుతాయట. వస్తు నాశనం జరుగుతుందట. అందుకే ఆయా రోజుల్లో తలంటు స్నానం చేయకూడదట. అదే బుధవారం తలంటు స్నానం చేస్తే అన్నీఈ శుభ ఫలితాలే కలుగుతాయట. కీర్తి, సంపద, ధన లాభం కలుగుతుందట. ఏ పని చేసినా కలిసి వస్తుందట. శనివారం తలంటు స్నానం చేస్తే సత్ఫలితాలు కలుగుతాయట. ఆయుష్షు వృద్ధి చెందుతుందట. కుటుంబ సౌఖ్యం కలుగుతుందట.
అంతేగాక క్రమం తప్పకుండా బుధ, శనివారాల్లో తలంటు స్నానం చేస్తే దరిద్ర దేవత మనలను విడిచి వెళ్తుందట. అయితే పండుగలు, పబ్బాలు వచ్చినప్పుడు మాత్రం ఈ వారం నిబంధనలు వర్తించవట. ఆ పండుగ, పర్వదినం ఏ వారం వచ్చినా తలంటు స్నానం చేసుకోవచ్చట. అదేవిధంగా పై నిబంధలన్నీ తలంటు స్నానానికేగానీ, తల స్నానానికి కాదట. తలస్నానం అవసరాన్ని బట్టి వారం పట్టింపులు లేకుండా ఎప్పుడైనా చేసుకోవచ్చట.