రావయ్య.. రాజయ్య.. రావయ్యా!!

రాష్ట్రంలో వరంగల్‌ లోక్‌సభ నియోజకవర్గం కేంద్రంగా రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్నటి వరకూ పూజకు పనికిరాని పువ్వుగా పక్కన

  • Publish Date - March 29, 2024 / 05:11 PM IST
  • వరంగల్ సెంటర్‌గా రాజకీయ పరిణామాలు
  • డాక్టరమ్మ స్థానంలో పాత డాక్టరుకు చాన్స్
  • పార్టీలోకి తిరిగి ఆహ్వానిస్తున్న బీఆర్ఎస్
  • వరంగల్ ఎంపీ అభ్యర్థిగా అవకాశం?
  • పోటీపై నిర్ణయం తేల్చని డాక్టర్ రాజయ్య
  • కాంగ్రెస్‌లో చేరేందుకు కడియం సిద్ధం
  • బంపర్‌ ఆఫర్‌ ఇవ్వనున్న అధిష్ఠానం?

విధాత ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో వరంగల్‌ లోక్‌సభ నియోజకవర్గం కేంద్రంగా రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్నటి వరకూ పూజకు పనికిరాని పువ్వుగా పక్కన పెట్టిన మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్‌ తాటికొండ రాజయ్యను.. రావయ్యా.. రాజయ్యా.. రావయ్యా.. అంటూ బీఆరెస్‌ అధిష్ఠానం తిరిగి నెత్తినపెట్టుకునేందుకు సిద్ధమవుతున్నది. రాజయ్యను పలు పర్యాయాలు బీఆర్ఎస్ అవమానించినట్లుగా ఎవరూ అవమానించలేదనే అభిప్రాయం కొందరిలో ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్‌లో చేరినప్పటి నుంచి పైకి గౌరవించినట్లుగా కనిపించినప్పటికీ పలు సందర్భాల్లో ఆయనను తీవ్రంగా అవమానించారనే చర్చ ఉంది. తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించి, మంత్రివర్గం నుంచి కారణం సైతం చెప్పకుండా, రాజీనామా కోరకుండా భర్తరఫ్ చేయడం అప్పట్లో తీవ్ర చర్చకు దారితీసింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా టికెట్ నిరాకరించిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని వీడిన రాజయ్యను తిరిగి బీఆర్ఎస్ లోకి ఆహ్వానించడం ఇప్పుడు రాజకీయవర్గాల్లో ఆసక్తిరేపుతున్నది. అయితే ఆయన వైపే మొగ్గు చూపుతారా? కొత్తవారిని ఎవరినైనా తెరపైకి తెస్తారా? అనే చర్చ కూడా సాగుతోంది. మాదిగ సామాజికవర్గ నేతకు బీఆర్ఎస్ అవకాశం కల్పిస్తారని భావిస్తున్నారు. కడియం కావ్యను కాంగ్రెస్‌ రంగంలోకి దింపితే కడియానికి దీటైన నాయకుడిగా రాజయ్యే ఉంటారని బీఆరెస్‌ నేతలు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. కడియం పట్ల కోపంతో ఉన్న వారు కూడా రాజయ్య వైపు మొగ్గుచూపుతున్నారని సమాచారం.

వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థిగా మాజీ మంత్రి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె డాక్టర్ కడియం కావ్యను బీఆర్ఎస్ అధిష్ఠానం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే.. అనూహ్య పరిణామాలు, అంతర్గత వ్యూహాల నేపథ్యంలో కావ్య తాను బీఆర్ఎస్ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన షాక్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ లేఖలో పార్టీపై తీవ్ర ఆరోపలు చేయడం సంచలనం రేపింది. తాను తప్పుకోవడం ఒక ఎత్తయితే.. తన తండ్రి కడియం శ్రీహరితోపాటు పార్టీ మారేందుకు కావ్య సిద్ధమయ్యారని మరుసటి రోజైన శుక్రవారం నాటి పరిణామాలతో అర్థమవుతున్నదని విశ్లేషకులు చెబుతున్నారు. తండ్రి, కుమార్తె కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రణాళిక రూపొందించుకున్న అనంతరమే కేసీఆర్‌కు లేఖాస్త్రం సంధించినట్లు భావిస్తున్నారు. నేడో, రేపో కడియం శ్రీహరి, కావ్య కాంగ్రెస్ చేరడం లాంఛనప్రాయమేనని తేలింది. ఇప్పటికే కడియంతో పాటు కావ్యను కాంగ్రెస్ నేతలు కలిసి పార్టీలోకి ఆహ్వానించారు.

అందరినీ కాదని కావ్య వైపు మొగ్గు

గడ్డుకాలంలో సైతం పార్టీలో వరంగల్ ఎంపీ టికెట్ ఆశించిన పలువురిని కాదని డాక్టర్ కావ్య అభ్యర్థిత్వంవైపు బీఆరెస్‌ అధిష్ఠానం మొగ్గుచూపింది. కడియం పార్టీ మారకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా ఆయన కుమార్తె కావ్యకు ఎంపీ టికెట్ ఇచ్చారు. వాస్తవానికి వరంగల్ సిటింగ్‌ ఎంపీగా ఉన్న పసునూరి దయాకర్‌, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ను కాదని అధిష్ఠానం కావ్యకు అవకాశం కల్పించింది. ఈ నిర్ణయంతో రెండు పర్యాయాలు ఎంపీగా గెలిచిన పసునూరి దయాకర్ తీవ్ర నిరాశకు గురయ్యారు. కనీసం తన అభిప్రాయాన్ని కూడా తీసుకోకుండా అవమానించారని భావించిన పసునూరి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. టికెట్ ఆశించిన మరో నాయకుడు అరూరి రమేశ్‌ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన ఆ పార్టీలో చేరకుండా బీఆర్ఎస్ నేతలు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. కడియం శ్రీహరి, కావ్యలపై భరోసాతో ఇతర నాయకులను నిర్లక్ష్యం చేయడమే కాకుండా కాంగ్రెస్‌లో కడియం చేరకుండా వేసిన అడ్డుకట్ట అస్ర్తం పనిచేయలేదు.

కడియం శ్రీహరి అత్యంత ప్రాధాన్యం

ఉద్యమకాలమంతా టీడీపీలో ఉన్న కడియం శ్రీహరి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం అప్పటి టీఆర్ఎస్‌లో చేరారు. అప్పటి నుంచీ ఆయనకు ఎక్కడలేని ప్రాధాన్యం లభించింది. పార్టీలో చేరిన కొద్ది రోజులకే అప్పటి వరకు పార్టీని నమ్ముకున్న రామగళ్ళ పరమేశ్వర్‌ను కాదని వరంగల్ ఎంపీగా కేసీఆర్ అవకాశం ఇచ్చారు. తర్వాత కొద్ది రోజులకే ఎంపీగా రాజీనామా చేయించి, తొలి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాజయ్యను బర్తరఫ్ చేసి ఆయన స్థానంలో కడియాన్ని కూర్చోబెట్టారు. ఎమ్మెల్సీని చేసి, విద్యాశాఖ అప్పగించారు. రెండో పర్యాయం అధికారంలోకి రాగానే మంత్రివర్గంలో చాన్స్ ఇవ్వకున్నా ఎమ్మెల్సీగా రెండోసారి అవకాశం కల్పించారు. ఎమ్మెల్సీగా ఉండగానే సిటింగ్‌ ఎమ్మెల్యే రాజయ్యను కాదని ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చారు. ఆయన ఆ ఎన్నికల్లో గెలిచారు. తాజాగా ఆయన కుమార్తె కడియం కావ్యకు ఎంపీ టికెట్ ఇచ్చారు. తీరా ఇన్ని చేస్తే కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధం కావడాన్ని గులాబీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు.

కడియానికి కాంగ్రెస్ బంపర్ ఆఫర్?

కాంగ్రెస్ పార్టీ కడియానికి బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు చెబుతున్నారు. బీఆర్ఎస్ కంటే ఈ ఆఫర్ బాగున్నందున ఆఖరి నిమిషంలో అటు వైపు మొగ్గు చూపినట్లుగా చర్చించుకుంటున్నారు. బీఆర్ఎస్ లో కొనసాగితే కేవలం ఎమ్మెల్యేగా, తన బిడ్డకు ఎంపీగా పోటీ చేసే చాన్సు మాత్రమే లభిస్తోంది. ఎంపీగా గెలుస్తారనే ఆశ ఎలాగూ లేదు. ఇక కాంగ్రెస్ పార్టీలోకి మారితే తనకు మంత్రి పదవి, అధికార పార్టీలో అందలం, తన బిడ్డకు ఎంపీ టికెట్‌తోపాటు గెలిచేందుకు మార్గం సుగమవుతోందని పక్కా లెక్కలు వేసుకున్న తర్వాతనే పార్టీ మారేందుకు సిద్ధమైనట్లుగా చెబుతున్నారు. పైగా బీఆర్ఎస్ మునిగిపోయే పడవగా కడియం భావిస్తున్నట్లు సన్నిహితులు అంటున్నారు. ఇదిలా ఉండగా కడియం రాకపట్ల కాంగ్రెస్ అధిష్ఠానం లెక్కలు ఎలా? ఉన్నా కాంగ్రెస్‌లో అంత సానుకూల పరిస్థితులేమీలేవు. ఆయన వస్తే మళ్ళీ ఇప్పటికే ఇద్దరు మంత్రులకుతోడు మూడో రాజకీయ కేంద్రం ఉమ్మడి జిల్లాలో ఏర్పడుతుందని కాంగ్రెస్‌లో భావించేవారూ ఉన్నారు.

రాజయ్య పట్ల బీఆర్ఎస్ నిర్లక్ష్యం

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ ఘన్‌పూర్‌ సిటింగ్‌ స్థానాన్ని త్యాగం చేసిన తాటికొండ రాజయ్య కూడా ఎంపీ టికెట్ ఆశించినప్పటికీ బీఆర్ఎస్ అధిష్ఠానం కనీసం స్పందించకపోవడంతో రాజయ్య బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. వాస్తవానికి ఎన్నికల తర్వాత బీఆర్ఎస్‌ను వీడిన ముఖ్యనేత రాజయ్య కావడం గమనార్హం. బీఆర్ఎస్ అధిష్ఠానం, పార్టీ నాయకులు రాజయ్యను ఒక విధంగా అగౌరవపరిచారనే చర్చ సాగింది. కడియంకు ఇచ్చిన ప్రాధాన్యంలో రాజయ్యకు కనీసం దక్కలేదనే విమర్శలు వెల్లువెత్తాయి. రాజయ్యపై వచ్చిన వివిధ ఆరోపణలను సాకుగా తీసుకుని ఆయనను పక్కనపెట్టడమే కాకుండా ఆ తర్వాత ఆయనను పట్టించుకోకపోవడంతో ఆయన రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరేందుకు నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ నుంచి రాజయ్యకు సానుకూల సంకేతాలు రాలేదు. మరోవైపు రాజయ్య కాంగ్రెస్‌లో చేరడాన్ని వ్యతిరేకిస్తూ స్టేషన్ ఘన్‌పూర్‌ కాంగ్రెస్ నాయకులు గాంధీభవన్ ముందు నిరసన తెలియజేసి అడ్డుకున్నారు. అయినప్పటికీ రాజయ్య కాంగ్రెస్‌లో చేరేందుకు తన వంతు ప్రయత్నం చేశారని సమాచారం. మాదిగ సామాజిక వర్గానికి చెందిన రాజయ్యకు కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఇవ్వొచ్చనే చర్చ సాగింది. తాజాగా మారిన రాజకీయ పరిస్థితుల్లో హైదరాబాద్‌లో కొందరు బీఆర్ఎస్ నేతలు రాజయ్యను కలిసి తిరిగి పార్టీలోకి ఆహ్వానించినట్లు సమాచారం. ఈ విషయంపై తన నిర్ణయాన్ని వెంటనే ప్రకటించకుండా తన అనుచరులతో చర్చించి నిర్ణయం తెలియచేస్తానని చెప్పినట్లు తెలిసింది. దీనికోసం రాజయ్య హైదరాబాద్ నుంచి వరంగల్ వచ్చినట్లు చెబుతున్నారు. రాజయ్య నిర్ణయం ఎలా ఉంటుందోననే ఆసక్తికరమైన చర్చ జిల్లాలో సాగుతోంది. కాంగ్రెస్‌లో ఇంకా చేరకపోవడం, ఆ పార్టీ నుంచి తనకు సానుకూల సిగ్నల్ రాకపోవడం వల్ల రాజయ్య కూడా బీఆర్ఎస్ నుంచి పోటీకి అవకాశం కల్పిస్తే ఓకే అంటారని భావిస్తున్నారు. తన రాజకీయ పయనానికి మరోసారి అవకాశం లభించినట్లుగా భావించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. రాజయ్యను బీఆర్ఎస్ నిజంగానే సంప్రదించిందా? సంప్రదిస్తే ఆయన ఏ విధంగా స్పందిస్తారనే ఆసక్తినెలకొంది. ఇదిలా ఉండగా పార్టీ నుంచి వెళుతున్న వారిపట్ల బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. పవర్ బ్రోకర్లు, అవకాశవాదులంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరిగి పార్టీలోకి వస్తే కేసీఆర్ కాళ్ళు పట్టుకున్నా పార్టీలోకి రానివ్వమంటున్నారు. అయితే రాజయ్య కాళ్ళుపట్టుకున్నారా? ఆయన తిరిగి పార్టీలోకి ఎలా వస్తారని ప్రశ్నిస్తున్నవారూ ఉన్నారు.