విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: టెన్త్ హిందీ ప్రశ్న పత్రం లీకేజీ కేసులో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etela Rajender) సోమవారం వరంగల్ పోలీసులు విచారించనున్నారు. హిందీ ప్రశ్న పత్రం లీకేజీ వ్యవహారం రాష్ట్రంలో సంచలనం సృష్టించగా ఈ సంఘటన రాజకీయ రంగు పులముకున్నది.
ఈ కేసులో అత్యంత నాటకీయ పరిణామాల మధ్య బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని మొదటి నిందితుడిగా చేర్చి అరెస్టు చేసి కరీంనగర్ సెంట్రల్ జైలుకు పంపించిన విషయం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. కాగా, బండి సంజయ్ ఇప్పటికే బెయిల్ మీద విడుదలయ్యారు.
లీకేజీ కేసులో ఈటలకు నోటీసులు
పేపర్ లీకేజీ కేసులో మూడు రోజుల క్రితం వరంగల్ పోలీసులు రాజేందర్ కు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రధానమంత్రి మోడీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో తాను 10వ తేదీన పోలీసుల ముందు హాజరవుతానని సమాచారం ఇచ్చారు. ఈ మేరకు సోమవారం ఆయన వరంగల్ పోలీసుల ముందు హాజరుకానున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ కేసులో ఈటలతోపాటు ఆయన పిఏలు ఇద్దరికీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
లీకేజీ అయిన హిందీ పేపర్ ఈటల రాజేందర్ కు నిందితులు షేర్ చేసినట్లు వరంగల్ పోలీసులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయం వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ మీడియాతో గతంలో వెల్లడించారు. ఈటలకు లీకైన పేపర్ షేర్ చేయడమే కాకుండా లీకైన పాఠశాల కమలాపురం మండలం ఈటెల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గం పరిధిలో ఉండడం గమనార్హం. కమలాపురం నుంచి ఎందుకు లీకేజీ జరిగింది అనే ప్రశ్నను ఇప్పటికే పోలీసులు లేవనెత్తారు ఈ కారణంగా కూడా ఈటలను విచారించే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు.
పోలీసుల ముందుకు ఈటల
పేపర్ లీకేజీ కేసులో వరంగల్ పోలీసులు ఇచ్చిన నోటీసు మేరకు సోమవారం ఈటల రాజేందర్ వరంగల్ పోలీస్ కమిషనరేట్ లోని సెంట్రల్ డీసీపీ కార్యాలయానికి చేరుకున్నారు. వరంగల్ పోలీసులకు ఆయన తన స్టేట్మెంట్ ఇవ్వడానికి వచ్చారు. పోలీసుల ప్రశ్నలకు ఈటెల సమాధానం చెప్పే అవకాశం ఉంది.
ఫోన్ పట్ల పెద్దగా అవగాహన లేదు
ఇది ఇలా ఉండగా ఇప్పటికే ఈ నోటీసుపై ఆయన తన లాయర్లతో సంప్రదించారు. విచారణలో పోలీసులు ఏ ఏ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది తనకు తెలిసిన మేరకు సమాచారం అందిస్తానని ప్రకటించారు. అయితే లీకేజీ అయిన పేపర్ ను తాను చూడలేదని, సాధారణంగానే తాను ఫోను చేయడం, మాట్లాడడం తప్ప, పెద్దగా ఫోన్ పట్ల తనకు అవగాహన లేదని అదంతా తన పీఏలే చూసుకుంటారని ఈటెల ఇప్పటికే వివరించారు.
కాగా.. తాను చట్టాన్ని రాజ్యాంగాన్ని గౌరవిస్తానని తనకు తెలిసిన సమాచారం పోలీసులకు అందిస్తానని ఈటెల ప్రకటించారు. అవసరమైతే తన ఫోను ఇవ్వడానికి కూడా అభ్యంతరం లేదని రాజేందర్ స్పష్టం చేశారు. అయితే విచారణలో పోలీసులు ఏ వివరాలు అడుగుతారూ? తాను ఏ విధంగా ప్రతిస్పందిస్తారో? వేచి చూడాల్సిందే.
తగిన పోలీసుల బందోబస్తు
ఈటల విచారణ నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ వద్ద పోలీసులు తగిన బందోబస్తు చర్యలు చేపట్టారు. బిజెపి కార్యకర్తలు నిరసనలు చేపట్టే అవకాశం ఉన్నందున అవసరమైన ముందస్తు చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్ షామీర్పేటలోని ఆయన నివాసం నుండి తన సహచరులతో కలిసి ఉదయం 10 గంటలకు వరంగల్ పోలీస్ ల ముందు విచారణకు హాజరయ్యేందుకు రాజేందర్ బయలుదేరి వరంగల్ చేరుకున్నారు. ప్రస్తుతం ఈటల విచారణ సాగుతోంది.