Vegan Influencer |
ఏడేళ్లుగా పనసతొనలే ఆహారం..
విధాత: వేగనిజమ్ (Veganism)ను ప్రచారం చేస్తూ సామాజిక మాధ్యమాల్లో ప్రసిద్ధి చెందిన జన్నా సమ్సోనోవా అనే ఇన్‌ఫ్లూయెన్సర్ (Influencer) పోషకాహార లోపంతో మృతి చెందారు. పూర్తి స్థాయి శాకాహారాన్నిమాత్రమే తీసుకునే వారిని వేగన్స్ అని పిలుస్తారు.
10 ఏళ్ల నుంచి పూర్తి వేగన్ (Vegan)గా ఉండటంతో పోషకాహార లోపంతో జన్నాకు మృత్యువు సంభవించి నట్లు తెలుస్తోంది. రష్యన్‌కు చెందిన ఈ మహిళ తరచూ వేగనిజంను ప్రచారం చేయడానికి వీడియోలు పోస్ట్ చేసేవారు. జన్నా గత ఏడేళ్లుగా కేవలం పనస తొనలు (Jack Fruit), పనస తొనల జ్యూస్ మాత్రమే తాగేవారని ఆమెతో సన్నిహితంగా ఉండేవారు చెప్పారు.
జన్నా ఇటీవల ఆసియా పర్యటనలో ఉండగా తీవ్ర అనారోగ్యం చేయడంతో చికిత్స తీసుకుంటుండగానే జులై 21న మృతి చెందారని రష్యా వార్తా సంస్థలు పేర్కొన్నాయి. ‘కొన్ని నెలల క్రితం నేను జన్నాను శ్రీలంకలో చూశా.. సన్నగా మారిపోయిన కాళ్లు, లోపలికి పోయిన పొట్టతో తను చాలా అనారోగ్యంగా కనిపించింది’ అని ఆమె స్నేహితుడు ఒకరు తెలిపారు.
‘ఆ స్థితిలో తనను చూసి వాళ్ల కుటుంబసభ్యులు ఆమెను రష్యాకు తీసుకువెళ్లి చికిత్స చేయించారు. అయినా తప్పించుకుని వచ్చేసింది’ అని పేర్కొన్నారు. ‘నేను తన పైఅంతస్తులో ఉంటాను.. రోజూ తన స్థితిని చూసి బాధపడేదాన్ని’ అని మరో స్నేహితురాలు చెప్పారు.
అయితే జన్నా తల్లి మాత్రం తన కుమార్తె కలరా లాంటి వ్యాధితో మరణించినట్లు చెబుతున్నా నిర్దిష్ట కారణాన్ని వెల్లడించలేదు. కఠినమైన వేగన్ డైట్ పాటించడంతో పోషకాలు లేక తన శరీరం కుచించుకు పోయిందని.. ఆ ఒత్తిడి కూడా తనపై ఉండి ఉండొచ్చని వ్యాఖ్యానించారు.