గవర్నర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

  • Publish Date - September 25, 2023 / 03:58 PM IST

విధాత: గవర్నర్​ కోటా ఎమ్మెల్సీల విషయంలో రాష్ట్ర గవర్నర్​ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఈమేరకు ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. గవర్నర్​ కోటా, రాష్ట్రపతి కోటాలు మేధావులు, విద్యావంతులు, కవులు, కళాకారులు, సామాజిక కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన నామినేటెడ్​ పదవులు అని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్​ గతంలో కూడా అనేక క్రిమినల్​ కేసులు ఉన్న వ్యక్తులను ఎమ్మెల్సీలుగా నియమించాలని గవర్నర్​కు ప్రతిపాదనలు పంపారని, అయితే గవర్నర్​ వాటిని తిరస్కరించినట్లు గుర్త చేశారు. కేసీఆర్​ కుటుంబానికి సేవ చేసే వ్యక్తులను గవర్నర్​ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించాల్సిన అవసరం లేదని తెలిపారు. తెలంగాణ గవర్నర్​ తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైనదని, ఆమెకు తెలంగాణ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేశారు.


కేసీఆర్​కు అనుకూలంగా ఉంటేనే.. గవర్నర్​గా వ్యవహరించినట్టా? కేసీఆర్​ చేస్తున్న తప్పిదాలు, పొరపాట్లను ఎత్తి చూపుతూ ధైర్యంగా నిర్ణయం తీసుకుంటే.. గవర్నర్​గా మీక నచ్చరా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. తమ కాళ్ల దగ్గర ఉండేవాళ్లు గవర్నర్​ కోటాలో ఎమ్మెల్సీలుగా ఉండాలని కోరుకోవడం సమంజసం కాదని, తెలంగాణ గవర్నర్​ తీసుకున్న నిర్ణయం సరైనదే అన్నారు.