రైతు బంధుపై ప్రతిపాదన, ఫిర్యాదులు అందలేదు: తెలంగాణ సీఈఓ వికాస్ రాజ్

- అభ్యర్థులు కొత్త జీరో అకౌంట్ ఆర్వోకు సమర్పించాలి
విధాత, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభం అయిందని, ఆదివారం తప్ప అన్ని రోజులు నామినేషన్ స్వీకరిస్తారని తెలంగాణ సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు. అభ్యర్థులు నామినేషన్ కు ఒక రోజు ముందు కొత్త జీరో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఆర్వోకు ఇవ్వాలని సూచించారు. డిపాజిట్ కోసం క్యాష్ లేదా చలాన్ ఇవ్వాలని, చెక్ అనుమతి లేదన్నారు. నామినేషన్ ఉపసంహరణ కోసం అభ్యర్థి రావాలని, లేదా ఆయన లెటర్ ఉండాలన్నారు. ఆక్టోబర్ 31వ వరకు ఓటు హక్కు కోసం 59లక్షల అఫ్లికేషన్స్ వచ్చాయని, ఫామ్ – 6 అఫ్లికేషన్స్ 36లక్షలు వచ్చాయని తెలిపారు. ఫైనల్ ఓటర్ రోల్ నవంబర్ 10వ తేదీన ప్రకటిస్తామన్నారు.
నవంబర్ 10వ తేదీన ఓటర్ స్లీప్ పంపిణి మొదలు అవుతోందని, బీఎల్‌ఏ ఓటర్ స్లీప్ పంపిణి లో ఫిర్యాధు ఉంటే ఆర్వోకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. పోలింగ్ కేంద్రాల సంఖ్య పెరిగిందని, 15వందల వరకు పోలింగ్ కేంద్రాలు పెరగనున్నాయన్నారు. దివ్యాంగులు వీలైనంత మేరకు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. వారి కోసం బ్యాలెట్ పేపర్ సదుపాయం, 18వేల వీల్‌చైర్స్ ఏర్పాటు చేశామన్నారు. మిషన్ 21పేరుతో యువ ఓటర్ల సంఖ్య పెంచడానికి కేంద్ర ఎన్నికల సంఘం టార్గెట్ పెట్టిందన్నారు. కొత్తగా 9లక్షల 10వేల 810మంది యువ ఓటర్లు నమోదయ్యారన్నారు. నవంబర్ 2వ తేదీ నాటికి ఓటర్ల సంఖ్య 3కోట్ల 21లక్షల, 88,753గా ఉందన్నారు. ఎన్నికల తనిఖీల్లో 453కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నామన్నారు. స్వాధీనం చేసుకున్న నగదుకు ఆధారలుంటే సామాన్యులకు ఇబ్బంది కల్గకుండా వెంటనే జిల్లా కమిటీలు విడుదల చేసేలా ఆదేశాలిచ్చామన్నారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలపై 362కేసులు నమోదవ్వగా, 256ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనట్లుగా తెలిపారు. సీ విజిల్ యాప్ ద్వారా 2,487ఫిర్యాదులు వచ్చాయని, అనుమతుల కోసం 9,630దరఖాస్తులు అందాయన్నారు.
205చెక్ పోస్టులు ఏర్టాపు చేశామన్నారు. ప్రతి జిల్లా ఎన్నికల అధికారి అధ్వరంలో సీసీటీవీ మానిటరింగ్ ఉందన్నారు. రాజకీయ పార్టీలు అనుమతుల కోసం ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇప్పటిదాకా ఎంసీసీ ఉల్లంఘన కేసులు 137నమోదైనాయని, వాటిలో బీఆరెస్‌పై 13, కాంగ్రెస్‌పై 16, బీజేపీపై 5, బీఎస్పీపై 3కేసులు నమోదైనాయని తెలిపారు. ఆర్వోల వద్ధ ఫిర్యాదులకు ప్రత్యేక సెల్ ను ఏర్పాటు చేశామన్నారు. అఫిడవిట్ సమర్పణలో అభ్యర్థులు జాగ్రత్తగా ఉండాలన్నారు.
అఫిడవిట్‌లోని అన్ని కాలమ్స్ నింపాలన్నారు. రైతు బంధు విడుదలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన అందలేదన్నారు. ఇటు రైతు బంధు ఆపాలని కూడా ఫిర్యాదులు అందలేదన్నారు. ప్రగతి భవన్‌లో బీఫామ్‌ల పంపిణీపై కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక అందించామన్నారు. ఐటీ దాడులు సాధారణ రోజువారి విధులని తెలిపారు. ఎన్నికల్లో ప్రలోభాలను కట్టడి చేసేందుకు 375 కంపెనీల కేంద్ర బలగాలు వస్తాయన్నారు. దుబ్బాక బీఆరెస్ అభ్యర్థిపై దాడి విచారకరమన్నారు. దీనిపై నివేదిక కోరామని, ఇలాంటి ఘటనకు పునావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.