ఆడియో మెసేజ్‌లకూ వ్యూ వన్స్ ఫీచర్.. అప్‌డేట్ ఇవ్వనున్న వాట్సప్
యూజర్ల ప్రైవసీ (Users Privacy) రక్షణకు చర్యలు తీసుకుంటున్న వాట్సప్ (Whats App) మరో కీలక నిర్ణయం తీసుకుంది

విధాత: యూజర్ల ప్రైవసీ (Users Privacy) రక్షణకు చర్యలు తీసుకుంటున్న వాట్సప్ (Whats App) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఫొటోలు, వీడియోలకు మాత్రమే పరిమితమైన వ్యూ వన్స్ విధానాన్ని ఆడియో మెసేజ్‌లకూ తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే ఆడియో మెసేజ్ పంపించేటప్పుడే వ్యూ వన్స్ ఆప్షన్‌ను టిక్ చేయొచ్చు. తద్వారా అవతలివారు ఒకసారి దానిని విన్న వెంటనే డిలీట్ అయిపోతుంది.
2021లో ఫొటోలు, వీడియోలకు వ్యూ వన్స్ ఫీచర్‌ను తీసుకొచ్చిన వాట్సప్… యూజర్స్ నుంచి అభ్యర్థనలు రావడంతో ఆడియో మెసేజ్‌లకూ దీనిని వర్తింపజేస్తోందని టెక్ నిపుణులు చెబుతున్నారు. కొన్ని రోజుల క్రితం వరకూ వ్యూ వన్స్‌లో వచ్చిన ఫొటోలను స్క్రీన్ షాట్లు తీసుకోవడం, సేవ్ చేసుకోవడానికి వీలుండేది. ఇటీవలే ఈ అవకాశం లేకుండా వాట్సప్ అప్‌డేట్ ఇచ్చింది. ఇప్పుడు మనం వ్యూ వన్స్‌లో వచ్చే ఫొటోలను, వీడియోలను స్క్రీన్ షాట్ తీసినా.. అందులో ఏమీ ఉండదు. ఇదే విధానాన్ని ఆడియో మెసేజ్‌లకు ఇస్తున్నట్లు తెలుస్తోంది.
వ్యూ వన్స్‌లో వచ్చిన ఆడియో మెసేజ్‌లను ఫార్వర్డ్ చేయడానికి గానీ.. డౌన్‌లోడ్ చేయడానికి కానీ వీలుండదు. ఇప్పటి వరకు ఈ ఫీచర్ అందుబాటులో లేకపోవడంతో మెసేజ్‌లతో పోలిస్తే ఆడియో మెసేజ్ ఫీచర్‌ను చాలా తక్కువ మంది వినియోగించేవారు. ప్రైవసీ కారణాల వల్లే ఇలా జరుగుతోందని భావించిన వాట్సప్ తాజా నిర్ణయం తీసుకుంది. అయితే వాట్సప్ ప్రకటనపై కొన్ని అభ్యంతరాలు కూడా వస్తున్నాయి. వ్యూ వన్స్‌ను అలుసుగా తీసుకుని బెదిరింపు ఆడియో మెసేజ్‌లు వ్యూ వన్స్ విధానంలో పంపుతారేమోనని ఆందోళన వ్యక్తం అవుతోంది.
తద్వారా ఫిర్యాదు చేయడానికి అవకాశం ఉండదని వాదన వినపడుతోంది. ఈ అభ్యంతరాలపై వాట్సప్ వివరణ ఇచ్చింది. వ్యూ వన్స్ విధానంలో ఫొటోకానీ, వీడియోకానీ, ఆడియో మెసేజ్ కానీ వచ్చినా.. వాటిని స్వీకరించిన వారికి 14 రోజుల పాటు అవి అందుబాటులోనే ఉంటాయని తెలిపింది. 14 రోజుల తర్వాత అవి డిలీట్ అయిపోతాయని స్పష్టం చేసింది. అలాగే వ్యూ వన్స్ మెసేజ్‌లను ఓపెన్ చేసేంత వరకు అవి బ్యాకప్‌లో సేవ్ అవుతాయని.. ఒకసారి ఓపెన్ చేస్తే ఎక్కడా సేవ్ అవ్వవని వివరించింది. తొందర్లోనే ఈ ఫీచర్‌ను అందరికీ అందుబాటులోకి తెస్తామని.. యూజర్లు నిర్భయంగా ఆడియో మెసేజ్ ఆప్షన్‌నూ ఉపయోగించుకోవచ్చని ఒక ప్రకటనలో పేర్కొంది.