విధాత, మెదక్ బ్యూరో: తెలంగాణ నీటి పారుదల మోడల్ దేశానికే ఆదర్శమని పంజాబ్ సీఎం భగవత్ సింగ్ మాన్ అన్నారు. పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ గురువారం కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని కొండపోచమ్మ రిజర్వాయర్‌ను, కొండపోచమ్మ పంప్ హౌస్‌ను, ఎర్రవల్లిలోని చెక్ డామ్‌ను చివరిగా గజ్వేల్ పట్నంలోని పాండవుల చెరువును సందర్శించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర నీటిపారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్ కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రత్యేకతలు మరియు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ప్రాధాన్యత, దాని నిర్మాణం, నిర్మాణానికి రాష్ట్ర సీఎం కేసీఆర్ తీసుకున్న ప్రత్యేక శ్రద్ధను వివరించారు.
ఈ సందర్భంగా పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు నాలెడ్జ్ షేరింగ్‌లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకంను పరిశీలించేందుకు రాష్ట్రానికి రావడం జరిగిందన్నారు.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా 500 మీటర్ల పైకి గోదావరి నీటిని తీసుకువచ్చి మెట్ట ప్రాంతాలను సస్యశ్యామలం చేయడం ఆదర్శనీయం. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంతో పాటు నీటిపారుదల, పారిశ్రామిక, వైద్య, ఆరోగ్యం తదితర అన్ని రంగాలలో అద్భుతమైన అభివృద్ధి జరిగిందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో నిర్మించిన రిజర్వాయర్లు, చెక్ డాములు భూగర్భ జలాల పెంపునకు అత్యధికంగా ఉపయోగపడుతుంది. తెలంగాణ నీటి పారుదల మోడల్ దేశానికి ఆదర్శమని అన్నారు. 1947 ముందు నుంచి పంజాబ్ రాష్ట్రంలో నీటిపారుదల మరియు వ్యవసారంగాలు అభివృద్ధి సాధించాయి. పంజాబ్ అంటేనే ఐదు నదుల సంఘమం.
భాక్రానంగల్ లాంటి గొప్ప ప్రాజెక్టులతో పంజాబ్ దేశంలోనే ఆహార ఉత్పత్తిలో ప్రథమంగా ఉండేదనీ చెప్పారు. కానీ భూగర్భ నీటి వనరులను అధికంగా ఉపయోగించడం మూలంగా ప్రస్తుతం పంజాబ్ లోని కొన్ని జిల్లాలో భూగర్భ నీటిమట్టాలు ప్రమాదకర స్థాయికి చేరాయి. పంజాబ్ లో 80% భూగర్భ నీటి లభ్యతలో డార్క్ జోన్ లో ఉందినీ అన్నారు.
తెలంగాణ మోడల్‌ని అనుసరించి పంజాబ్‌లో కూడా చెక్ డామ్‌లు విరివిగా నిర్మించి జల సంపదను భవిష్యత్తు తరాలకు అందించేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. భూగర్భ నీటి వనరులను కాపాడేందుకు క్రాఫ్ట్ డైవర్షన్ పద్ధతిని అనుసరిస్తున్నాము. పంజాబ్‌లో గల పాతకాలం నాటి నీటిపారుదల వ్యవస్థను తెలంగాణలో లాగా ఆధునికరించి భూగర్భ జలాలను పెంచేందుకు ప్రయత్నిస్తామన్నారు.
కేంద్ర ప్రభుత్వం సరైన మద్దతు ధర ఇవ్వకపోవడం మూలంగా రైతులు నష్టపోతున్నారనీ ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్, తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖర రావులు విద్యా, వైద్యం తదితర రంగాలలో అమలు చేస్తున్న వినూత్న పథకాలు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆకర్షిస్తున్నాయన్నారు.