Warangal | ఆదుకునే వారెవరు?.. వరద బాధితులపై సర్కారు తీవ్ర నిర్లక్ష్యం

Warangal వరద బాధితుల పట్ల సర్కారు తీవ్ర నిర్లక్ష్యం బురదలో మునిగి తల్లడిల్లుతున్న బాధితులు రూ.500 కోట్లు సరే, అదుకునేవారెవరూ? స్వచ్ఛంద సహకారంతో కాలం వెళ్లదీత నేటి నుంచి అసెంబ్లీకి ఎమ్మెల్యేలు, మంత్రులు చేతులెత్తేసిన జిల్లా అధికార యంత్రాంగం కనీస తక్షణ కార్యాచరణ ప్రణాళిక ఎక్కడ? విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: సర్వం వర్షార్పణమై కట్టుబట్టలతో వరదలో పడిన తమను ఆదుకోవడంలో సర్కారు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నదని వరద బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్నీ కోల్పోయి […]

  • Publish Date - August 2, 2023 / 04:02 PM IST

Warangal

  • వరద బాధితుల పట్ల సర్కారు తీవ్ర నిర్లక్ష్యం
  • బురదలో మునిగి తల్లడిల్లుతున్న బాధితులు
  • రూ.500 కోట్లు సరే, అదుకునేవారెవరూ?
  • స్వచ్ఛంద సహకారంతో కాలం వెళ్లదీత
  • నేటి నుంచి అసెంబ్లీకి ఎమ్మెల్యేలు, మంత్రులు
  • చేతులెత్తేసిన జిల్లా అధికార యంత్రాంగం
  • కనీస తక్షణ కార్యాచరణ ప్రణాళిక ఎక్కడ?

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: సర్వం వర్షార్పణమై కట్టుబట్టలతో వరదలో పడిన తమను ఆదుకోవడంలో సర్కారు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నదని వరద బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్నీ కోల్పోయి ఆపదలో చిక్కి అల్లాడుతున్న వారిపట్ల తక్షణ కనీస కార్యాచరణ లేకుండా, ఆదుకోవాలనే అంశాన్ని గాలికొదిలి బాధితుల ఆత్మగౌరవాన్ని నిండా ముంచేసిందని మండిపడుతున్నారు. సర్కారు పట్టింపులేని ధోరణి వల్ల ప్రజలు స్వచ్ఛంద సంస్థలు, దాతల సహకారం పై అధారపడి కాలం వెళ్లదీస్తున్నారు.

ఏ పూటకు ఎవరొచ్చి ఆదుకుంటారోనని పేద వర్గాలు ఎదురుచూస్తున్నాయంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వరద బాధిత కుటుంబాలు గత వారం రోజులుగా ఈ దుస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇక అధికారులు ఏం చేయాలో పాలుపోని స్థితిని ఎదుర్కొంటున్నారు. ఇలాంటి దయనీయ పరిస్థితిల్లో తక్షణం చేయాల్సిన ‘కార్యాచరణ’ లేకపోవడం వ్యవస్థ దుస్థితికి అద్దం పడుతున్నది.

రూ.500 కోట్లు విడుదలతో ఒరిగిందేంటి?

వరద ప్రాంతాల్లో తక్షణ చర్యలు చేపట్టేందుకు రూ.500 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వ ప్రతినిధులు ప్రకటించారు. ఇక్కడి మేరకు బాగానే ఉన్నప్పటికీ తక్షణ చర్యలు చేపట్టడంలో సర్కారు ఉదాసీన వైఖరితో బాధితులు తీవ్రంగా తల్లడిల్లుతున్నారు. సర్కారు పెద్దలు చెప్పే మాటలకూ, చేతలకూ అసలు పొంతన కన్పించడంలేదు.

నిధులు కేటాయించినట్లు ప్రకటించడం వల్ల లాభమేంటి? అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి, గణాంకాలు, నివేదికలు సిద్ధం చేసి బాధితులను ఆదుకునేందుకు కార్యచరణ అమలు చేసే వరకు పుణ్యకాలం పూర్తవుతోంది. అన్ని పోగొట్టుకొని, ఆశ్రయం కూడా లేని పేదల పరిస్థితి ఏంటనే ప్రశ్నలకు ఎవరూ సమాధానం చెప్పడంలేదు.

ఈ వారం రోజులు పెద్ద మనసున్నవారు, ఎన్నికల అవసరార్ధమో రాజకీయ పార్టీల నేతలు కాసింత తిండి, కొంత సామాగ్రి అందజేశారు. కానీ, కోలుకోలేని స్థితిలో ఉన్న ఈ కుటుంబాలకు సర్కారు చేస్తున్న సహాయమేంటంటి? అంటే సమాధానం దొరకడం లేదు.

చేతులెత్తేసిన జిల్లా అధికారులు..

అసలే అత్తెసరు నిధులతో కాలం వెళ్లదీస్తున్న జిల్లాల అధికారులు వరద బాధితులను ఆదుకోవడంలో చేతులెత్తేశారు. పునరావాస కేంద్రాలు ఒకటి, రెండు రోజులు నిర్వహించారు. బాధితులు తమ స్వగృహాలకు చేరుకుని పేరుకుపోయిన బురద తొలిగించే పని చేసుకుంటున్నారు.

పొట్టపోసుకునేందుకు పనులకు వెల్లాల్సిన పరిస్థితి ఉంది. తక్షణ ఆర్థిక సహాయమో, వస్తు సహాయమో, లేదా సామాగ్రి అందించలేని స్థితిలో అధికారులున్నారు. ముఖ్యంగా వరంగల్ నగర పరిధిలోని అధికారులు బాధితులను ఆదుకునే పనికంటే వచ్చిపోయే పెద్దలకు వివరాలు చెప్పే పనే ఎక్కువైంఇ. బాధితుల పరామర్శ పేరుతో ఇప్పటికే కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పర్యటించారు.

తాజాగా గవర్నర్ పర్యటించారు. వీరికి తోడు భద్రకాళి బండ్ కు పడిన గండి సమస్య, మంత్రులు, చీఫ్ విప్ పర్యటన, మధ్యలో సమీక్షలతో తలమునకలయ్యారు. వరద ఉధృతి నెలకొన్న తొలిరెండు రోజులు తప్ప జిల్లా అధికారులు ఆ తర్వాత వరద బాధితులను పట్టించుకున్నదిలేదు.

ఎంపీలూ, ఎమ్మెల్యేలూ ఇక సభకు..

నిన్నమొన్నటి వరకు ఓట్ల కోసమో? ఎన్నికల కోసమో? ఎమ్మెల్యేలు వరద సమయంలో హడావిడి చేశారు. వారిని వరద నుంచి గట్టెక్కించే మహానుభావులుగా మారారు. ఎప్పుడైతే వరద తగ్గుముఖం పట్టిందో వీరు కూడా ఒక విధంగా ముఖం చాటేశారు. సర్వం కోల్పోయిన వారిని ఆదుకోవడానికి ప్రభుత్వపరంగా తీసుకోవాల్సిన చర్యలు మృగ్యమయ్యాయి.

తాజాగా పార్లమెంట్ సమావేశాలున్నందున ఎంపీలు ఢిల్లీకి వెళ్ళారు. గురువారం నుంచి అసెంబ్లీ సమావేశాలున్నందున నిన్నమొన్న జనం అంటూ తిరిగిన ఎమ్మెల్యేలు కూడా కన్పించకుండా పోతారు. కర్ణుని చావుకు నూరు కారణాలన్నట్లు వరద వెనుక ఉన్న అనేక కారణాలను పట్టించుకోకుండా అంతా అయిపోయిన తర్వాత వరద బాధిత లెక్కలు తేలిన తర్వాత పైసో, పరకో చేసే సహాయం వస్తే తప్ప బాధితులకు దిక్కులేదు. అప్పటి వరకు సర్కారు సహాయం పై ఆశలొదులుకొని బాధితులు పెద్ద మనుసుతో వచ్చే దాతల పైనే ఆధారపడక తప్పని అయోమయ స్థితి ఏర్పడింది.