చిరుమర్తికి వ్యతిరేకంగా ఒక్కటైన ఆ.. ఇద్దరు!

ఉద్దీపనలో వేములకు మద్దతుగా నేతి !! విధాత: నకిరేకల్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు వ్యతిరేకంగా ఆ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ ఒక్కటయ్యారు. ఆదివారం నకిరేకల్ నియోజకవర్గంలో వేముల వీరేశం తన ఉద్దీపన ఫౌండేషన్ ద్వారా 80కి పైగా కంపెనీలతో మెగా జాబ్ మేళా నిర్వహించారు. జాబ్ మేళా ప్రారంభ సభలో నేతి విద్యాసాగర్ మాట్లాడుతూ నకిరేకల్ నియోజకవర్గ ప్రజల, యువత సంక్షేమానికి […]

  • Publish Date - February 12, 2023 / 11:16 AM IST
  • ఉద్దీపనలో వేములకు మద్దతుగా నేతి !!

విధాత: నకిరేకల్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు వ్యతిరేకంగా ఆ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ ఒక్కటయ్యారు. ఆదివారం నకిరేకల్ నియోజకవర్గంలో వేముల వీరేశం తన ఉద్దీపన ఫౌండేషన్ ద్వారా 80కి పైగా కంపెనీలతో మెగా జాబ్ మేళా నిర్వహించారు.

జాబ్ మేళా ప్రారంభ సభలో నేతి విద్యాసాగర్ మాట్లాడుతూ నకిరేకల్ నియోజకవర్గ ప్రజల, యువత సంక్షేమానికి పాటుపడుతున్న మాజీ ఎమ్మెల్యే వీరేశానికి ప్రజలు అండగా ఉండాలంటూ పిలుపునిచ్చారు. గతంలో వీరేశానికి నియోజకవర్గ ప్రజలు ప్రజా సేవ కోసం ఒక అవకాశం ఇచ్చారని, మరోసారి అవకాశం పోయినా ఎవరిని కూడా నిరాశపరచకుండా నియోజకవర్గ ప్రజలకు యువతకు తన సేవలు కొనసాగిస్తున్నారని అభినందించారు.

నియోజకవర్గంలో సీనియర్ నేత విద్యాసాగర్ స్థానికంగా వేముల నిర్వహించిన జాబ్ మేళా సభలో చేసిన వ్యాఖ్యలతో నియోజకవర్గ రాజకీయాల్లో నేతి, వేముల ఒకటిగా సాగుతున్నారన్న వాదనకు నిదర్శనంగా నిలిచింది. అలాగే వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గ బీఆర్ఎస్ టికెట్ కోసం వేముల వీరేశం, చిరుమర్తి లింగయ్య మధ్య సాగుతున్న పోరులో తాను వీరేశం వైపే నిలబడుతున్నట్లుగా విద్యాసాగర్ చెప్పకనే చెప్పినట్లయ్యింది.

మరోవైపు నకిరేకల్ నియోజకవర్గ రాజకీయాలలో తరచూ తన ప్రభావం చూపేందుకు ప్రయత్నిస్తున్న నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డి సైతం వేముల వీరేశం నిర్వహించిన ఉద్దీపన జాబ్ మేళా సభకు హాజరవ్వడం గమనార్హం.

జాబ్ వేళా వేదికగా జరిగిన పరిణామాలు సిట్టింగ్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు వచ్చే ఎన్నికల్లో చెక్ పెట్టే దిశగా సాగుతున్న పరిణామాల్లో భాగమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.