Warangal | రాజకీయ రగడ.. కేటీఆర్ వర్సెస్ కొండా మురళి

Warangal మధ్యలో నరేందర్ విమర్శలు కేటీఆర్ పై ఎర్రబెల్లి స్వర్ణ ఆగ్రహం పరస్పర సవాళ్లు, ప్రతి సవాళ్లు తూర్పులో మాటల మంటలు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగ్‌లో రాజకీయ రగడ తీవ్రమైంది. ఎండతోపాటు పెరిగిన రాజకీయ వేడి వల్ల ఉక్కపోత కూడా ఆకస్మికంగా పెరిగింది. అధికార బీఆర్ఎస్, విపక్ష కాంగ్రెస్ నాయకుల మధ్య ఒక్కసారిగా మాటల మంటలు రగులుకున్నాయి. సవాళ్లు, ప్రతి సవాళ్లతో పరిస్థితిని వేడెక్కించారు. రాష్ట్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం వరంగల్ […]

  • Publish Date - June 18, 2023 / 03:35 PM IST

Warangal

  • మధ్యలో నరేందర్ విమర్శలు
  • కేటీఆర్ పై ఎర్రబెల్లి స్వర్ణ ఆగ్రహం
  • పరస్పర సవాళ్లు, ప్రతి సవాళ్లు
  • తూర్పులో మాటల మంటలు

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగ్‌లో రాజకీయ రగడ తీవ్రమైంది. ఎండతోపాటు పెరిగిన రాజకీయ వేడి వల్ల ఉక్కపోత కూడా ఆకస్మికంగా పెరిగింది. అధికార బీఆర్ఎస్, విపక్ష కాంగ్రెస్ నాయకుల మధ్య ఒక్కసారిగా మాటల మంటలు రగులుకున్నాయి. సవాళ్లు, ప్రతి సవాళ్లతో పరిస్థితిని వేడెక్కించారు.

రాష్ట్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం వరంగల్ జిల్లా పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి. పరకాల నియోజకవర్గం నుంచి పోటీ చేయకుండా పక్క నియోజకవర్గానికి జంప్ అయితున్నారంటే కొండా దంపతులను దృష్టిలో పెట్టుకొని చేసిన వ్యాఖ్యానం తెలిసిందే. గుండా గిరి, రౌడీయిజానికి కాలం చెల్లిందంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు.

కేటీఆర్ విమర్శలకు కౌంటర్‌గా ఆదివారం కొండా మురళి తీవ్రంగా ప్రతిస్పందించారు. కేటీఆర్ పై విరుచుకపడ్డారు. దీనికి తిరిగి వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తీవ్రంగా ప్రతిస్పందించారు. కొండా మురళి పై విరుచుకబడ్డారు. నిన్న సభలో కేటీఆర్ చేసిన విమర్శలపై కాంగ్రెస్ వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ కూడా తీవ్రంగా స్పందించారు.
పరస్పర విమర్శలు, దూషణలతో వరంగల్ తూర్పు రాజకీయం హాట్ హాట్ గా మారింది. మీడియా సమావేశాల్లో ఆయా నేతల ప్రతిస్పందన ఈ విధంగా ఉంది.

బిడ్డా కేటీఆర్ ఖబర్దార్: మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు

నా పేరు కూడా పలకడానికి భయపడ్డ నువ్వు కొండా మురళి, సురేఖల గురించి మాట్లాడుతావా బిడ్డ ఖబర్దార్ అంటూ మంత్రి కేటీఆర్ పై మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు ఫైర్ అయ్యారు. మీసాలు ఉంటే నాలాగా మెలెయ్యాలి. ఆడో మగో తెలియదు ‘పేడుమూతి బోడిలింగానివి’ మా గురించి మాట్లాడుతావా అని ప్రశ్నించారు.

మేము పారిపోయిండ్రని అంటున్నవ్ ‘మీ అయ్యే వరంగల్లో బసవరాజ్ సారయ్యను ఓడించాలంటే మీరైతేనే సాధ్యమని పోటీకి పంపించారన్నారు. అప్పుడు గుండా అని గుర్తుకు రాలేదా? మురళి గుండా అని ఈరోజు అంటాన్నవంటూ ప్రశ్నించారు. జోకే ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీలోకి వస్తే మేము బయటికి వచ్చామన్నారు.

ఫోజులు కొట్టుడు బంద్ చెయ్: ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్

నువ్వు పెద్ద పుడింగువు అనుకుంటున్నావు, ఫోజులు కొట్టుడు బంద్ చెయ్, వెనకటి ముచ్చట్లు ఇప్పుడు వద్దంటూ కొండా మురళికి తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ సవాల్ చేశారు. ప్రత్యక్ష ఓటు ద్వారా సేవలో సత్తా చాటాలంటూ సూచించారు. పలుకుబడి కోల్పోయి దీనావస్థకు చేరిన వాళ్ళు పెద్దవారిని విమర్శించి పెద్దొన్ని కావాలనుకుంటారని, అందుకే కేటీఆర్ ను విమర్శిస్తున్నారని అన్నారు.

నువ్వు ఎంత పిరికోనివో గుండాలన్నా, పోలీసులు అన్న ‘ఉ…’ పోసుకుంటావని విమర్శించారు. దమ్ము ధైర్యం ఉంటే వరంగల్ తూర్పులో ఇల్లు కట్టుకోవాలన్నారు. 10 ఫీట్ల కాంపౌండ్ వాల్, గన్మెన్లను చుట్టూ పెట్టుకుని కేటీఆర్ ను విమర్శించడం సిగ్గుచేటు అన్నారు. కేటీఆర్ యూత్ ఐకాన్ గా నిలిచారని కొనియాడారు. తూర్పు ప్రజలు పేదోళ్లు కావచ్చుగానీ చైతన్యంలో ముందు ఉంటారని గుర్తు చేశారు.

కేటీఆర్‌వి అహంకారపూరిత మాటలు: ఎర్రబెల్లి స్వర్ణ

టిఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ అహంకారపూరితంగా మాట్లాడుతున్నాడని వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ మంత్రి కేటీఆర్ విమర్శలపై స్పందించారు. సోనియాగాంధీ చలవవల్లే తెలంగాణ వచ్చింది. ఆమె పట్టుదల వల్లే ఎందరు అడ్డుపడ్డా ప్రత్యేకరాష్ట్రం సిద్దించింది. ఆ విషయం మరచి పోతున్నావని విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ ద్వారా ఏర్పడ్డ తెలంగాణలో అబద్ధాలు, మోసాలతో అధికారం చెలాయిస్తున్న నీకు మమ్మల్ని విమర్శించే నైతికహక్కు ఉందా ? అధికార మదం నెత్తికెక్కి ఇష్టారీతిన మాట్లాడుతున్న నీకు బుద్దిచెప్పే సమయం ఆసన్నమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదికోట్లు ఖర్చుపెట్టి సభ పెట్టి హడావుడి చేసి సిట్టింగ్ అభ్యర్థిని ప్రకటించలేని దుస్థితిలో ఉన్న మీరా మా పై మాట్లాడేది అంటూ స్వర్ణ విమర్శించారు.