రూ. 200 తిరిగి ఇవ్వమన్నందుకు.. బాలుడి బట్టలూడదీసి కొట్టారు
ఉత్తరప్రదేశ్‌లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఇచ్చిన రూ. 200 తిరిగి ఇవ్వమన్నందుకు ఓ బాలుడికి బలవంతంగా మద్యం తాగించి, బట్టలూడదీసి కొట్టారు

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఇచ్చిన రూ. 200 తిరిగి ఇవ్వమన్నందుకు ఓ బాలుడికి బలవంతంగా మద్యం తాగించి, బట్టలూడదీసి కొట్టారు. ఈ ఘటన రెండు నెలల క్రితం యూపీలోని ఝాన్సీలో చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఝాన్సీకి చెందిన ఓ పదో తరగతి బాలుడు తన స్నేహితుడికి రూ. 200 ఇచ్చాడు.ఆ డబ్బులు తిరిగి ఇవ్వమని రెండు నెలల క్రితం కోరాడు. కానీ డబ్బులు ఇవ్వకుండా, ఆ అబ్బాయితో స్నేహితులు గొడవకు దిగారు. అయితే గత సోమవారం డబ్బులు ఇచ్చిన యువకుడు తన స్నేహితులతో కలిసి ఓ పార్కులో ఉన్నాడు. అక్కడికి వెళ్లిన తన క్లాస్‌మేట్స్.. ఆర్మీ పరేడ్‌కు వెళ్దామని చెప్పి, కారులో బయటకు తీసుకెళ్లారు.
నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లిన ఆ బాలుడి చేత బలవంతంగా మద్యం తాగించారు. రూ. 200 కావాలా అంటూ హింసించారు. అంతటితో ఆగకుండా బట్టలు విడిపించి, బెల్టులు, కర్రలతో ఇష్టమొచ్చినట్లు చితకబాదారు. దెబ్బలు తాళలేక బాధితుడు అక్కడ్నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటన బయటకు చెబితే చంపేస్తామని అతడిని దుండగులు బెదిరించారు.
దీంతో భయపడిపోయిన బాధితుడు ఈ విషయాన్ని ఎవరికి చెప్పలేదు. రెండు రోజుల క్రితం ఆ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాధితుడు, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.