సోషల్ మీడియా వార్‌కు రేవంత్ రెడ్డి బూట్లు.. చెప్పులు
కాంగ్రెస్, బీఆరెస్ వర్గాల మధ్య సోషల్ మీడియా వేదికగా సాగుతున్న యుద్దంలో చివరకు తమ నాయకుల బూట్లు, చెప్పులు, వాచ్‌లు కూడా రాజకీయ అస్త్రాలుగా మారాయి.

- కవిత వాచ్
విధాత: కాంగ్రెస్, బీఆరెస్ వర్గాల మధ్య సోషల్ మీడియా వేదికగా సాగుతున్న యుద్దంలో చివరకు తమ నాయకుల బూట్లు, చెప్పులు, వాచ్‌లు కూడా రాజకీయ అస్త్రాలుగా మారాయి. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి వేసుకున్న చెప్పుల ఖరీదు 50వేలుగా ఉందని, ప్రజాపాలన చేస్తున్న సీఎం చెప్పులు అంత ఖరీదైతే, దొరల పాలన చేసిన మాజీ సీఎం కేసీఆర్ వాడిన చెప్పులు 500 రూపాయలు మాత్రమేనని బీఆరెస్ సోషల్ మీడియా సైనికులు ట్వీట్ వార్ ప్రారంభించారు.
అలాగే రైతుబిడ్డ రేవంత్‌రెడ్డి బూట్ల ఖరీదు అక్షరాలా 93,000 రూపాయాలని, అంటే ఆ పైసలతో ఒక 20 ఎకరాలకు ఒక దఫా రైతుబంధు ఇయ్యొచ్చంటూ..రైతులకు రైతుబంధు ఇయ్యడు కానీ లక్షల విలువగల బూట్లేసుకుని తిరుగుతాడని గులాబీ సోషల్ మీడియా సైనికులు ట్వీట్ల దాడి చేశారు.
దీనికి కౌంటర్‌గా కాంగ్రెస్ సోషల్ మీడియా సైన్యం మరి మీ దొరగారి బిడ్డ కవితమ్మ ధరించే 20లక్షల వాచ్ సంగతేమిటంటూ ప్రతిదాడి చేశారు. రైతుబిడ్డ ఖరీదైన బూట్లు, చెప్పులు ధరించవద్దా అని, మీ దొర బిడ్డలే ధరించాలా అంటూ కౌంటర్లు వేశారు. బీఆరెస్ నేతలు చివరకు ఖరీదైన చెప్పులంటూ ఏడ్చే స్థాయికి దిగజారిపోయారంటూ సెటైర్లు విసిరారు.