Dharmapuri: తాళాలు మాయం.. తెరుచుకోని ధర్మపురి స్ట్రాంగ్ రూమ్..! పగలకొడతామన్న అధికారులు 

అభ్యంతరం తెలిపిన కాంగ్రెస్ అభ్యర్థి విధాత బ్యూరో, కరీంనగర్: జగిత్యాల జిల్లా ధర్మపురి ఎన్నిక రీకౌంటింగ్ విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈవిఎం‌లు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసి సంబంధిత పత్రాలను తమకు సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో స్ట్రాంగ్ రూమ్ తెరిచేందుకు జిల్లా కలెక్టర్, సంబంధిత యంత్రాంగం ఈవీఎంలు భద్రపరిచిన కళాశాల వద్దకు చేరుకున్నారు. అయితే స్ట్రాంగ్ రూమ్ కు సంబంధించిన తాళపు చేతులు దొరకలేదు. అవి కనిపించకుండా పోవడం […]

  • Publish Date - April 10, 2023 / 11:46 AM IST

  • అభ్యంతరం తెలిపిన కాంగ్రెస్ అభ్యర్థి

విధాత బ్యూరో, కరీంనగర్: జగిత్యాల జిల్లా ధర్మపురి ఎన్నిక రీకౌంటింగ్ విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈవిఎం‌లు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసి సంబంధిత పత్రాలను తమకు సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఈ క్రమంలో స్ట్రాంగ్ రూమ్ తెరిచేందుకు జిల్లా కలెక్టర్, సంబంధిత యంత్రాంగం ఈవీఎంలు భద్రపరిచిన కళాశాల వద్దకు చేరుకున్నారు. అయితే స్ట్రాంగ్ రూమ్ కు సంబంధించిన తాళపు చేతులు దొరకలేదు. అవి కనిపించకుండా పోవడం ప్రశ్నార్థకమైంది. జిల్లా అదనపు కలెక్టర్ వద్ద భద్రంగా ఉండాల్సిన స్ట్రాంగ్ రూమ్ తాళపు చెవులు మాయం కావడం అనేక అనుమానాలకు తావునిస్తోంది. తాళపు చెవులు లేని కారణంగా తాళాలు పగలగొట్టి స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయాలన్న అధికారుల నిర్ణయానికి కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అభ్యంతరం తెలిపారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎన్నికల ఫలితాలు తారుమారు చేశారని ఆరోపిస్తూ రీకౌంటింగ్ చేయాల్సిందిగా కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

ఇరుపక్షాల వాదనలను, అభ్యర్థుల తరపు న్యాయవాదులు కోర్టు ముందు ఉంచారు. కోర్టు తాజా ఉత్తర్వుల మేరకు జగిత్యాల జిల్లా నూకపెల్లి శివారులో గల వి.ఆర్.కె ఇంజినీరింగ్ కళాశాలలో భద్రపరిచిన ఈవిఎం స్ట్రాంగ్ రూమ్‌ను జిల్లా కలెక్టర్ ఉదయం 10 గంటలకు కోర్టు, సంబంధిత అధికారులతో పాటు కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ కుమార్ సమక్షంలో తెరవాల్సి ఉంది. ఇందుకు సంబంధించి గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరికీ జిల్లా యంత్రాంగం సమాచారం ఇచ్చింది.

వి‌ఆర్‌కె ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్న ఈవీఎం స్ట్రాంగ్ రూమును ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్, అభ్యర్థుల సమక్షంలో 10 గంటలకు ఓపెన్ చేసి ప్రక్రియను ప్రారంభించాల్సి ఉండగా, ఆ ప్రక్రియ వాయిదా పడింది.

గత అసెంబ్లీ ఎన్నికలలో ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించి ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్ల లోని 258 ఈవీఎంలలో గల సమాచారాన్ని, ఎన్నికల ఓటింగ్ ప్రక్రియలో కీలకమైన 17A తో పాటు 17C పత్రాలను జిరాక్స్ తీసి అటెస్ట్ చేసిన ఆ కాపీలను హైకోర్టు ఆదేశాల మేరకు ఈరోజు సమర్పించాల్సి ఉంది.

వాటితో పాటుగా కౌంటింగ్ సరళికి సంబంధించి సిసి ఫుటేజ్ కాపీలను తమకు అందజేయాలని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. స్ట్రాంగ్ రూమును తెరుస్తున్న నేపథ్యంలో గత ఎన్నికల్లో ధర్మపురి నుండి పోటీ చేసిన అభ్యర్థులు అందరూ రావాలని కోరినా కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, బీఆర్ఎస్ నుండి మంత్రి కొప్పుల ఈశ్వర్ తరపున డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు.

ఇది మంత్రి కొప్పుల ఈశ్వర్ కుట్ర

పటిష్టమైన భద్రత మధ్య ఉండాల్సిన ఈవీఎంలకు రక్షణ లేకుండా పోయిందనడానికి
స్ట్రాంగ్ రూమ్ తాళం చెవులు మాయం కావడం నిదర్శనమని కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. దీని వెనుక మంత్రి కొప్పుల ఈశ్వర్ కుట్ర ఉందని ఆయన ఆరోపించారు.

తాళం చెవులు మాయం కావడానికి బాధ్యులు ఎవరు? దీని వెనుక ఉన్న మతలబు ఏమిటి అని ఆయన ప్రశ్నించారు. ఈ అంశంపై రేపు కోర్టులో విచారణ ఉన్నందున, కోర్టు నిర్ణయం, తమ న్యాయవాదుల సూచన మేరకు భవిష్యత్ కార్యాచరణ ఉంటుందన్నారు.

అధికారుల మల్లా గుల్లాలు

స్ట్రాంగ్ రూమ్ తాళాల మాయం జగిత్యాల జిల్లా అధికార యంత్రాంగానికి తలనొప్పిగా మారింది.
ఈ విషయంలో కోర్టుకు ఏం సమాధానం చెప్పుకోవాలో తెలియక వారు మల్లా గుల్లాలు పడుతున్నారు.

Latest News