Warangal
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్లో (Warangal) రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపే ఫ్లెక్సీ ఏర్పాటు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, బిజెపి నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు మధ్య మరోసారి చిచ్చు పెట్టింది. పండుగ సందర్భంగా వరంగల్(Warangal) పోచమ్మైదాన్ సర్కిల్లో ప్రదీప్ రావు గురువారం ఏర్పాటు చేసిన శుభాకాంక్షలు తెలిపే బ్యానర్‌ను రాత్రికి రాత్రే తొలగించి ఎమ్మెల్యేకు చెందిన బ్యానర్ ఏర్పాటు చేయడంతో ఈ విభేదం నెలకొంది. ప్రదీప్ రావు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని రోడ్డుపై పడవేశారు.
స్థానికులే తొలగించారు
ప్రదీప్ రావుకు చెందిన ఫ్లెక్సీని నరేందర్ అనుచరులు తొలగించలేదని స్థానిక ముస్లింలే దానిని తొలగించారని అభిప్రాయం కొందరు వ్యక్తం చేస్తున్నారు. ప్రదీప్ రావు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో తానొక్కడి బొమ్మ మాత్రమే ఉంది. నరేందర్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో నరేందర్ తో పాటు చాలామంది ముస్లింల ఫోటోలు ఉన్నాయి.
అందుకే ప్రదీప్ రావు ఏర్పాటుచేసిన ప్లెక్స్ని తొలగించారని చెబుతున్నారు. ఫోటోలతో సంబంధం లేకుండా ముందుగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగించి, తరువాత ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం ఏమిటంటే ప్రశ్నిస్తున్నారు. గతంలో పోస్టర్ల విషయంలో కూడా వీరి మధ్య వైరం ఏర్పడింది.
ఇరువురి మధ్య ఉప్పూ నిప్పూ
అధికార, ప్రతిపక్ష పార్టీ మధ్య నెలకొన్న ఈ విభేదాలు కొంతకాలంగా తీవ్ర రూపం దాల్చాయి. ఒకరికి వ్యతిరేకంగా మరొకరు పావులు కదుపుతున్నారు. తూర్పులో ఎవరికి వారు ఆధిపత్యాన్ని సాధించేందుకు పోటీ పడుతున్నారు. పోటాపోటీగా పరామర్శలు, సందర్శనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ విషయంలో కూడా ఘర్షణ వాతావరణం నెలకొంది.
ప్రదీప్ రావు రూటే సపరేటు
వాస్తవానికి బిజెపి నాయకులు ఎవరు సాధారణంగా ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేసిన సందర్భాలు ఉండవు. ప్రదీప్ రావు దీనికి భిన్నంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి ముస్లింలను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఆయన ఇటీవలనే గులాబీ గూటి నుంచి బయటికి వచ్చి బిజెపి తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే.
ఎన్నికలే ఏకైక లక్ష్యం
రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీ పద్ధతి ఏదైనా ప్రదీప్ రావు మాత్రం ఈ విషయంలో ఒక అడుగు ముందుకు వేశారు. ఇఫ్తార్ విందు ఇవ్వడమే కాకుండా రంజాన్ సందర్భంగా ఈద్గాలను సందర్శించి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
ప్రదీప్ రావు తప్ప మిగతా బిజెపి నాయకులు ఎవరు ఆయన వెంట లేకపోవడం గమనార్హం. వరంగల్ (Warangal) తూర్పులో ముస్లింల ఓటు బ్యాంక్ 40% పైగా ఉంటుంది. ఈ కారణంగానే బిజెపిలోకి వెళ్లిన వారిని ఆకర్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
స్థానిక ఎమ్మెల్యే నరేందర్ కూడా అధికారికంగానే ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేసి ముస్లింలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. సర్కార్ తోఫాలు అందజేశారు. ఈద్గాలను తిరిగి సామూహిక ప్రార్ధనలో భాగస్వామ్యమై శుభాకాంక్షలు తెలియజేశారు.
అధికార పార్టీ దౌర్జన్యానికి నిదర్శనం: ఎర్రబెల్లి ప్రదీప్ రావు
తాము కట్టిన ఫ్లెక్సీలను తొలగించి, ఆ స్థానంలో ఎమ్మెల్యే నరేందర్ కు చెందిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం అధికార పార్టీ దౌర్జన్యానికి నిదర్శనమని ఎర్రబెల్లి ప్రదీప్ రావు విమర్శించారు. అధికారం ఉందని, పదవి ఉందని ఇలా నియంతల వ్యవహరిస్తూ, బలవంతంగా ప్రజల మీద నీ పేరు రుద్దాలి అనుకోవడం నీ అహంకారాన్ని ప్రదర్శించడమే అవుతుంది.
అహంకారంతో చేసే ఇలాంటి పనులను గమనిస్తూనే ఉన్నారు, త్వరలోనే నీ అహంకారానికి తగిన విధంగా ప్రజలే బుద్ధి చెబుతారు. బ్యానర్లు చింపేసినంత మాత్రాన ముస్లిం సోదరుల మనసులో నా పై ఉన్న నమ్మకాన్ని తుడి చెయ్యలేవు అనే విషయాన్ని గుర్తు పెట్టుకో నరేందర్ అంటూ ఎర్రబెల్లి హెచ్చరించారు.