Tomato Theft | ఇంట్లో టమాటాలు జాగ్రత్త సుమీ..! బంగారు నగలతో పాటు ఫ్రిజ్‌లోని టమాటాలు ఎత్తుకెళ్లిన దొంగలు..!

Tomato Theft | మార్కెట్‌లో టమాట రేట్లు మండిపోతున్నాయి. ఏదో ఒక కూరలో రెండు టమాటలు వేసుకునేది. ధరల పెరుగుదలతో ప్రస్తుతం ఇంటింటికీ టమాటలు దూరమయ్యాయి. ఇప్పుడిదంతా ఎందుకంటారా..? ఇంట్లో దొంగతనానికి వచ్చిన దోపిడీ దొంగలు బంగారు నగలతో పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టిన టమాటలను సైతం ఎత్తుకువెళ్లారు. ఈ విచిత్ర ఘటన నిజామాబాద్‌ జిల్లాలో చోటు చేసుకున్నది. ఈ వార్త వైరల్‌ కావడంతో అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. బోధన్‌ పట్టణానికి చెందిన రఫి అనే […]

Tomato Theft | ఇంట్లో టమాటాలు జాగ్రత్త సుమీ..! బంగారు నగలతో పాటు ఫ్రిజ్‌లోని టమాటాలు ఎత్తుకెళ్లిన దొంగలు..!

Tomato Theft | మార్కెట్‌లో టమాట రేట్లు మండిపోతున్నాయి. ఏదో ఒక కూరలో రెండు టమాటలు వేసుకునేది. ధరల పెరుగుదలతో ప్రస్తుతం ఇంటింటికీ టమాటలు దూరమయ్యాయి. ఇప్పుడిదంతా ఎందుకంటారా..? ఇంట్లో దొంగతనానికి వచ్చిన దోపిడీ దొంగలు బంగారు నగలతో పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టిన టమాటలను సైతం ఎత్తుకువెళ్లారు. ఈ విచిత్ర ఘటన నిజామాబాద్‌ జిల్లాలో చోటు చేసుకున్నది. ఈ వార్త వైరల్‌ కావడంతో అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.

వివరాల్లోకి వెళితే.. బోధన్‌ పట్టణానికి చెందిన రఫి అనే మున్సిపల్‌ ఉద్యోగి గౌడ్స్‌ కాలనీలో నివాసం ఉంటున్నారు. సోమవారం ఇంటికి తాళాలు వేసి సిద్ధిపేటలోని బంధువుల ఇంటికి వెళ్లారు. ఇదే అదునుగా ఇంట్లో దొంగలు పడి.. నగదు, ఆభరణాలను దోచుకెళ్లారు. అయితే ఇంట్లో ఫ్రిజ్‌లో ఉన్న కిలో టమాటలను ఎత్తుకువెళ్లారు. మంగళవారం తెల్లవారు జామున ఇంటికి వచ్చే సరికి తాళాలు పగలగొట్టి కనిపించాయి. ఇంట్లోని సామానంత చిందరవందరగా కనిపించాయి.

ఇంట్లోని బీరువాలో దాచి ఉంచి నగదు రూ.1.28లక్షలతో పాటు 12 తులాల బంగారం ఆభరణాలు చోరీకి గురయ్యాయని గుర్తించారు. అయితే, ఫ్రిజ్‌ తలుపులు తీసి ఉండడం గమనించగా.. అందులో పెట్టిన టమాటలు సైతం కనిపించలేదు. దొంగలు టమాటలనూ వదలకుండా ఎత్తుకెళ్లడంతో బాధిత కుటుంబం అవాక్కయ్యింది. ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశమైంది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.