Vande Bharat | వందే భారత్ స్లీపర్ బిగ్ అప్‌డేట్..!
భారతీయ రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వందే భారత్ రైళ్లు దేశవ్యాప్తంగా వివిధ మార్గాల్లో పరుగులు తీస్తున్నాయి

Vande Bharat | భారతీయ రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వందే భారత్ రైళ్లు దేశవ్యాప్తంగా వివిధ మార్గాల్లో పరుగులు తీస్తున్నాయి. దాదాపు 30కిపైగా రూట్లలో వందే భారత్ రైళ్లను రైల్వేశాఖ ప్రవేశపెట్టింది. ఈ క్రమంలోనే రైల్వేశాఖ వందే భారత్ స్లీపర్ రైళ్లను సైతం తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రాయ్‌బరేలిలోకి చెందిన ఎంసీఎఫ్‌తో పాటు కపుర్తలా రైల్‌కోచ్ ఫ్యాక్టరీ, చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో వందే భారత్ కోచ్‌లను తయారు చేస్తున్నాయి.
ఇప్పటికే వందే భారత్ రైళ్ల విజయవంతం కావడంతో ఇక స్లీపర్ రైళ్లను తీసుకువచ్చేందుకు రైల్వేశాఖ ప్రయత్నిస్తున్నది. యూపీ రాయ్‌బరేలీలోని మోడ్రన్ కోచ్ ఫ్యాక్టరీ (MCF) స్లీపర్ కోచ్‌లతో ఎనిమిది కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను సిద్ధం చేసింది. ఇక్కో రేక్‌లో 16 కోచ్‌లు ఉండనున్నాయి. ఇందులో 11 ఏసీ త్రీ టైర్, నాలుగు ఏసీ టూ టైర్, ఒకటి ఫస్ట్‌క్లాస్ కోచ్‌లు ఉంటాయి. ఈ కోచ్‌లను తర్వాత 20 నుంచి 24 వరకు పెంచాలని రైల్వేశాఖ భావిస్తున్నది.
సమాచారం మేరకు.. రాయ్‌బరేలీలోని మోడ్రన్ కోచ్ ఫ్యాక్టరీ, కపుర్తలలోని రైల్ కోచ్ ఫ్యాక్టరీ, చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో వందే భారత్ రైళ్లు ఉత్పత్తి చేస్తున్నాయి. మొదటి దశలో స్లీపర్ వందే భారత్ రైలు రెండు రేక్‌లను రూపొందిస్తామని, ఆ తర్వాత మిగతా వాటిని ప్రారంభించనున్నట్లు రైల్వే చీఫ్ పీఆర్‌వో తివారి పేర్కొన్నారు. స్లీపర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రేక్‌లతో పాటు, 2024 సంవత్సరంలో ఏసీ, నాన్ ఏసీ కోచ్ కాన్ఫిగరేషన్‌తో కూడిన పుష్ అండ్ పుల్ రైలు రేకుల తయారీని సైతం మోడ్రన్ కోచ్ ఫ్యాక్టరీకి అప్పగించిన విషయం తెలిసిందే.
రైల్వేశాఖ ఈ ఏడాది మార్చి చివరి నాటికి వందే భారత్ రైళ్లను పట్టాలెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. గతేడాదిలో వందే భారత్ స్లీపర్ రైళ్లలో మార్చి వరకు నడిపించనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. బడ్జెట్‌లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. బడ్జెట్‌లో 40వేల జనరల్ కోచ్‌లను వందే భారత్ రైలు ప్రమాణాలతో సమానంగా తీర్చిదిద్దనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మూడు కారిడార్‌లను సైతం ప్రకటించారు. కారిడార్లతో ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న మార్గాల్లో రద్దీ తగ్గుతుంది. ప్యాసింజర్ రైళ్ల కార్యకలాపాలు మెరుగుపరిచేందుకు సహాయపడనున్నది. ప్రయాణికుల భద్రతతో పాటు ప్రయాణ వేగం పెరుగుతుందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.