Times Now Survey
విధాత: దేశంలో మళ్లీ మోడీ..బీజీపీ హవా కొనసాగుతుందని.. ఆయన్ను ఆపేశక్తి కూటమికి.. చిన్న పార్టీలకు లేదని టైమ్స్ నౌ (Times Now Survey) ఇచ్చిన సర్వే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల విషయంలో మిశ్రమ స్పందనకు కారణమైంది. మళ్లీ మోడీ రాక తప్పదు..ఆయన్ను 64శాతం మంది ప్రధానిగా కోరుకుంటున్నారు.. బిజెపికి 292 నుంచి 338 సీట్లు రావచ్చు.
ఇక మోడీ వ్యతిరేక కూటమి అయిన కాంగ్రెస్ కూటమికి గరిష్టంగా 144 సీట్లు మాత్రమే వస్తాయని, మూడో కూటమికి కేవలం 96 సీట్లు వస్తాయని చెప్పిన ఈ సర్వే కేసీఆర్ కు నచ్చకపోగా ఉన్న పాతిక సీట్లలో 24 వరకూ వైయస్సార్ కాంగ్రెస్ కు వస్తాయి అని చెప్పిన మాట జగన్ కు ఆ పార్టీ నాయకులకు చెవుల్లో చక్కెర పోసినట్లు అయింది.
ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నాయన్నది పక్కన పెడితే ఈ సర్వే ఆంధ్ర ప్రదేశ్‌లో ముఖ్యంగా వైసిపి క్యాడర్ లో జోష్ నింపింది. వివేకా హత్య కేసు.. రాజధాని అంశం..ఇలాంటి సమస్యల నడుమ కుంటుతూ నడుస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఇది జోష్ నింపింది. రానున్న రోజుల్లో ఇదే తథ్యం అని జగన్ ఫ్యాన్స్ అంటున్నారు.
ఇక దేశవ్యాప్తంగా మోడీ వ్యతిరేకులను కలుపుకుని గాయి గత్తర లేపుదాం.. జాతీయ స్థాయిలో మోడీ వ్యతిరేక కూటమికి నాయకత్వం వహించి సత్తా చాటి జాతీయ స్థాయి పేరు నిలబెట్టుకుందాం అని చూసిన భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ కు మాత్రం ఈ సర్వే పెద్ద నిరాశను మిగిల్చింది అంటున్నారు.
ఎంత ఎగిరెగిరి పడినా థర్డ్ ఫ్రంట్ కు వంద లోపు సీట్లే అని సర్వే చెప్పడంతో ఇక ఎగరడం దండగ భారస వర్గాలకు అర్థం అయిందని అంటున్నారు. రానున్న రోజుల్లో ఈ సర్వే నిజం కావచ్చు..కాకపోవచ్చు కానీ ప్రస్తుతానికి అయితే కేసీఆర్ కు కాస్త ఝలక్ ఇచ్చినట్లే అంటున్నారు.
ఇక జగన్ పని అయిపోయింది.. మేమే అధికారంలోకి వస్తాం అని చెబుతున్న టిడిపి సైతం ఈ (Times Now Survey) సర్వేను పెద్దగా పట్టించుకోవడం లేదు. తాము గెలుస్తాం అని చెబితే ఈ సర్వేను గట్టిగా ప్రచారం చేసుకోవచ్చు కానీ లేనిదానికి ఎందుకులే అని వారు పూర్తిగా ఇగ్నోర్ చేశారు.
సర్వే ఫలితాలు తమకు వ్యతిరేకంగా వచ్చినా గానీ టిడిపి వారిలో ఆత్మవిశ్వాసం మాత్రం నిండుగా ఉంది.. జగన్ కు ఒక్క ఛాన్స్ మాత్రమే అనే కాన్సెప్ట్ మీద నమ్మకంతో లోకేష్ పాదయాత్ర సాగుతోంది.