KCR నుంచి ఉద్యమకారులు కోరుతున్నది ఇదే ..!

ఉన్నమాట: టీఆర్‌ఎస్ పుట్టుకకు మూలం తెలంగాణ ఉద్యమం. ఉద్యమ కాలంలో భిన్న భావజాలాలు ఉన్న వివిధ పార్టీల నేతలకు టీార్‌ఎస్‌ వేదిక అయ్యింది. అందరి ఆకాంక్ష ఒక్కటే కావడంతో అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ ఉద్యమం అందరినీ ఉద్యమం ఒక్క తాటి పైకి తెచ్చింది. పధ్నాలుగేండ్ల సుదీర్ఘ శాంతియుత పోరాట ఫలితంగా స్వరాష్ట్రం సిద్ధించింది. మొదటిసారి 63, రెండో సారి 88 సీట్లు కట్ట బెట్టి ప్రజలు టీఆర్‌ఎస్‌ను ఆదరించారు. అయితే మొదటిసారి బొటాబొటి మెజారిటీతో వచ్చిన ప్రభుత్వాన్ని […]

  • By: krs    latest    Oct 22, 2022 2:52 AM IST
KCR నుంచి ఉద్యమకారులు కోరుతున్నది ఇదే ..!

ఉన్నమాట: టీఆర్‌ఎస్ పుట్టుకకు మూలం తెలంగాణ ఉద్యమం. ఉద్యమ కాలంలో భిన్న భావజాలాలు ఉన్న వివిధ పార్టీల నేతలకు టీార్‌ఎస్‌ వేదిక అయ్యింది. అందరి ఆకాంక్ష ఒక్కటే కావడంతో అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ ఉద్యమం అందరినీ ఉద్యమం ఒక్క తాటి పైకి తెచ్చింది. పధ్నాలుగేండ్ల సుదీర్ఘ శాంతియుత పోరాట ఫలితంగా స్వరాష్ట్రం సిద్ధించింది.

మొదటిసారి 63, రెండో సారి 88 సీట్లు కట్ట బెట్టి ప్రజలు టీఆర్‌ఎస్‌ను ఆదరించారు. అయితే మొదటిసారి బొటాబొటి మెజారిటీతో వచ్చిన ప్రభుత్వాన్ని చంద్రబాబు కూల్చే ప్రయత్నం చేశాడు. ఆ కుట్రలను చేదించిన కేసీఆర్ అనంతరం అప్రమత్తం అయ్యారు. రాజకీయ పునరేకీకరణ పేరుతో ప్రతిపక్ష ఎమ్మెల్యే లను పార్టీలో చేర్చుకున్నారు.

ఆ సందర్భానికి ఆనాడు ప్రజల నుంచి కూడా పెద్ధగా వ్యతిరేకత వ్యక్తం కాలేదు. కానీ రెండోసారి అధికారంలోకి వచ్చాక కూడా అదే జరిగింది. దీన్ని ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, ఉద్యమకారులు తప్పుపట్టారు. ఎందుకంటే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంతో ప్రశ్నించే గొంతుకలు ఉండాలని కోరుకున్నారు.

ఈ నేపథ్యంలోనే అధికార పార్టీలో అవకాశాలు రాని వాళ్ళు, అసంతృప్త నేతలు బీజేపీ వైపు చూశారు. కాంగ్రెస్‌ను కాదని వాళ్ళు కాషాయ తీర్థం పుచ్చుకోవడానికి కారణం ఉన్నది. వరుస ఓటములు, నాయకత్వ వైఫల్యం, పార్టీ అంతర్గత కలహాలతో కాంగ్రెస్ పార్టీ చాలా దెబ్బతిన్నది.

దీంతో కొంతమందికి ఇష్టం లేకున్నా అనివార్యంగా బీజేపీలో చేరాల్సిన పరిస్థితులు వచ్చాయి. కానీ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై అంతర్గతంగా అవేదన ఉన్నప్పటికీ బైటికి చెప్పలేని స్థితి నెలకొన్నది. అయితే ఇక్కడ అవకాశాలు, ఆదరణ లేదని వెళ్ళిన వాళ్లకు అక్కడ ఇంతకంటే దారుణ పరిస్థితులు కనిపించాయి. ఇంకా ఈ పార్టీలోనే కొనసాగితే రానున్న రోజుల్లో కష్టం అనే అభిప్రాయం ఏర్పడింది.

ఈలోగా కేసీఆర్ బీజేపీపై పోరాటానికి సిద్ధమయ్యారు. రాజకీయంగా ఆయనకు ఇబ్బందులు ఎదురవుతున్నా ముందుకు పోవడం మినహా మరో మార్గం లేకుండా పోయింది. ఈ సమయంలోనే బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా మేధావులు మాట్లాడాలని ఇటీవలి కాలంలో పదే పదే మీడియా సమావేశాల్లో, బహిరంగ సభల్లో ప్రస్తావిస్తున్నారు.

ఈ క్రమంలోనే టీఆర్ఎ‌స్ బీఆర్ఎస్ గా మారింది. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్న కేసీఆర్‌కు సొంత రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి. అందుకే ఇంట గెలిచి రచ్చ గెలవాలి అనే నానుడిని కేసీఆర్ అనుసరిస్తున్నారు.

ఉద్యమ కాలంలో తనతో దశాబ్ద కాలం కలిసి నడిచిన వాళ్లు వివిధ కారణాలు, కొన్ని సార్లు ఆయన వైఖరితో విభేదించి పార్టీని వీడారు. వాళ్ళందరికీ కేసీఆర్‌తో పెద్దగా రాజకీయ వైరం ఏమీ లేదు. టీఆర్‌ఎస్ అధినేత ఉద్యమ కారులతో పాత కాలం నాటి అనుబంధాన్ని కొనసాగించాలని ఉద్యమ కారులు కోరుకుంటున్నారు.

ఆహ్వానిస్తే అందరూ కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్లకు ఆయనతో ఉన్న రాజకీయ బంధం అలాంటిది. అందుకే ప్రస్తుతం గులాబీ గూటికి చేరుతున్న నేతలు కేసీఆర్ నుంచి కోరుకుంటున్నది ఇదే. దీన్నే తెలంగాణ రాజకీయ పునరేకీకరణ అంటారేమో!. – రాజు ఆసరి