విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: నాయకులారా మీరు ఎందుకు కొట్లాడుకుంటున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారని ఆ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు చెప్పారు. హనుమకొండలో సోమవారం రాత్రి జరిగిన కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ లో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
8 ఏళ్ల నుంచి మేము సమస్యలపై కొట్లాడుతుంటే.. నాయకులుగా ఉండి మీరెందుకు కొట్లాడు కుంటున్నారని, మా మధ్య విభేదాలను కాంగ్రెస్ కేడర్ ప్రశ్నిస్తుందని అన్నారు. నాయకులుగా మేమంతా కలిసి ఉంటామని.. కార్యకర్తలుగా మీరంతా కలిసి ఉండాలని హితవు పలికారు.
మేము కలిసి ఉంటే అప్పుడప్పుడు పేపర్ వాళ్ళు ఇలాంటి పంచాయతీలు పెడతారని.. మీరు వీటిని పట్టించుకోకూడదు అని చలోక్తి విసిరారు. మేం మీకండగా ఉంటాం.. రేవంత్ నువ్వు ముందుకు సాగమని ప్రోత్సహిస్తున్నామని హనుమంతరావు చెప్పారు.
LIVE: YATRA FOR CHANGE || Day -12 || Hanumakonda || Revanth Reddy https://t.co/DHMwY0zQCQ
— Revanth Reddy (@revanth_anumula) February 20, 2023
మోడీ, కెసిఆర్ లపై ఆగ్రహం
ప్రధాని మోడీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై హనుమంతరావు మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నోట్ బందు అని చెప్పి పేదల జీతాలతో చెలగాటమాడిన ప్రధాని, దానివల్ల పేదలకు ఏం సాధించారని విమర్శించారు. ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు జమ చేస్తానని చెప్పి ప్రధాని ఇచ్చిన హామీ ఎక్కడ పోయిందని ప్రశ్నించారు. ప్రభుత్వాలను కూలగొట్టేందుకు మోడీ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని మండి పడ్డారు.
దేశాన్ని హిందూ, ముస్లింగా విడగొట్టి ముక్కలు చేసేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. దేశ స్వాతంత్రం కోసం పోరాడి ఉరితాడును ముద్దాడిన భగత్ సింగ్ ను పట్టించుకోకుండా సావర్కర్ ఎక్కడి నుంచి వచ్చాడని విమర్శించారు. నాగపూర్ లో ఆర్ఎస్ఎస్ ఎప్పుడు త్రివర్ణ పతాకాన్ని ఎగిరేసిందో మరిచిపోతున్నారా? అంటూ ప్రశ్నించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేందుకు బిజెపి కుట్ర చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
JAI CONGRESS slogans echoed on the streets of historic Warangal city on the 12th day of #YatraForChange
Will KCR be able to sleep today…?!#Warangal #HaathSeHaathJodo #Day12YatraForChange pic.twitter.com/N1rNn0FE3i
— Revanth Reddy (@revanth_anumula) February 20, 2023
బడుగుల సంక్షేమం కాంగ్రెస్ లక్ష్యం
బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేసిందని హనుమంత రావు గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ దళితులకు మూడెకరాల భూమి ఇవ్వడమేమో గాని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూములను లాక్కుంటున్నారని విమర్శించారు. ధరణి పేరుతో దందా చేస్తున్నారని మండి పడ్డారు. నాగార్జున సాగర్ మీద కూర్చొని కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నిస్తున్నారని విమర్శించారు.
విశాఖ ఉక్కును తమ వ్యాపార స్నేహితుడు ఆదానికి అమ్మేందుకు మోడీ కుట్ర చేశారని అన్నారు. ప్రైవేటైజేషన్ వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు గల్లంతయితాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2004లో వరంగల్లో బడుగు బలహీన వర్గాల సభ నిర్వహించిన తర్వాతనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ఆ బాటలో మళ్లీ పయనించాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి ఆ కర్తవ్యాన్ని చేపట్టాలని గుర్తు చేశారు.