థియేటర్‌లో విజయ్ అభిమానుల విధ్వంసం.. తెగ వైరల్ అవుతున్న ఫొటోలు, వీడియోలు

తమిళ స్టార్ హీరో విజయ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆయన సినిమాలు ఇటీవల తెలుగులో కూడా ఎక్కువగా విడుదల అవుతుండడంతో తెలుగు ఫ్యాన్స్ క్రమేపి పెరుగుతున్నారు. అయితే విజయ్ ప్రస్తుతం లియో అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు.
ఈ చిత్రం ట్రైలర్ రీసెంట్‌గా రిలీజ్ కాగా, దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ ట్రైలర్ లాంచ్ కోసం ఓ ఈవెంట్ ప్లాన్ చేయగా, చెన్నై పోలీసులు నిరాకరించడంతో కొన్ని థియేటర్స్‌లో చిత్ర ట్రైలర్‌ని ప్రదర్శించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న విజయ్ అభిమానులు థియేటర్స్‌కి పోటెత్తారు.
చెన్నైలోని రోహిణి థియేటర్‌లో ‘లియో’ ట్రైలర్‌ను ప్రదర్శించగా, అక్కడ నానా రచ్చ చేశారు. ట్రైలర్ చూసి ఎంజాయ్ చేస్తూ..పెద్దపెద్దగా కేకలు వేయడం, మరింత అత్యుత్సాహంతో థియేటర్‌లోని కుర్చీలను విరగొట్టడం వంటివి చేశారు. విజయ్ అభిమానులు చేసిన విధ్వంసానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.
వీటిని చూసిన నెటిజన్లు దయచేసి ఇలాంటి వికృత చేష్టలు చేయద్దంటూ వేడుకుంటున్నారు. ఇలా చేయడం సదరు హీరోకి చెడ్డపేరు వస్తుందని,అభిమానులలో మార్పు రావలసిన అవసరం ఉందని కొందరు చెప్పుకొస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా థియేటర్‌లో ఇలాంటి హంగామా సృష్టించడం మనం చూశాం.
ఇక లియో ట్రైలర్ విషయానికి వస్తే.. ఈ ట్రైలర్ ఇప్పుడు రికార్డులు తిరగరాస్తుంది. అభిమానులకి మంచి కిక్ ఇచ్చేలా దర్శకుడు లోకేష్ కనగరాజ్ అన్ని ఎలిమెంట్స్ చిత్రంలో పొందుపరచినట్టు ట్రైలర్‌లో చూపించాడు. ఇక లియో చిత్రంలో విజయ్‌కి జోడీగా త్రిష నటిస్తుంది. వీరిద్దరి జోడి దశాబ్ధం తర్వాత ప్రేక్షకులని అలరించేందుకు సిద్ధమైంది.
ఇందులో ముఖ్య పాత్రలలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, అర్జున్ సర్జా కనిపించనున్నారు. అక్టోబర్ 19న విడుదల కానున్న ఈ సినిమాకి ప్రమోషన్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించిన విషయం తెలిసిందే.