బండా ప్రకాష్.. మంత్రి బదులు మండలి వైస్ చైర్మన్!

బండా ప్రకాష్ పేరు బీఆర్ఎస్ ఖరారు 'ఈటెల' ఎపిసోడ్‌తో కీలక నిర్ణయం రాజ్యసభకు టాటా.. ఎమ్మల్సీగా పీఠం విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఎమ్మెల్సీ, మాజీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండా ప్రకాష్‌ను శాసనమండలి వైస్ చైర్మన్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. శనివారం నామినేషన్లు స్వీకరించిన అనంతరం, ఆదివారం మండలి వైస్ చైర్మన్‌గా ఎన్నిక కానున్నారు. ఎమ్మెల్సీగా బండా ప్రకాష్‌ను ఎంపిక చేసిన సమయంలో రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం లభిస్తుందని అప్పుడు చర్చ […]

  • By: krs    latest    Feb 11, 2023 7:19 AM IST
బండా ప్రకాష్.. మంత్రి బదులు మండలి వైస్ చైర్మన్!
  • బండా ప్రకాష్ పేరు బీఆర్ఎస్ ఖరారు
  • ‘ఈటెల’ ఎపిసోడ్‌తో కీలక నిర్ణయం
  • రాజ్యసభకు టాటా.. ఎమ్మల్సీగా పీఠం

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఎమ్మెల్సీ, మాజీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండా ప్రకాష్‌ను శాసనమండలి వైస్ చైర్మన్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. శనివారం నామినేషన్లు స్వీకరించిన అనంతరం, ఆదివారం మండలి వైస్ చైర్మన్‌గా ఎన్నిక కానున్నారు.

ఎమ్మెల్సీగా బండా ప్రకాష్‌ను ఎంపిక చేసిన సమయంలో రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం లభిస్తుందని అప్పుడు చర్చ జరిగినప్పటికీ కారణాలేవైనా అవకాశం మాత్రం లభించలేదు. ఆ కారణంగానే ఈసారి ఆ లోటును పరిపూర్తి చేసేందుకు శాసనమండలి వైస్ చైర్మనుగా గులాబీ పార్టీ అధిష్టానం బండా ప్రకాష్‌కు అవకాశం కల్పించినట్లు భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో మండలి వైస్ చైర్మన్‌గా అధికార బిఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని ముందుగానే ప్రకటించడం గమనార్హం. ప్రస్తుత మండలి బలాబలాలను పరిశీలిస్తే డాక్టర్ బండా ప్రకాష్ ఎన్నిక లాంఛనమని చెప్పవచ్చూ. ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల బలం పోటీ చేసే స్థాయిలో కూడా లేకపోవడంతో బండా ప్రకాష్ ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. శనివారం బండా నామినేషన్ దాఖలు చేయనున్నారు. శాసనమండలిలో బీఆర్ఎస్ పార్టీ పూర్తి మెజారిటీతో ఉన్నందున ఆదివారం ఆయన అధికారికంగా వైస్ చైర్మన్‌గా ఎన్నిక కానున్నారు.

గతంలో రాజ్యసభకు ప్రాతినిధ్యం

వరంగల్ నగరానికి చెందిన బండా ప్రకాష్, ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఉన్నత విద్యావంతుడు. గతంలో కాంగ్రెస్ పార్టీలో వివిధ స్థాయిలో పనిచేశారు. గతంలో మునిసిపల్ వైస్ చైర్మనుగా బాధ్యతలు నిర్వహించారు. కేసీఆర్ పిలుపుమేరకు బీఆర్ఎస్‌లో చేరారు.

2017లో టీఆర్ఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా నియామ‌కం అయ్యారు. టీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం కల్పించారు. 2018లో రాజ్య‌స‌భ‌కు పోటీ చేసి గెలుపొందారు. 2021, న‌వంబ‌ర్‌లో జ‌రిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ అభ్య‌ర్థిగా ప్ర‌కాశ్ విజ‌యం సాధించారు. అనంత‌రం రాజ్య‌స‌భ స‌భ్య‌త్వానికి రాజీనామా చేశారు.

ఈటల నేపథ్యంలో బండాకు ఎమ్మెల్సీ

అప్పట్లో టీఆర్ఎస్‌లో ప్రధాన నేతగా వెలుగొందిన మాజీ ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ను అనూహ్య పరిణామాల మధ్య పార్టీ నుంచి వెళ్ళ కొట్టిన విషయం తెలిసిందే. ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈటల రాజేందర్ సామాజిక వర్గానికి చెందిన బండా ప్రకాష్ ముదిరాజును పోటీగా తెరపైకి తీసుకువచ్చారు.

ముదిరాజు సామాజిక వర్గం నుంచి ఉన్నత విద్యావంతుడుగా, ముదిరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా, రాజ్యసభ సభ్యుడిగా అప్పటికే బండా ప్రకాష్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈటెల పరిణామాల నేపథ్యంలో బలమైన ముదిరాజ్ సామాజిక వర్గానికి భరోసా కల్పించేందుకు బండా ప్రకాష్ రాజ్యసభ పదవీకాలం పూర్తికాకముందుకే ఆయనను ఎమ్మెల్సీగా ఎన్నిక చేసి రాజ్యసభకు రాజీనామా చేయించారు.

ఎమ్మెల్సీగా ఎన్నిక చేసి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారని అప్పట్లో గట్టిగా ప్రచారం సాగింది. కారణాలేవైనా మంత్రివర్గంలో ప్రకాష్ కు అవకాశం లభించలేదు. అప్పట్లో బండా ప్రకాష్ రాజ్యసభ రాజీనామా వెనుక కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితకు అవకాశం కల్పిస్తారని భావించినప్పటికీ అనూహ్యంగా ఆమె ఎమ్మెల్సీ వైపు మొగ్గు చూపడంతో ఆ చర్చకు తెరబడింది. ప్రకాష్ స్థానంలో తదుపరి ఓ బడా పారిశ్రామికవేత్తకు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే.

ఉపముఖ్యమంత్రిగా కడియంకు అవకాశం

గతంలో కూడా వరంగల్ ఎంపీగా గెలిచిన కడియం శ్రీహరిని ఆగమేఘాల మీద రాజీనామా చేయించి ఆయనకు ఎమ్మెల్సీ కట్టబెట్టి రాష్ట్ర మంత్రివర్గంలో ఉపముఖ్యమంత్రిగా కీలక బాధ్యతలు అప్పగించిన కేసీఆర్. ఈసారి బండా ప్రకాష్‌కు కూడా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించినందున, ఈటెల రాజేందర్ స్థానంలో మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తారని భావించారు. సామాజిక సమీకరణలా? లేదా అప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్, చీఫ్ విప్‌గా వినయ్ ప్రాతినిధ్యం వహిస్తున్నందున బండాకు అవకాశం దక్కలేదా? కారణాలేవైనా మంత్రివర్గంలో మాత్రం అవకాశం దక్కలేదు.