అసెంబ్లీలో సీఎం రేవంత్‌, రాజగోపాల్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు..

రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ సభ్యుల మధ్య వాడీవేడి వాదనలు జరిగాయి

  • By: Somu    latest    Feb 14, 2024 12:27 PM IST
అసెంబ్లీలో సీఎం రేవంత్‌, రాజగోపాల్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు..
  • సభ నుంచి బీఆర్‌ఎస్‌ సభ్యుల వాకౌట్‌


విధాత‌: రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ సభ్యుల మధ్య వాడీవేడి వాదనలు జరిగాయి. బీఆర్‌ఎస్‌ తరఫున చర్చను ప్రారంభించిన కడియం శ్రీహరి.. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హమీలకు.. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్‌ పాలకులు అనుసరిస్తున్న విధానాలకు సంబంధం లేదని విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజీపై కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న రాద్దాంతంపై కూడా ఆయన విమర్శలు చేశారు.


కడియం మాట్లాడుతుండగా కాంగ్రెస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు అడుగడుగునా అడ్డుతగిలారు. ఓ సందర్భంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. కడియం గతంలో రాజయ్య నుంచి ఉపముఖ్యమంత్రి పదవిని లాక్కున్నాడని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌పై కూడా విమర్శలు చేశారు. దీనిపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు.


ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి లేచి అగ్నికి ఆజ్యం పోశారు. నల్లగొండ సభలో కేసీఆర్‌ తన గురించి అవమానకరంగా మాట్లాడారని, అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు పాయింట్‌ పీకేసినా బుద్ధి మారలేదని వ్యాఖ్యానించారు. దాంతో బీఆర్‌ఎస్‌ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజగోపాల్‌రెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా శాసనసభ నుంచి వాకౌట్‌ చేశారు.


కాంగ్రెస్‌కు పట్టిన చీడ పురుగు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి : కడియం శ్రీహరి


కాంగ్రెస్‌ పార్టీకి పట్టిన చీడ పురుగు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అని స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫైర్‌ అయ్యారు. అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీని నాశనం చేసిందే రాజగోపాల్‌ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్‌ రేవంత్‌రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్‌గా మాట్లాడటం వేరు సీఎం హోదాలో మాట్లాడటం వేరన్నారు. రాజగోపాల్‌ రెడ్డిలా సీఎం మాట్లాడటం సరికాదన్నారు. శాసనసభలో మఖ్యమంత్రి భాష అభ్యం తరకరంగా ఉందని ఆక్షేపించారు. కాగా, అసెంబ్లీ నర్వహణ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అసెంబ్లీ నుంచి బీఆర్‌ఎస్‌ సభ్యులు వాకౌట్‌ చేశారు.


రైతు రుణ‌మాఫీ ఏమైంది?


కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే డిసెంబర్‌ 9న రైతు రుణమాఫీ చేస్తామన్నారు. ఇప్పటి వరకు చేయలేదని అందువల్ల అడుగుతున్నామని స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామన్నారని గుర్తు చేశారు.