ప్రగతి భవన్‌ను నక్సలైట్లు పేల్చితే తప్పేంటి..?: రేవంత్‌ రెడ్డి

గడీలను కూల్చినట్టు కూల్చాలి ప్రజలకు ఉపయోగపడనప్పుడు ప్రయోజనమేమిటి? 2001లో కేసీఆర్ కుటుంబ ఆస్తి ఎంత? ఇప్పుడు ఎంత? ప్రజలను దోచుకుంటున్న గాడిదలు ఎర్రబెల్లి లాంటి తెలంగాణ ద్రోహులకు మంత్రి పదవులు సీఎం కేసీఆర్ కుటుంబం తీరుపై ఆగ్రహం  2024లో కాంగ్రెస్‌దే అధికారం అని ధీమా ములుగు బహిరంగ సభలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ప్రజలకు ఉపయోగపడని ప్రగతి భవన్‌ను ఏ నక్సలైట్లైనా కూల్చివేస్తే సంతోషిస్తాం… కోట్లాది రూపాయల […]

  • Publish Date - February 7, 2023 / 04:02 PM IST
  • గడీలను కూల్చినట్టు కూల్చాలి
  • ప్రజలకు ఉపయోగపడనప్పుడు ప్రయోజనమేమిటి?
  • 2001లో కేసీఆర్ కుటుంబ ఆస్తి ఎంత? ఇప్పుడు ఎంత?
  • ప్రజలను దోచుకుంటున్న గాడిదలు
  • ఎర్రబెల్లి లాంటి తెలంగాణ ద్రోహులకు మంత్రి పదవులు
  • సీఎం కేసీఆర్ కుటుంబం తీరుపై ఆగ్రహం
  • 2024లో కాంగ్రెస్‌దే అధికారం అని ధీమా
  • ములుగు బహిరంగ సభలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ప్రజలకు ఉపయోగపడని ప్రగతి భవన్‌ను ఏ నక్సలైట్లైనా కూల్చివేస్తే సంతోషిస్తాం… కోట్లాది రూపాయల ప్రజాధనం వెచ్చించి వందల గదులతో గఢీ లాంటి ప్రగతి భవన్‌ను నిర్మిస్తే… అందులోకి మన తెలంగాణ ప్రజలకు ప్రవేశం లేనప్పుడు… ఎందుకీ ప్రగతిభవనని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. దొరల గడీలను పేల్చివేసినట్లు ప్రగతి భవన్‌ను ఏ డైనమైటో పెట్టి నక్సలైట్లు కూల్చివేస్తే తప్పేంటని రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

జోడో యాత్రలో భాగంగా మంగళవారం రాత్రి ములుగు సెంటర్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ పై విధంగా వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల కోసం నిర్మించిన భవన్ ఆంధ్ర పెట్టుబడిదారులకు నిలయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇలాంటి వాటిని చూసేందుకా? మన బిడ్డలు త్యాగాలు చేసి తెలంగాణ సాధించుకుందని ప్రశ్నించారు. మీరు ఎప్పుడైనా తెలంగాణ భవన్‌లోకి వెళ్లారా అంటూ జనాన్ని ఉద్దేశించి ప్రశ్నించారు. జనం నుంచి లేదని చెప్పడంతో మరింత ఉత్తేజంతో ప్రసంగించారు.

తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా

60 ఏళ్ల తెలంగాణ ప్రజల దు:ఖాన్ని చూడలేక సోనియాగాంధీ, ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైతదని తెలిసి కూడా తెలంగాణ ఇచ్చార‌ని ఆయన గుర్తు చేశారు. అనేక మంది బిడ్డల త్యాగం ఆమెను కదిలించిందని, మరో బిడ్డ ప్రాణం పోకూడదని తెలంగాణ ఇచ్చార‌ని చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత కెసిఆర్ మనకోసం ఏం చేశారని ప్రశ్నించారు.

కేసీఆర్ కుటుంబ ఆస్తులెన్ని?

2001లో రబ్బర్ చెప్పులతో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన కేసీఆర్ ఆయన కుటుంబం వేల కోట్లకు ఎదిగిందనీ… రాష్ట్ర బడ్జెట్ అంతా ఈ దొంగల పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ వేల ఎకరాలు సంపాదించుకున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అమలుచేసిన సంక్షేమ రాజ్యానికి కేసీఆర్ తూట్లు పొడిచారని మండిపడ్డారు. విద్యార్థులు, యువకులు, రైతులు, పేదలకు అన్యాయం చేశారని విమర్శించారు. దళితులకు మూడెకరాలు, డబుల్ బెడ్ రూమ్ నిర్మాణం అడ్రస్ లేకుండా పోయాయని దుయ్య‌బ‌ట్టారు.

ఇంటి నిండా పదవులు

త‌న ఇంటిలో మాత్రం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అయ్యారని, ఉద్య‌మాల్లో పాల్గ‌న్న వారికి ఏదీ ద‌క్కలేద‌ని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో డ్రామారావు ఎక్కడున్నాడని ప్రశ్నించారు.

తెలంగాణ ద్రోహులకు మంత్రి పదవులు

తెలంగాణ ద్రోహులైన ఎర్రబెల్లి దయాకర్, ఆలుగడ్డ శ్రీనివాస్, మల్లారెడ్డి లకు మంత్రి పదవులు దక్కాయి… రాష్ట్రం కోసం కొట్లాడిన వారికి కడుపుకోత మిగిలిందని విచారణ వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం కొట్లాడిన బిడ్డలకు అమరుల కుటుంబాలకు ఏ పదవులైన ఇచ్చారా అంటూ ప్రశ్నించారు.

2024లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది..

2024లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని… ప్రజల ఆకాంక్షలు ఆశయాలను అమలు చేస్తామని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ములుగును సమ్మక్క సారలమ్మ జిల్లాగా, మల్లంపల్లి మండలంగా పేదల ఆకాంక్షలు అమలయ్యే ప్రభుత్వం వస్తుందని భరోసా ఇచ్చారు. గిరిజనుల పోడు భూముల సమస్య పరిష్కారం కూడా కాంగ్రెస్ హయాంలోనే అవుతుందని హామీ ఇచ్చారు.

హరితహారం పేరుతో ఈ ప్రభుత్వం గిరిజనుల నుంచి భూములు లాక్కుంటుందని విమర్శించారు. గాడిదలకు గడ్డి వేసి ఆవులకు పాలు పిండితే లాభం లేదని… కాంగ్రెస్ అధికారంలో వచ్చేందుకు మీరంతా కృషి చేయాలని తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను ఈసారి దీవించాలని రేవంత్ రెడ్డి విన్నవించారు.

ఈ సభకు ఎమ్మెల్యే సీతక్క అధ్యక్షత వహించగా భారీ సంఖ్యలో స్థానికులు, కాంగ్రెస్ శ్రేణులు హాజరయ్యారు. కాంగ్రెస్ నేతలు మల్లు రవి, బలరాం నాయక్, వేం నరేందర్ రెడ్డి, బెల్లయ్య నాయక్, గండ్ర సత్యనారాయణ రావు తదితరులు హాజ‌ర‌య్యారు.