మూవీ పేరు: ‘వినరో భాగ్యము విష్ణు కథ’ విడుదల తేదీ: 18 ఫిబ్రవరి 2023 నటీనటులు: కిరణ్ అబ్బవరం, కశ్మీర పరదేశి, మురళీ శర్మ, శుభలేఖ సుధాకర్, ఆమని, శరత్ లోహితస్వ తదితరులు సమర్పణ: అల్లు అరవింద్ కెమెరా: డేనియల్ విశ్వాస్ ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్ సంగీతం: చైతన్ భరద్వాజ్ నిర్మాత: బన్నీ వాస్ దర్శకత్వం: మురళీ కిషోర్ అబ్బూరు యంగ్ హీరోలలో వరుసగా చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్న హీరో ఎవరయ్యా అంటే.. ఖచ్చితంగా […]
మూవీ పేరు: ‘వినరో భాగ్యము విష్ణు కథ’
విడుదల తేదీ: 18 ఫిబ్రవరి 2023
నటీనటులు: కిరణ్ అబ్బవరం, కశ్మీర పరదేశి, మురళీ శర్మ, శుభలేఖ సుధాకర్, ఆమని, శరత్ లోహితస్వ తదితరులు
సమర్పణ: అల్లు అరవింద్
కెమెరా: డేనియల్ విశ్వాస్
ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్
సంగీతం: చైతన్ భరద్వాజ్
నిర్మాత: బన్నీ వాస్
దర్శకత్వం: మురళీ కిషోర్ అబ్బూరు
యంగ్ హీరోలలో వరుసగా చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్న హీరో ఎవరయ్యా అంటే.. ఖచ్చితంగా కిరణ్ అబ్బవరం పేరే ముందు వరసలో ఉంటుంది. సినిమా వెంబడి సినిమా చేస్తూ.. సరైన హిట్ పడనప్పటికీ తన మల్టీ టాలెంట్‌తో టాప్ నిర్మాణ సంస్థలని ఆకర్షిస్తూ దూసుకెళుతున్నాడు. అలా టాలీవుడ్లో అగ్ర నిర్మాతలలో ఒకరైన అల్లు అరవింద్ దృష్టిలో పడ్డాడు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై ‘వినరో భాగ్యము విష్ణు కథ’ చిత్రంతో కిరణ్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఇప్పటి వరకు ఈ సినిమాకు నిర్వహించిన ప్రమోషన్స్‌తో సినిమా బాగానే ప్రేక్షకులకు రీచ్ అయింది. టైటిల్, పాటలు, టీజర్, ట్రైలర్ ఇలా సినిమాకు సంబంధించినవన్నీ ఆకర్షించడంతో పాటు.. అల్లు అరవింద్ వంటి నిర్మాత ఈ సినిమాని సమర్పిస్తుండటంతో సినిమాపై భారీగానే క్రేజ్ ఏర్పడింది. అలాగే ‘సినిమా పేరులో విష్ణువు.. సినిమా విడుదలేమో శివరాత్రికి’.. ఇది కూడా ప్రేక్షకులు ఈ సినిమా గురించి మాట్లాడుకునేలా చేసింది. ఇలా అన్నీ కలిసొచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
తాత చెప్పిన మాటకి కట్టుబడి నిజాయితీగా, నలుగురికి సహాయం చేసే మనస్తత్వం అలవరచుకుంటాడు విష్ణు (కిరణ్ అబ్బవరం). అతనిది తిరుపతి అయినా.. ఉద్యోగ రీత్య హైదరాబాద్ సెంట్రల్ లైబ్రరీలో వర్క్ చేస్తుంటాడు. అదే సమయంలో యూట్యూబర్ అయిన దర్శన(కశ్మీర పరదేశి)కి నెంబర్ నైబర్ అనే కాన్సెఫ్ట్‌తో స్నేహం ఏర్పడుతుంది. తన యూట్యూబ్ ఛానల్ కోసం.. నెంబర్ నైబర్ (ఫోన్ నెంబర్ లాస్ట్‌లో ఉండే నెంబర్‌కి ముందు, తర్వాత నెంబర్స్‌తో పరిచయం ఏర్పరచుకోవడం) ద్వారా విష్ణుతో పాటు శర్మ (మురళీ శర్మ) కూడా ఆమెకు పరిచయం అవుతాడు.
ఈ ముగ్గురు కలిసి వీడియోలు చేస్తుంటారు. ఈ క్రమంలో విష్ణు, శర్మ ఇద్దరూ ఆమెకి అట్రాక్ట్ అవుతారు. ఆమెను ప్రేమించడం మొదలెడతారు. అప్పుడే దర్శన ఒక ప్రాంక్ వీడియో చేయాలని లైవ్ మర్డర్ అనే కాన్సెప్ట్‌తో ఓ వీడియోని ప్లాన్ చేస్తుంది. కానీ ఈ లైవ్ మర్డర్‌లో నిజంగానే తూటా పేలి.. శర్మ చనిపోతాడు. దర్శన జైలుకి వెళుతుంది. కానీ ఈ మర్డర్ దర్శన చేయలేదని తెలుసుకున్న విష్ణు ఏం చేశాడు? ఎలా ఆమెని బయటికి తీసుకువచ్చాడు? ఈ కథకి, గ్యాంగ్‌స్టర్ రాజన్ (శరత్ లోహితస్వ) కథకి లింకేంటి? రాజన్ కోసం వెతుకుతున్న NIA వాళ్లకి విష్ణు అందించిన సహకారం ఏమిటి? వంటి ప్రశ్నలకు ఎంటర్టైన్మెంట్తో కూడిన సమాధానమే ఈ చిత్ర కథ.
ఆర్టిస్ట్‌ల, సాంకేతిక నిపుణుల పనితీరు:
కిరణ్ అబ్బవరం మొదటి నుంచి ఎన్నుకుంటున్న పాత్రల లానే ఈ సినిమాలోని విష్ణు పాత్ర కూడా ఉంటుంది. సరదా సన్నివేశాల వరకు కిరణ్ నటన ఆకట్టుకున్నా.. సీరియస్, ఎమోషనల్ సన్నివేశాల్లో మాత్రం ఆయన రొటీనే అన్నట్టే కనిపించాడు. ఈ తరహా నటన ఆయన చేసిన ఇంతకు ముందు సినిమాలో కూడా అలాగే ఉంటుంది. కథ సరదాగా నడుచుకుంటూ వెళుతుండటంతో అతని నటన గురించి పెద్దగా ఎవరూ పట్టించుకునే అవకాశం ఉండదు. లేదంటే కిరణ్ చాలా ఛేంజ్ చేసుకోవాలని చెప్పొచ్చు.
సినిమా చూస్తున్న ప్రేక్షకులని హిలేరియస్‌గా నవ్వించిన ఘనత మాత్రం మురళీ శర్మకు దక్కుతుంది. శర్మ పాత్రలో సినిమా మొత్తాన్ని తనవైపు లాగేసుకున్నాడు. అలాగే హీరోయిన్ కశ్మీరకు కూడా మంచి పాత్ర పడింది కానీ.. స్క్రీన్ స్పేస్ అంతగా ఆమెకి దొరకలేదు. గ్లామర్ పరంగా, నటన పరంగా మాత్రం ఆమె బాగానే మెప్పించింది. విలన్ పాత్రలో చేసిన శరత్ లోహితస్వ కూడా తన నటనతో అలరిస్తాడు. ఇంకా ఇతర పాత్రలలో చేసిన శుభలేఖ సుధాకర్, ఆమని, ఎల్.బి. శ్రీరామ్, ప్రవీణ్, దేవి ప్రసాద్ వంటి వారంతా వారి పాత్రల పరిధిమేర నటించి.. సినిమాకు తమ సహకారాన్ని అందించారు.
సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. చైతన్ భరద్వాజ్ అందించిన నేపథ్య సంగీతం, పాటలు.. అలాగే నిర్మాణ విలువలు ఈ సినిమాకి ప్రధాన హైలెట్‌గా చెప్పుకోవచ్చు. సినిమాటోగ్రఫీ కూడా చక్కని మూడ్‌ని క్యారీ చేసింది. ఎడిటింగ్ పరంగా సెకండాఫ్‌ను ఇంకాస్త ఎఫెక్టివ్‌గా ఎడిట్ చేసే ఛాన్సుంది. ఇంకా ఇతర సాంకేతిక నిపుణులంతా.. వారి పనితనాన్ని ప్రదర్శించారు.
దర్శకుడు మురళి కిషోర్ సినిమాని తెరకెక్కించిన విధానం పరంగా మాత్రం చెప్పాల్సి వస్తే.. తను ఏం చెప్పాలనుకున్నాడో.. దానిపై సినిమాని సూటిగా నడిపించాడు. ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తూనే.. చిన్న ఛమక్కు అన్నట్లుగా ట్విస్ట్‌లని తగిలించాడు. అయితే మెయిన్ కథలోకి వెళ్లడానికి మాత్రం ఆయన చాలానే టైమ్ తీసుకున్నాడనిపించింది. అలాగే ఫస్టాప్ ఒకలా.. సెకండాఫ్ మరోలా నడిచినట్లుగా అనిపిస్తుంది.
విశ్లేషణ:
సినిమాలోని కాన్సెప్ట్ పరంగా కొత్తదనం ఉన్న సినిమా గానే దీనిని చెప్పుకోవాలి. ముఖ్యంగా నెంబర్ నైబర్ని వాడి ఎంటర్టైన్ చేయవచ్చు అనే థాట్‌కి నిజంగా దర్శకుడిని అభినందించాలి. ఫస్టాఫ్ దర్శన, విష్ణు, శర్మల హిలేరియస్ కామెడీతో సీట్లో కూర్చున్న ప్రేక్షకులని అలరించిన ఈ సినిమా.. సెకండాఫ్‌కి వచ్చే సరికి పూర్తిగా థ్రిల్లర్ తరహాలో మారిపోతుంది. ఫస్టాఫ్ శర్మ, విష్ణు ఇద్దరూ దర్శనని ప్రేమించడం వంటి సీన్లతో హాయిగా సాగిపోతుంది.
ఇంటర్వెల్ ట్విస్ట్.. ఆ తర్వాత శర్మ హత్యకు గల కారణాన్ని విష్ణు తెలుసుకునే క్రమంలో వచ్చే మలుపులన్నీ బాగుంటాయి. ప్రేక్షకులకి ఆసక్తిని కలిగిస్తాయి. కానీ ఈ క్రమంలోనే వచ్చే కొన్ని సీన్లు లాజిక్ లెస్‌గా అనిపిస్తున్నాయి. ఇక క్లైమాక్స్‌కి ముందు దేశభక్తి ట్విస్ట్ కూడా అలరిస్తుంది. అలాగే ఈ సినిమాకి సీక్వెల్ ఉందంటూ ముగించారు. సీక్వెల్‌కి ఇచ్చిన లీడ్ కూడా పర్ఫెక్ట్గా సెట్ చేశారని చెప్పొచ్చు.
మొత్తంగా అయితే.. అన్ని రకాల ఎమోషన్స్‌తో ఫుల్ మీల్స్ అన్నట్లుగా సినిమాని తెరకెక్కించారు కానీ.. పంటి కింద రాయిలాగా అక్కడక్కడ కొన్ని సీన్లు అతికించినట్లుగా అనిపిస్తాయి. అయితే ఎంటర్టైన్మెంట్కి మాత్రం లోటుండదు. శ్రీమద్రమారమణ గోవిందో హరి.. అని మధ్య మధ్యలో తట్టిలేపే అవసరం లేకుండా.. కథ బాగానే చెప్పారు. బడ్జెట్ పరంగా పెద్దగా ఖర్చు ఏమీ అయి ఉండదు కాబట్టి.. ఈ సినిమా సేఫ్ జోన్లోకి వెళ్లడం పెద్ద కష్టమేమీ కాదు.
ట్యాగ్‌లైన్: విష్ణు కథలో ట్విస్ట్లదిరాయ్
రేటింగ్: 3/5