Budget 2024 | పన్ను చెల్లింపుదారులకు బడ్జెట్ ఏం చెబుతున్నది?
2024 కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు సమర్పించారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు బడ్జెట్ కావడంతో తాత్కాలిక పద్దును ప్రవేశపెట్టారు

- ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్‌లో మార్పు లేదు
- యథాతథంగా కొనసాగిస్తున్నట్టు నిర్మల వెల్లడి
- 2024-25లో విత్తలోటును జీడీపీ 5.1 శాతంగా ఉంచడమే టార్గెట్
- పీఎంఏవై-జీ కింద కొత్తగా మరో రెండు కోట్ల ఇళ్లు
Budget 2024 | న్యూఢిల్లీ : 2024 కేంద్ర మధ్యంతర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంటుకు సమర్పించారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు బడ్జెట్ కావడంతో తాత్కాలిక పద్దును ప్రవేశపెట్టారు. ఎంతోకాలంగా ఆదాయం పన్ను చెల్లింపుదారులు ఎదురుచూసిన స్లాబుల మార్పు విషయంలో మాత్రం నిర్మలమ్మ కరుణించలేదు. గత ఏడాది విధానమే కొనసాగుతుందని తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరం సవరించిన విత్త లోటులో ప్రభుత్వ ఆదాయానికి, వ్యయానికి మధ్య తేడా జీడీపీలో 5.8 శాతంగా ఉన్నదానిని 2024-25 ఆర్థిక సంవత్సరంలో 5.1%గా అంచనా వేశారు. తద్వారా 2025-26 ఆర్థిక సంవత్సరంలో విత్తలోటును జీడీపీలో 4.5 శాతానికి తగ్గించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఆదాయం పన్ను స్లాబుల్లో ఎలాంటి మార్పులు లేవు. గత పదేళ్లుగా డైరెక్ట్ ట్యాక్స్ వసూళ్లు మూడు రెట్లు పెరిగాయని నిర్మలాసీతారామన్ తెలిపారు. రిటర్న్ ఫైల్ చేసేవారు 2.4 రెట్లు పెరిగినట్టు చెప్పారు. ఆదాయం పన్ను చెల్లింపుదారుల వాటాను దేశ సంక్షేమానికి, ప్రజల సంక్షేమానికి తెలివిగా ఖర్చుచేస్తామని ఆమె హ ఆమె ఇచ్చారు. పన్ను చెల్లింపుదారులు మద్దతు ఇస్తున్నారంటూ అభినందనలు తెలిపారు. ప్రభుత్వం పన్ను రేట్లను హేతుబద్ధం చేసిందని చెప్పారు. కొత్త పన్నుల పథకం కింద రూ.7 లక్షల ఆదాయం వరకూ ఎలాంటి పన్ను ఉండదని చెప్పారు. ఇందుకు ఎలాంటి పొదుపు, పెట్టుబడుల అవసరం ఉండదని అన్నారు. అంతకు మించి ఆదాయం కలిగిన వారికి మాత్రమే స్లాబుల మేరకు పన్ను వర్తిస్తుందన్నారు.
గతేడాది ప్రతిపాదించిన పన్ను విధానంలో ఆదాయం పరిమితి రెండున్నర లక్షల రూపాయలుగానే ఉంటుందని నిర్మల తెలిపారు. పాత పన్ను విధానంలోనూ పన్ను వర్తించే ఆదాయం రూ.5 లక్షల లోపు ఉన్నప్పుడు ఎటువంటి భారం ఉండబోదన్నారు. ప్రస్తుతం ఉన్న దేశీయ కంపెనీల కార్పొరేట్ పన్ను రేటు 30% నుంచి 22 శాతానికి తగ్గించినట్టు తెలిపారు. నిర్దిష్టమైన కొత్త తయారీ కంపెనీలకు పన్నురేటు 15శాతం చేశామని బడ్జెట్ ప్రసంగంలో సీతారామన్ పేర్కొన్నారు. 2024-25లో పన్ను ద్వారా ఆదాయం 26.02 లక్షల కోట్లు సమకూరుతున్నదని అంచనా వేస్తున్నటు తెలిపారు. స్టార్టప్ కంపెనీలకు 2025 మార్చి 31 వరకూ పన్ను మినహాయింపు ఉంటుందని చెప్పారు.
ప్యాసింజర్ రైళ్ల ఆపరేషన్లను మెరుగుపర్చేందుకు ఇంధనం, ఖనిజాలు, సిమెంట్ కారిడార్, నౌకాశ్రయాల అనుసంధాన కారిడార్లు, రద్దీ ఎక్కువగా ఉంటే ప్రాంతాల కారిడార్లు.. మూడు ప్రధాన ఎకనమిక్ రైల్వే కారిడార్ కార్యక్రమాలను నిర్మలాసీతారామన్ ప్రకటించారు. వీటి వల్ల తక్కువ ఖర్చుతోనే సరుకు రవాణా మరింత సమర్థవంతంగా మారుతుందని చెప్పారు. రద్దీ ఎక్కువగా ఉండే కారిడార్లలో రద్దీని తగ్గించడం వల్ల ప్యాసింజర్ రైళ్ల రాకపోకలు కూడా మెరుగవుతాయని, భద్రత, ప్రయాణ వేగం పెరుగుతాయని తెలిపారు. సరుకు రవాణా ఖర్చును కూడా ఇవి తగ్గిస్తాయని చెప్పారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద కొత్తగా రెండు కోట్ల ఇళ్లు నిర్మించనున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ చెప్పారు.
సాంకేతిక నైపుణ్యాలు ఉన్న యువతక ఇది స్వర్ణయుగమన్న నిర్మలాసీతారామన్.. 50 ఏళ్లపాటు వడ్డీ లేకుండా రుణాలు అందించేందుకు లక్ష కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. దీని ద్వారా దీర్ఘకాలిక ఆర్థిక సహాయం, పునర్ ఆర్థిక సహాయం అందించేందుకు వీలవుతుందని తెలిపారు. వీటికి అతి తక్కువ వడ్డీ లేదా అసలు వడ్డీయే లేకుండా ఆర్థిక సహాయం అందించవచ్చన్నారు. వర్ధమాన డొమైన్లలో పరిశోధనలు, నూతన ఆవిష్కరణలకు ప్రైవేటు రంగాన్ని ఇది ప్రోత్సహిస్తుందని తెలిపారు.
మన దేశ యువత, సాంకేతిక పరిజ్ఞానం శక్తులను ఏకం చేసే కార్యక్రమాలు ఇప్పుడు అవసరమని ఆర్థిక మంత్రి అన్నారు. ప్రస్తుతం ఉన్న హాస్పిటళ్ల మౌలిక వసతులను ఉపయోగించుకుని మరిన్ని మెడికల్ కాలేజీలు ఏర్పాటుకు ప్రణాళికలను ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఇందుకోసం తగిన సిఫారసులు చేసేందుకు ఒక కమిటీని నియమిస్తామన్నారు. ట్రిపుల్ తలాఖ్‌ను చట్ట వ్యతిరేకమని ప్రకటించడం, లోక్‌సభ, అసెంబ్లీల్లో మహిళలకు మూడోవంతు రిజర్వేషన్ కల్పించడం, పీఎం ఆవాస్ యోజన కింద 70 శాతం ఇండ్లను మహిళలకే కేటాయించడం వంటి చర్యలతో వారి గౌరవం పెరిగిందని చెప్పారు.
సౌర విద్యుత్తును అందించేందుకు ఒక పథకాన్ని ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించారు. రూఫ్ టాప్ సోలారైజేషన్ ద్వారా కోటి ఇండ్లకు నెలకు 300 యూనిట్ల విద్యుత్తును అందిస్తామని తెలిపారు. 2070 నాటికి నెట్ జీరో సాధించే లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నదని చెప్పారు.పర్యాటకానికి ఊతమిచ్చేందుకు రాష్ట్రాలకు దీర్ఘకాలిక వడ్డీ రహిత రుణాలు ఇస్తామని తెలిపారు. గడిచిన పదేళ్లలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ సానుకూల రూపాంతరం చెందిందని నిర్మల తన ఉపన్యాసం మొదట్లో చెప్పారు.
పేదలు, మహిళలు, యువత, రైతులు, వారి అవసరాలు, ఆకాంక్షలు దేశ ప్రగతికి మార్గనిర్దేశం చేస్తాయని అన్నారు. భారతదేశాన్ని 2047 నాటికి వికసిత్ భారత్‌లా మార్చేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని చెప్పారు. తమ దృష్టి మొత్తం ‘సబ్ కా సాత్ సబ్కా వికాస్’పైనే ఉన్నదని తెలిపారు. జీడీపీకి కొత్త అర్థం చెప్పిన నిర్మల.. ‘ప్రభుత్వం జీడీపీ.. గవర్నెన్స్, డెవలప్మెంట్, పెర్ఫార్మెన్స్..పై కూడా సమాన దృష్టిని పెట్టింది’ అని వివరించారు. తదుపరి పూర్తి స్థాయి బడ్జెట్‌ను రాబోయే ఎన్నికల అనంతరం ఏర్పడే కొత్త ప్రభుత్వం ప్రవేశపెడుతుంది.