పెరుగుతున్న బీసీ గళం!.. కాంగ్రెస్‌లో ముదురుతున్న సీట్ల పంచాయితీ

- బీసీలకు 40 టికెట్లు ఇవ్వాలని డిమాండ్
- తెరపైకి మళ్లీ ఉదయ్‌పూర్ డిక్లరేషన్
- ఢిల్లీకి చేరిన టీపీసీసీ బీసీ నాయకులు
విధాత, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో టికెట్ల పంచాయితీ ముదురుతున్నది. బీసీలకు తగిన న్యాయం జరగడంలేదని అసంతృప్తి గళం వినిపిస్తున్నారు. ఏళ్ల తరబడి పార్టీని అంటిపెట్టుకొని, పార్టీకి సేవలందిస్తున్న వారికి అగ్రవర్ణ నేతలు మొండి చేయి చూపిస్తున్నారని మండిపడుతున్నారు.
ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌లో ప్రకటించినట్లు బీసీలకు తప్పనిసరిగా ప్రతి పార్లమెంటు స్థానం పరిధిలో రెండుసీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ ఇటీవలే పార్లమెంటులో ఓబీసీలకు రిజర్వేషన్ల డిమాండ్ చేస్తుండటం, బీసీ జనగణన నినాదం ఎత్తుకున్న నేపథ్యంలో ఆ మేరకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు 40 టికెట్లు ఇవ్వాలని బీసీ నేతలు పట్టుపడుతున్నారు.
తమ డిమాండ్‌ను అధిష్ఠానానికి వివరించేందుకు ఏకంగా ఢిల్లీ బాట పట్టారు. పదేళ్లుగా అధికారం కోసం ఎదురు చూస్తున్న కాంగ్రెస్ పార్టీ.. కొద్దిరోజులుగా పుంజుకుంటున్నది. వరుస డిక్లరేషన్లతో పార్టీ శ్రేణుల్లో నయా జోష్ నింపుతున్నది. అలాగే బీజేపీ, అధికార బీఆరెస్ నుంచి అసంతృప్తిలో ఉన్న నేతలు కూడా బీఆరెస్‌కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీనేనని తలచి వలస వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో టికెట్ల కేటాయింపుల్లో బీసీ నేతల పంచాయతీ గెలుపు గుర్రాల ఎంపికలో కాంగ్రెస్‌కు తలనొప్పిగా తయారైంది.
సర్వేలపై బీసీ నేతల అపనమ్మకం
గెలుపే లక్ష్యంగా ఉన్న కాంగ్రెస్.. అభ్యర్థుల ఎంపికపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. ఇందుకోసం పలు సర్వేలు చేపట్టిన అధిష్ఠానం అభ్యర్థుల బలాలను తెలుసుకుంటున్నది. మరోవైపు స్క్రీనింగ్ కమిటీ కూడా 119 నియోజకవర్గాలకు గాను దాదాపు 300 మంది అభ్యర్థులను ఎంపిక చేసి, జాబితాను సీల్డ్ కవర్‌లో ఢిల్లీకి పంపినట్టు చెబుతున్నారు. ఢిల్లీలో సైతం స్క్రీనింగ్ కమిటీ కసరత్తు చేసి, 70 స్థానాలకు అభ్యర్థులను దాదాపు ఖరారు చేసిందని సమాచారం.
అయితే పార్టీ చేసిన సర్వేల్లో బీసీ నాయకుల పేర్లు లేవని, అగ్రవర్ణాల నేతల పేర్లు మాత్రమే ఉన్నాయని బీసీ నేతలు గుర్రుమంటున్నారు. సర్వేల మూలంగానే ఎన్నికలు జరుగవని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. సర్వేల ఆధారంగానే ఎన్నికలు జరిగితే గత ఎన్నికల్లో పలువురు రెడ్డి నాయకులు ఎందుకు ఓడిపోయారని ప్రశ్నిస్తున్నారు. అసలు సర్వేలే నిర్వహించలేదని, సర్వే పేరు మీద డబ్బులు లూటీ చేశారని ఆరోపిస్తున్నారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికలో ప్రతి పార్లమెంట్ పరిధిలో 2 సీట్లు బీసీలకు కేటాయించాలి టిపిసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారికి వినతి పత్రాన్ని తెలంగాణ కాంగ్రెస్ OBC పక్షాన అందజేయడం జరిగింది!@revanth_anumula pic.twitter.com/K5LOg4wni9
— Congress for Telangana (@Congress4TS) September 26, 2023
ఢిల్లీలో తేల్చుకుంటాం
టికెట్ల పంచాయతీ తీవ్రం అవ్వడంతో ఢిల్లీలోనే తేల్చుకుంటామంటూ బీసీ నేతలు మంగళవారం సాయంత్రం హస్తినకు బయలు దేరారు. సీట్ల పంపిణీ విషయంలో కొందరు అగ్ర కుల నాయకులు వివక్ష చూపుతున్నారని, తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. అందుకే పార్టీ అగ్ర నాయకులను కలిసి, తమకు జరుగుతున్న అన్యాయాన్ని తెలియ జేస్తామంటున్నారు.
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను వారు బుధవారం కలువనున్నారు. అలాగే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ కూడా కోరారు. అనుమతి దొరికితే ముఖ్యంగా బీసీ నాయకులకు సీట్లు కేటాయించే విషయంలో కొందరు అగ్ర కులాల నాయకుల ధోరణిపై వారికి ఫిర్యాదు చేయనున్నారని తెలుస్తున్నది. టీపీసీసీ నిర్ణయించినట్లుగా 34 స్థానాల్లో బీసీలకు టికెట్లు కాకుండా 48 సీట్లలో బీసీ నేతలతో జాబితా ఏఐసీసీ నేతలకు అందించేందుకు టీ కాంగ్రెస్ బీసీ నేతలు సిద్ధమయ్యారని సమాచారం.
రేవంత్‌కు వినతి పత్రం
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని మంగళవారం ఆయన నివాసంలో కలిసిన టీపీసీసీ బీసీ నాయకులు కలిసి ఎన్నికల్లో బీసీలకు టికెట్ల కేటాయింపు సమస్యపై వినతిపత్రం సమర్పించారు. అసెంబ్లీ ఎన్నికలలో టికెట్ల కేటాయింపులలో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఉదయ్ పూర్ డిక్లరేషన్ మేరకు టికెట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రేవంత్‌రెడ్డిని కలిసిన వారిలో పొన్నం ప్రభాకర్, అంజనీకుమార్ యాదవ్, షబ్బీర్ అలీ, మహేశ్ కుమార్ గౌడ్, సురేశ్ షెట్కార్ తదితర నేతలు ఉన్నారు.