బీఆరెస్‌కు అగ్నిపరీక్షే!

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలై అధికారం కోల్పోయిన భారత రాష్ట్ర సమితి (బీఆరెస్‌) అగ్నిపరీక్షను ఎదుర్కొంటున్నది

  • Publish Date - March 26, 2024 / 02:44 PM IST
  • స‌వాల్‌ విసురుతున్న లోక్‌సభ ఎన్నికలు
  • ఆపదమొక్కుల్లా అభ్యర్థుల ఎంపికలు
  • ముగ్గురు సిటింగ్‌లు.. ఒకరు పాతవారు
  • 13 స్థానాల్లో కొత్త వారికే బీఆర్ఎస్ చాన్స్‌
  • ఎన్నికల తర్వాత అనూహ్య పరిణామాలు
  • అష్టదిగ్బంధంలో మాజీ సీఎం కేసీఆర్
  • ఈడీ కేసులో ఇరుక్కున్న కుమార్తె కవిత
  • ఉచ్చులా బిగుస్తున్న ట్యాపింగ్ వ్యవహారం
  • తీగ లాగితే పెద్ద పెద్ద డొంకలే కదిలే అవకాశం

విధాత ప్రత్యేక ప్రతినిధి: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలై అధికారం కోల్పోయిన భారత రాష్ట్ర సమితి (బీఆరెస్‌) అగ్నిపరీక్షను ఎదుర్కొంటున్నది. ప‌దేండ్లు రాష్ట్రాన్ని ఏకచత్రాధిపత్యంతో పాలించిన కేసీఆర్ తన రాజకీయ జీవితంలో ఎన్నడూ లేనంత ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అష్టదిగ్భంధానికి గురై ఊపిరిసలపని పరిస్థితిని అనుభవిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి కోలుకోకముందే లోక్‌సభ ఎన్నికలు పార్టీ మనుగడకే సవాల్‌ విసురుతున్న పరిస్థితి కనిపిస్తున్నది. లోక్‌సభ ఎన్నికల్లో గణనీయ ఫలితాలు సాధించని పక్షంలో పార్టీ ఉనికి ప్రశ్నార్థకమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పుడు మరిన్ని కొత్త సవాళ్లు ఎదుర్కొనాల్సి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

దశాబ్దంన్నర పాటు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేయడంలో కేసీఆర్‌, నాటి టీఆరెస్‌ పాత్ర తక్కువేమీ కాదు. రాష్ట్రం సిద్ధించిన‌ అనంతరం అప్రతిహతంగా రెండు ప‌ర్యాయాలు అధికారంలో ఉన్నది. మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ముచ్చటపడిన కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలు గట్టి గుణపాఠమే చెప్పారు. కేసీఆర్‌ను గద్దె దించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీకి అవకాశం కల్పించారు. తీవ్రమైన ఓటమి నుంచి ఆ పార్టీ కోలుకోకముందే నాలుగు నెలల స్వల్పకాలంలోనే పార్లమెంట్ ఎన్నికలు ముంచుకురావడం స‌వాల్‌గా మారింది.

ఎన్నికల అనంతరం అనూహ్య పరిణామాలు

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్దికాలంలోనే అనూహ్య పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం. ముఖ్యంగా ఎన్నికలు పూర్తి కాగానే కేసీఆర్ బాత్రూంలో జారిపడి తుంటికి ఆపరేషన్ కావడం నుంచి దీనికంటే ఎన్నికలకు ముందు జరిగిన మేడిగడ్డ బరాజ్ కుంగుబాటు ఆ పార్టీని నీడలా వెంటాడుతోంది. బీఆరెస్‌, ముఖ్యంగా ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ మేడిగడ్డ బరాజ్ భాగంగా ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న విషయం జగద్విదితం. ఆ పార్టీ నేతలు, స్వయంగా అధినేత ఇతరులెవరికీ ఇలాంటి నిర్మాణం సాధ్యం కాదని ప్రచారం చేసుకున్నారు. కానీ.. ఆ ప్రచారాన్ని మేడిగడ్డ పియర్స్ (పిల్లర్లు) కుంగిపోయి.. ఎదురుదెబ్బ కొట్టాయి. ఒక విధంగా పార్టీ, కేసీఆర్‌ ప్రతిష్ఠను దిగజార్చాయి. పైగా జరిగిన సంఘటనలో ఆత్మవిమర్శతో పాటు సమస్యకు పరిష్కారం చూపెట్టకపోగా ఎదురుదాడికి దిగటం తెలంగాణ ప్రజలకు రుచించలేదని చెప్పవచ్చు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా ప్రవేశపెట్టిన‌ శ్వేతపత్రాలు పదేండ్ల కేసీఆర్ పాలనను బహిర్గతం చేశాయి. దీనికి తోడు కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణంలో ఇరుక్కోవడం ఎన్నికల ముందు ఎజెండా కాగా, ఎన్నికల తర్వాత రాద్ధాంతంగా మారింది. తాజాగా కవిత అరెస్టు, జైలు ఆ పార్టీని మరింత ఇబ్బందుల్లోకి నెట్టాయి. మరో వైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మెడకుచుట్టుకుంటోంది. ఇది బీఆరెస్‌లోని పెద్ద నాయకులకు కూడా పాకే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు అంటున్నారు.

పెరుగుతున్న వలసలు

ఇలాంటి ఇబ్బందికరమైన వాతావరణం నెలకొననగా గోరుచుట్టుపై రోకటిపోటులా పార్టీ నుంచి భారీ స్థాయిలో నాయకులు, కార్యకర్తలు వలసపోవడం ఇబ్బందిగా మారింది. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌ పార్టీలకు పెద్ద సంఖ్యలో సాగుతున్న వలసలు గులాబీ నాయకత్వానికి కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. నిజానికి ఎన్నికల ఫలితాలు వెలువడగానే బీఆరెస్‌ ఎమ్మెల్యేలుగా గెలిచిన మాజీ మంత్రి కడియం, ఎమ్మెల్యే ప‌ల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు పలువురు నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతోందని జోస్యాలు చెప్పడం ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత విభేదాలు ఈ ప్రభుత్వం కూలిపోయేందుకు దోహదం చేస్తాయని చెబుతూ వచ్చారు. ఈ మాటలపై కాంగ్రెస్ ఎదురుదాడికి దిగగానే మాటమార్చారు. ఇప్పుడు ఆ మాటలే బీఆరెస్‌కు ఇబ్బందిగా మారాయి. నైతికత అంశాన్ని పక్కకుపెడితే తమ ప్రభుత్వ రక్షణకు ఫిరాయింపులను ప్రోత్సహించక తప్పలేదంటూ గేట్లు ఎత్తుతున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. సికింద్రాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకున్నారు. తాజాగా నాగేందర్‌ను సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం రాజకీయ కలవరానికి దారితీసింది. పలువురు సిట్టింగ్ ఎంపీలు కూడా పార్టీని వీడారు. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. కొందరు నాయకులు ఎన్నికల్లో పోటీచేసేందుకు వెనుకంజ వేస్తున్నారు. శాసన సభ ఎన్నికలు ముగిసినప్పటి నుంచి వరుసగా జరుగుతున్న పరిణమాలు బీఆరెస్‌ను తీవ్రమైన ఇబ్బందుల్లోకి నెట్టివేశాయి. ఒక విధంగా అష్టదిగ్బంధానికి గురైన పరిస్థితిలో కేసీఆర్, ఆయన పార్టీ ఉందని రాజ‌కీయ ప‌రిశీలకులు భావిస్తున్నారు. దయనీయమైన ఈ పరిస్థితిలో పార్లమెంట్ ఎన్నికలు ఆ పార్టీని అంతర్గతంగా కుదిపేస్తున్నాయని చెప్పవచ్చు. మెజార్టీ సిట్టింగ్ ఎంపీలు రెండు పార్టీల్లోకి జంప్ అయ్యారు. జహీరాబాద్, చేవెళ్ల, వ‌రంగల్ ఎంపీలు, ప‌లువురు నాయకులు పార్టీని వీడారు.

13 సీట్లలో కొత్తవారే

తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకుగానూ ముగ్గురు సిట్టింగులకు బీఆరెస్‌ అధినేత అవకాశం కల్పించారు. ఖమ్మం, మహబూబాబాద్, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌ స్థానాలు సిట్టింగ్‌లకు ఇచ్చారు. కరీంనగర్ సీటు గత ఎన్నికల్లో పోటీచేసిన బీ వినోద్‌కుమార్‌కు అభ్యర్థికి కేటాయించారు. ఇక మిగిలిన 13 స్థానాలు కొత్తవారిని బరిలో దింపడం విశేషం. ఎంపీ టికెట్ కోసం పార్టీలో కనీస పోటీ లేదని పార్టీ వర్గాల్లోనే చర్చించుకోవడం గమనార్హం. ఓడిపోయే స్థానానికి పోటీ ఎందుకనే అభిప్రాయంతో పలువురు నేతలు ఉన్నారన్న చర్చలూ నడిచాయి. వలసలను నివారించేందుకు బుజ్జగింపులు చేసినా ప్రయోజనం లేకుండా పోతోంది. చేవెళ్ళ టికెట్ రంజిత్ రెడ్డికి బీఆరెస్‌ ముందుగా డిక్లేర్ చేసినప్పటికీ ఆ పార్టీని కాదంటూ అధికార కాంగ్రెస్‌లో చేరిపోయి ఆ పార్టీ నుంచి పోటీకి సిద్ధమయ్యారు. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ పార్టీ మారుతున్నారని తెలిసి ఆయనను బలవంతంగా కేసీఆర్ దగ్గరికి తీసుకెళ్ళి బుజ్జగించినా.. ఆ తర్వాత బీజేపీలో చేరిపోయారు. ఆ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా మారిపోయారు.

పగులుతున్న పాపాల పుట్ట!

రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకున్న తర్వాత ఏ పార్టీని వదలకుండా అన్ని పార్టీలకు చెందిన వారిని తమ పార్టీలో చేర్చుకోవడం వల్ల నాయకుల కొరత ఆ పార్టీకి ప్రస్తుతానికి లేనప్పటికీ రానున్న రోజుల్లో వలసలు ఆగకుంటే ఇబ్బందికరమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆర్థికంగా పార్టీ బలంగా ఉన్నందున ఇప్పటికిప్పుడు బాధలేనప్పటికీ రానున్న రోజుల్లో ఏ విధంగా ఉంటుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది. ఎన్నికల అనంతరం బీఆరెస్‌ పార్టీకి పాజిటివ్ జరిగిన పరిణామమేమైనా ఉందంటే పొత్తు పేరుతో బీఎస్పీ నుంచి వచ్చిన ఆర్ఎస్‌ ప్రవీణ్ కుమార్ ఆ పార్టీని కాదని బీఆరెస్‌ గూటికి చేరడమే. ఇప్పుడు రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీఆరెస్‌ ఎన్ని సీట్లు గెలుచుకుంటుందనే అంశంపై దాని భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. లోక్‌సభకు కూడా అభ్యర్థులను గెలిపించుకోలేని పక్షంలో రాబోయే కాలంలో జరిగే పరిణామాలు బీఆరెస్‌కు కొత్త సవాళ్లు విసురుతాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి రాబోయే కాలం అంతా బీఆరెస్‌ అగ్నిపరీక్షలే ఎదుర్కోనున్నదని అంటున్నారు.