Twin Siters Marriage | కవల పిల్లలు అంటేనే ఇద్దరి పోలికలు ఒకేలా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అసలు గుర్తు పట్టలేం. అయితే కవలలు.. కవలలనే పెళ్లి చేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. కవలలు వేర్వేరు అబ్బాయిలను వివాహమాడిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ కవలలు మాత్రం ఒకే అబ్బాయిని పెళ్లాడారు. ఒక్కరితోనే ఆ కవలలు తమ సంసార జీవితాన్ని కొనసాగించనున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్ర సోలాపూర్ జిల్లాలోని మాల్‌షిరాస్ తాలుకాకు చెందిన రింకీ, పాంకీ అనే ఇద్దరు కవలలు ఉంటున్నాయి. వృత్తిరీత్యా ఇద్దరు అమ్మాయిలు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు. వీరిద్దరూ చిన్నప్పట్నుంచి కలిసిమెలిసి ఉండేవారు. ఏ పని చేసినా ఇద్దరు కలిసి చేసేవారు. అంతే కాదు జీవితంలో పెళ్లి చేసుకుంటే ఒకే యువకుడిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇలా పెళ్లి చేసుకోవాలనుకోవడం వారి చిన్నప్పటి కల.
అయితే వీరి తండ్రి కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. తల్లీ కూడా ఇటీవలే అనారోగ్యానికి గురైంది. దీంతో అతుల్ అనే యువకుడి కారులో కవలలు తమ తల్లిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇక అతుల్‌తో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమకు దారి తీసింది.
కవలలు ఆ అబ్బాయిని ప్రేమించారు. చిన్నప్పటి కలను నెరవేర్చుకునేందుకు కవలలు అతన్ని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇరు కుటుంబాల మద్దతుతో శుక్రవారం వారి వివాహం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు 300 మంది అతిథులు వచ్చి ఆ ట్రిపుల్ జంటను ఆశీర్వదించారు.