ముంబై : మహారాష్ట్రలోని తడోబా అంధేరి టైగర్ రిజర్వ్ సమీపంలో రెండు పులులు మృతి చెందాయి. సోమవారం ఉదయం ఖంతోల్ చెరువు సమీపంలో పులుల కళేబరాలను గమనించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అటవీశాఖ అధికారులను పులుల కళేబరాలను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఒకటి ఆడ పులి అని అధికారులు పేర్కొన్నారు.
శనివారం అర్ధరాత్రి సమయంలో రెండు పులుల మధ్య ఫైటింగ్ జరిగి ఉండొచ్చని, ఆ క్రమంలోనే అవి చనిపోయి ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. ఆ ఏరియాలో ఇప్పటికే కెమెరాలు ఏర్పాటు చేశామని, ఆ ఫుటేజీ పరిశీలిస్తామన్నారు. ఆడ పులి శరీరంలోని కొంత భాగం కనిపించడం లేదన్నారు. మగ పులి వయసు 7 ఏండ్లు కాగా, ఆడ పులి చిన్నదని తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం పులుల కళేబరాలను చంద్రాపూర్‌లోని ట్రాన్సిట్ ట్రీట్‌మెంట్ సెంటర్‌కు తరలించారు. పోస్టుమార్టం ఇవాళ నిర్వహించే అవకాశం ఉందని అటవీశాఖ అధికారులు తెలిపారు.