దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య ఘటన మరువక ముందే అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ సీతాపూర్‌లో ఓ వ్యక్తి తన భార్యపై అనుమానంతో ఆమెను ముక్కలు ముక్కలుగా నరికేశాడు. ఈ ఘటన నవంబర్ 8వ తేదీన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. సీతాపూర్‌కు చెందిన పంకజ్ మౌర్య, జ్యోతికి గత కొన్నేండ్ల క్రితం వివాహమైంది. అయితే గత కొంతకాలం నుంచి జ్యోతి డ్రగ్స్‌కు బానిస అయి పంకజ్‌ను వదిలేసింది. వేరే ఇంట్లో ఉంటూ.. డ్రగ్స్ మత్తులో మరో వ్యక్తికి దగ్గరైంది. దీంతో పంకజ్ ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో తన స్నేహితుడు దుర్జన్ పాసి సహాయం తీసుకున్నాడు.
నవంబర్ 8వ తేదీన జ్యోతిని పంకజ్, దుర్జన్ కలిసి చంపేశారు. అనంతరం ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికేశారు. శరీర భాగాలను పూడ్చిపెట్టారు. అయితే జ్యోతి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. తన భార్యను తానే చంపినట్లు పంకజ్ పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. ఇక పంకజ్‌తో పాటు దుర్జన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.