పోరుగల్లులో మాటల మంటలు.. రగిలిన రాజకీయ సెగలు

హీటెక్కించిన రాజకీయ పక్షాలు జోడోయాత్రలో రేవంత్ రెడ్డి ఫైర్ ప్రజాప్రస్థానంలో షర్మిల విమర్శలు బీజేపీపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం లాంగ్‌మార్చ్‌కు సీపీఐ సన్నాహాం వామపక్షాల భూ ఆక్రమణలు గులాబీలపై బీజేపీ విమర్శలు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంగా రాజకీయ సెగలు పొగలు కక్కుతున్నాయి. యాత్రలు, పాదయాత్రలు పర్యటనల పేరుతో రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలతో వాతావరణాన్ని హీటెక్కిస్తున్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ బీఆర్ఎస్‌పై విపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, వామపక్ష పార్టీలైన […]

  • Publish Date - February 10, 2023 / 12:08 PM IST
  • హీటెక్కించిన రాజకీయ పక్షాలు
  • జోడోయాత్రలో రేవంత్ రెడ్డి ఫైర్
  • ప్రజాప్రస్థానంలో షర్మిల విమర్శలు
  • బీజేపీపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం
  • లాంగ్‌మార్చ్‌కు సీపీఐ సన్నాహాం
  • వామపక్షాల భూ ఆక్రమణలు
  • గులాబీలపై బీజేపీ విమర్శలు

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంగా రాజకీయ సెగలు పొగలు కక్కుతున్నాయి. యాత్రలు, పాదయాత్రలు పర్యటనల పేరుతో రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలతో వాతావరణాన్ని హీటెక్కిస్తున్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ బీఆర్ఎస్‌పై విపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, వామపక్ష పార్టీలైన సీపీఐ, సీపీఎం, ఎంసీపీఐయూతో పాటు ఆఖరికి వైయస్సార్ టీపీ ఆధ్వర్యంలో నిరసనలతో నువ్వా నేనా అనే స్థాయిలో పోటీ పడుతున్నారు. వరంగల్ కేంద్రంగా రాజకీయ పక్షాలు పాదయాత్రలు చేపట్టి జనాన్ని తమ వైపు తిప్పుకునేందుకు ముప్పు తిప్పలు పడుతున్నారు.

వరంగల్ పైన కాంగ్రెస్ కేంద్రీకరణ

కాంగ్రెస్ వరంగల్ పైన కేంద్రీకరించి పనిచేస్తుంది. గతంలో రాష్ట్రస్థాయి రైతు బహిరంగ సభను హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో భారీ స్థాయిలో నిర్వహించారు. లక్షలాది మంది రైతులు కార్యకర్తలు ఈ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరంగల్ డిక్లరేషన్‌ను ఈ వేదిక నుంచి ఆ పార్టీ యువ నేత రాహుల్ గాంధీ ప్రకటించారు.

జోడో యాత్రలో రేవంత్‌రెడ్డి ఫైర్

జోడోయాత్ర కొనసాగింపులో PCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రారంభించిన పాదయాత్ర కూడా వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలోని మేడారం గడ్డమీది నుంచి ప్రారంభం కావడం గుర్తుంచుకోవాల్సిన అంశం.

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు, మానుకోట డోర్నకల్ అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా యాత్ర నిర్వహించారు. రాష్ట్రంలో నియంతృత్వ పాలన కొనసాగిస్తున్న గులాబీ పార్టీపై రాజకీయ విమర్శలను ఎక్కుపెట్టారు.

తొమ్మిదేళ్లుగా ఆ పార్టీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తీవ్రంగా నిరసిస్తున్నారు. ప్రజలను మభ్యపెడుతూ అధికారం చెలాయిస్తుందని తీవ్రంగా విమర్శించారు. రేవంత్ రెడ్డి విమర్శలతో మాటల మంటలు పుడుతున్నాయి. ప్రగతి భవన్ పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో గులాబీ శ్రేణులు ఒక్కసారిగా విరుచుకపడ్డాయి. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ములుగు, మానుకోటలో కేసులు నమోదయ్యాయి. సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది.

బీఆర్ఎస్‌పై షర్మిల విమర్శలు

కాంగ్రెస్ పాదయాత్ర ప్రారంభం కాగా వైఎస్సార్ టిపి అధినేత్రి షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం యాత్ర జిల్లాలో గత నాలుగైదు రోజులుగా కొనసాగుతోంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యేలు లక్ష్యంగా షర్మిల తీవ్రమైన విమర్శలు చేస్తూ రాజకీయ వేడిని రగిలిస్తోంది. షర్మిల తీరుపై ఉమ్మడి జిల్లాలో గులాబీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, మానుకోట ఎంపీ మాలోత్ కవిత తాజాగా గులాబీ పార్టీ సీనియర్ నేత మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఘాటుగా స్పందించారు.

ఈటెల ఇలాఖాలో కేటీఆర్ పర్యటన

ఈ మధ్యలోనే మంత్రి కేటీఆర్ హనుమకొండ జిల్లాలో అధికారికంగా పర్యటించారు. తన ప్రత్యర్థి బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలోని కమలాపురం, జమ్మికుంట మండలాల్లో పర్యటించి బిజెపిపై విరుచుకుపడ్డారు. కేటీఆర్ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ నాయకులు నిరసన తెలియజేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. కేటీఆర్ పర్యటన తర్వాత కమలాపురం మండలంలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పర్యటించారు. ఈ సందర్భంగా గులాబీ, కాషాయ వర్గాల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొంది. పరస్పరం కేసులు నమోద చేసుకున్నారు.

విభజన హామీలపై బీజేపీ నిర్లక్ష్యం పైన విమర్శలు

BJP పై కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ములుగు గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఫ్యాక్టరీ హామీలు అమలుకు నోచుకోలేదని BRSతో పాటు కమ్యూనిస్టు పార్టీలు BJPపై ఫైర్ అవుతున్నాయి. విభజన హామీలు అమలు చేయకుండా, అభివృద్ధిని పట్టించుకోకుండా, మతం పేరుతో పబ్బం కడుపుకుంటున్నారని కమ్యూనిస్టులు మండిపడుతున్నారు. విభజన హామీలు, వరంగల్ జిల్లా సమగ్రాభివృద్ధి లక్ష్యంగా లాంగ్ మార్చ్ చేపట్టేందుకు సిపిఐ కార్యాచరణ ప్రణాళిక ప్రకటించింది.

సమగ్రాభివృద్ధి లక్ష్యంగా లాంగ్‌మార్చ్‌

బిజెపితో పాటు రాష్ట్రంలో బిఆర్ఎస్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ముఖ్యంగా ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వరంగల్ జిల్లా సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా సీపీఐ లాంగ్‌మార్చ్‌ యాత్ర కొనసాగించేందుకు సిద్ధమవుతోంది. సిపిఐ, సిపిఎం, ఎంసిపిఐ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భూ పోరాటాలు కొనసాగిస్తున్నారు. మరోసారి ప్రభుత్వ భూముల్లో జెండాలు పాతి గుడిసెలు వేస్తున్నారు. తిరిగి కమ్యూనిస్టులు తమ పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వంతో నెలకొన్న సఖ్యతను ఈ విధంగా వినియోగిస్తున్నారు.

బీజేపీ కార్నర్ మీటింగ్‌లు

జిల్లా వ్యాప్తంగా ప్రజాగోస.. బీజేపీ భరోసా పేరుతో శక్తి కేంద్రాలలో కార్నర్ మీటింగ్ ల పేరుతో కార్యకర్తలను కదిలించేందుకు బిజెపి ప్రారంభించింది. జిల్లా వ్యాప్తంగా ముఖ్య నాయకులు ఈ కార్యక్రమం విజయ వంతంలో భాగస్వామ్యం అయ్యారు. రానున్న ఎన్నికల్లో గట్టి పోటీనిచ్చే నియోజకవర్గాల్లో ప్రధాన నాయకత్వం కేంద్రీకరించి పనిచేస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రాజకీయ పక్షాలు, వివిధ ప్రజా సమస్యలు, రాజకీయ అంశాలపై ప్రజల్లో చర్చ రేకెత్తించడమే కాకుండా వచ్చే ఎన్నికల్లో వాళ్ల మనసు గెలుచుకునేందుకు చెమటోడిస్తున్నారు.