Bangalore
విధాత: వాహనాల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయిన నేపథ్యంలో ఇరుగుపొరుగు మధ్య కార్ల పార్కింగ్ విషయంలో తగువులు చూస్తూనే ఉంటాం. ఆ అంశంలో తన పొరుగు వారితో ఇబ్బంది పడుతున్న ఓ వ్యక్తి చేసిన పని ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఇంటి ముందు పొరుగు వ్యక్తి తన కారును పార్కింగ్ చేయడం మొదలుపెట్టాడు.
కాగా.. కొన్ని రోజులుగా ఇది జరుగుతుండగా.. తన ఇంటి ముందు కారు నిలపవద్దని ఆ వ్యక్తిని పలుమార్లు అభ్యర్థించాడు. అయినా లాభం లేకపోవడంతో ఒక రిక్వెస్టు నోట్ రాసి.. తన ఇంటి ముందు పెట్టిన కారుకు అంటించాడు. దయచేసి మీరు కారును ఇక్కడ పార్క్ చేయొద్దు. గతంలో పలుమార్లు మీకు ఈ సంగతి చెప్పాను. ఇక్కడ మేము 2000వ సంవత్సరం నుంచి ఉంటున్నాం.
Found this in Koramangla today. Bengaluru – the city of epic content@peakbengaluru pic.twitter.com/NoFelvA6bw
— Subhasis Das (@inframarauder) June 27, 2023
ప్రస్తుతం మాకు రెండు కార్లున్నాయి. వాటిని పెట్టడానికే మా ఇంటి ముందున్న స్థలం సరిపోతుంది. మీరు ఇంతకుముందు ఎక్కడ కారు పెట్టేవారో అక్కడే పార్కింగ్ కొనసాగించండి. మీరు మంచి నైబర్‌గా ఉంటారని ఆశిస్తున్నాం అని ఆ లేఖలో రాశారు.
దీనిని సుభాశిస్ దాస్ అనే వ్యక్తి ఫొటో తీసి ట్వీట్ చేశాడు. బెంగళూరు (Bengaluru) లోని కోరమంగళలో ఈ ఎపిక్ నోట్‌ను చూశానని ట్వీట్‌లో పేర్కొన్నాడు. అయితే ఈ కారు తనది కాదని.. రోడ్లపై నడుస్తున్నపుడు కనిపిస్తే ఫొటో తీశానని తెలిపాడు.
దీనిపై యూజర్లు పలు రకాలుగా స్పందించారు. ఇది ఒక అద్భుతమైన లేఖ అని ఒకరు రాయగా.. ఇదే దిల్లోలోనో గురుగ్రాంలోనో అయ్యుంటే ఈ పాటికి చిన్న యుద్ధం జరిగి ఉండేదని మరొకరు స్పందించారు. ఈ లేఖ నా కారుపై కానీ కనిపిస్తే.. అది రాసిన వారికి క్షమాపణ చెప్పి టీకి ఆహ్వానిస్తామని వ్యాఖ్యానించాడు.