TSRTC | టీఎస్ఆర్టీసీ బిల్లుకు అడ్డంకులు

TSRTC బిల్లు ఆమోదానికి సమయం కావాలన్న రాజ్‌భవన్‌ గవర్నర్ తీరుపై ప్రభుత్వం, ఆర్టీసీ సంఘాల ఆగ్రహం రాజ్‌భవన్ ముట్టడిస్తామన్న ఆర్టీసీ సంఘాలు నేటితో సమావేశాల ముగింపు..బిల్లు కోసం సమావేశాల పొడగింపుపై సందేహాలు విధాత : ఆర్టీసీనీ ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టాలనుకున్న ప్రభుత్వానికి గవర్నర్ రూపంలో ఆటంకం ఏర్పడింది. ఆర్టీసీ బిల్లు మరోసారి ప్రభుత్వానికి, రాజ్‌భవన్ కు మధ్య పంచాయతీని రాజేసింది. అయితే పంచాయతీలోకి ఇప్పుడు ఆర్టీసీ కార్మిక సంఘాలు కూడా ప్రవేశించడంతో […]

  • Publish Date - August 4, 2023 / 01:16 AM IST

TSRTC

  • బిల్లు ఆమోదానికి సమయం కావాలన్న రాజ్‌భవన్‌
  • గవర్నర్ తీరుపై ప్రభుత్వం, ఆర్టీసీ సంఘాల ఆగ్రహం
  • రాజ్‌భవన్ ముట్టడిస్తామన్న ఆర్టీసీ సంఘాలు
  • నేటితో సమావేశాల ముగింపు..బిల్లు కోసం సమావేశాల పొడగింపుపై సందేహాలు

విధాత : ఆర్టీసీనీ ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టాలనుకున్న ప్రభుత్వానికి గవర్నర్ రూపంలో ఆటంకం ఏర్పడింది. ఆర్టీసీ బిల్లు మరోసారి ప్రభుత్వానికి, రాజ్‌భవన్ కు మధ్య పంచాయతీని రాజేసింది. అయితే పంచాయతీలోకి ఇప్పుడు ఆర్టీసీ కార్మిక సంఘాలు కూడా ప్రవేశించడంతో ఈ వివాదం మరింత ముదిరింది.

43వేల మంది కార్మికుల భవిష్యత్తు దృష్ట్యా ఆర్టీసీ బిల్లును గవర్నర్ వెంటనే ఆమోదించి ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు పాస్ అయ్యేలా సహకరించాలని, లేదంటే రాజ్ భవన్‌ను ముట్టడిస్తామంటు ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకుడు థామస్ రెడ్డి ప్రకటించడం వివాదానికి మరింత ఆజ్యం పోసింది. గవర్నర్ ఆమోదించి తమకు పంపిస్తే ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఆర్టీసీ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపచేస్తామని ప్రభుత్వం చెబుతుంది.

అయితే అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ఒక్క రోజు ముందుగా ఈ నెల 2వ తేదిన 3.30గంటలకు తమకు ప్రభుత్వం ఆర్టీసీ విలీనం ముసాయిదా బిల్లును పంపించిందని, దానిని పరిశీలించేందుకు తమకు కొంత సమయం కావాలని, న్యాయ నిపుణుల సలహా తీసుకోవాల్సివుందని రాజ్‌భవన్ ప్రెస్ సెక్రటరీ గవర్నర్ తరుపునా ప్రకటన విడుదల చేశారు. అదిగాక ప్రస్తుతం గవర్నర్ తమిళిసై పుదుచ్చేరిలో ఉన్నారు. ఆమె ఈ నెల 8వ తేదిన రాష్ట్రానికి రానుండగా, వచ్చాకే బిల్లుపై నిర్ణయం వెలువరించే అవకాశముంది.

దీంతో ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదం ప్రస్తుత అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లోగా లభించే అవకాశం లేదు. అటు ప్రభుత్వానికి ఇదే చివరి అసెంబ్లీ సమావేశాలు కావడం, శనివారంతో సమావేశాలు ముగించాలని నిర్ణయించుకోవడంతో ఈ సమావేశాల్లోనే ఆర్టీసీ బిల్లు ఆమోదించాలని, అది తమకు రాజకీయంగా రానున్న ఎన్నికల్లో కలిసివస్తుందని భావించింది. ప్రభుత్వ ఆలోచనకు విరుద్ధంగా గవర్నర్ వద్ద ఆర్టీసీ బిల్లు పెండింగ్‌లో పడిపోవడంతో గవర్నర్ తీరుపై ప్రభుత్వం ఆగ్రహంతో ఉంది. ఈ నేపధ్యంలో గవర్నర్‌పై ఒత్తిడి పెంచేందుకు ప్రభుత్వమే ఆర్టీసీ కార్మికు సంఘాలను ఆందోళనల దిశగా పురిగొల్పుతుందన్న ప్రచారం కూడా వినిపిస్తుంది.

ముందుగా అనుకున్న మేరకు అసెంబ్లీ వర్షాకాల సమావేశాల గడువు నేటి శనివారం వరకే ఉండటంతో అప్పట్లోగా గవర్నర్ బిల్లు ఆమోదించి పంపకపోతే ప్రత్యామ్నాయం ఏమిటన్నదానిపై కూడా ప్రభుత్వం తీవ్ర పరిశీలన చేస్తుంది. ఆర్టీసీ బిల్లు ఆర్ధిక బిల్లు కావడంతో కేబినెట్ తీర్మానంతో గవర్నర్‌కు ముసాయిదా బిల్లును పంపించారని, గవర్నర్ ఆమోదం లేకపోయినా సభలో బిల్లు పాస్ చేసి మళ్లీ గవర్నర్ కు పంపించవచ్చంటూ కొందరు నిపుణులు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ఆర్టీసీ బిల్లు ఆమోద ప్రక్రియలో రేగిన వివాదంలో చివరకు ప్రభుత్వం ఏమి చేయబోతుందన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది.

ఒకవేళ ప్రభుత్వం ఆశించినట్లుగా గవర్నర్ ఆమోదంతో బిల్లు సకాలంలో అందకపోతే, ఈ సమావేశాల్లో శాసనసభలో బిల్లు ఆమోదించలేని పరిస్థితి ఏర్పడితే ప్రభుత్వం ఆ నెపాన్ని గవర్నర్‌ మీదికి నెట్టి వేసి, తాను తెలివిగా సమస్యను దాటవేసే ప్రయత్నం చేయవచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. లేదంటే అసెంబ్లీ సమావేశాలు పొడగించి బిల్లు ఆమోదం పొందేలా ప్రభుత్వం పయత్నిస్తుందో లేదో చూడాల్సివుంది. మొత్తం మీద ఆర్టీసీ బిల్లు గవర్నర్ వర్సెస్ ప్రభుత్వమన్నట్లుగా మారడంతో పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.