TRT |
విధాత: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీఆర్‌టీ(టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్టు) 2023 నోటిఫికేషన్ రానే వచ్చింది. అదేదో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అధికారికంగా ప్రకటించలేదు. ఏదో ఓ పేపర్‌కు ప్రకటన రూపంలో టీఆర్‌టీ నోటిఫికేషన్ ఇచ్చింది రాష్ట్ర విద్యాశాఖ. ఆ ప్రకటనను చూస్తే గానీ తెలియలేదు.
టీఆర్‌టీ నోటిఫికేషన్ వచ్చిందని. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని నిరుద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్న తరుణంలో.. ప్రకటన రూపంలో ప్రభుత్వం దొంగచాటుగా నోటిఫికేషన్ జారీ చేసి చేతులు దులుపుకుంది. 5089 పోస్టులతో కాకుండా ఖాళీగా ఉన్న 13 వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇక ఈ పోస్టుల అంశాన్ని కాసేపు పక్కన పెడితే.. నిరుద్యోగుల నడ్డి విరిచేలా దరఖాస్తు ఫీజును నిర్ణయించింది రాష్ట్ర విద్యాశాఖ. రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కుటుంబాలకు చెందిన వారు బీఈడీ, డీఈడీ చేస్తుంటారు. అలాంటి వారి పట్ల ప్రభుత్వం ఉదారంగా స్పందించాల్సింది పోయి.. ఫీజుల రూపంలో వేల రూపాయాలు వసూళ్లు చేస్తోంది.
రాష్ట్రంలో చివరిసారిగా టీఆర్‌టీ నోటిఫికేషన్ 2017లో వచ్చింది. అప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) టీచర్ పోస్టులను భర్తీ చేసింది. అయితే టీఎస్‌పీఎస్సీ టీఆర్‌టీ దరఖాస్తు ఫీజును కేవలం రూ. 280గా మాత్రమే నిర్ణయించి, వసూళ్లు చేసింది. అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు కింద రూ. 200, ప్రతి సబ్జెక్ట్‌కు రూ. 80 చొప్పున టీఎస్‌పీఎస్సీ వసూళ్లు చేసింది. ఇక బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్, ఎక్స్ సర్వీస్‌మెన్స్‌కు ఎగ్జామ్ ఫీజును వసూళ్లు చేయలేదు. కేవలం ప్రాసెసింగ్ ఫీజు కింద రూ. 200 మాత్రమే చెల్లించారు.
కానీ తాజాగా విడుదలైన నోటిఫికేషన్‌లో మాత్రం ఎలాంటి సడలింపులు ఇవ్వలేదు. ఒక్కొక్క ఉద్యోగానికి ప్రాసెసింగ్, రాత పరీక్ష ఫీజు కింద రూ. 1000 చెల్లించాలని పేర్కొంది విద్యాశాఖ. ఒక వేళ ఒకటికి మించి ఎక్కువ సబ్జెక్టులకు దరఖాస్తు చేయాల్సి వస్తే.. వేర్వేరుగా రూ. 1000 చొప్పున చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్‌లో విద్యాశాఖ స్పష్టంగా పేర్కొంది.
ఒక్కో సబ్జెక్టుకు రూ. 1000 వసూళ్లు చేయడం ఏంటని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. గతంతో పోల్చితే ప్రాసెసింగ్, రాత పరీక్ష ఫీజు 5 రెట్లు పెంచడం ఏంటని నిరుద్యోగులు నిలదీస్తున్నారు. దరఖాస్తు ఫీజు విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని నిరుద్యోగులు విద్యాశాఖను కోరుతున్నారు.