Uttar Pradesh | ఆ దంపతులది ప్రేమ వివాహం. ప్రియుడి కోసం తన మతాన్ని మార్చుకుంది. కొన్నాళ్ల పాటు వీరి దాంపత్య జీవితం అన్యోనంగా సాగినప్పటికీ, ఇటీవలి కాలంలో గొడవలు అధికమయ్యాయి. దీంతో క్షణికావేశంలో భార్యను చంపి, ఇంట్లోనే పూడ్చిపెట్టాడు.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ లఖింపూర్ పరిధిలోని గోలా గోకరన్ ఏరియాకు చెందిన మహ్మద్ వశీ.. ఉషా అనే అమ్మాయిని ప్రేమించాడు. ఇద్దరి మనసులు కలియడంతో 2017లో పెళ్లి చేసుకున్నారు. దీంతో ఆమె మతం మారింది. తన పేరును ఫాతిమాగా మార్చుకుంది.
అయితే గత కొద్ది రోజుల నుంచి ఇద్దరి మధ్య గొడవలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే భార్యతో గొడవపెట్టుకున్నాడు భర్త. అదే రోజు రాత్రి ఆమె నిద్రలోకి జారుకున్న తర్వాత.. కరెంట్ షాక్ పెట్టి చంపాడు. అనంతరం తన ఇంట్లోనే గుంత తీసి పూడ్చిపెట్టాడు. అయితే కోడలు కనిపించడం లేదని మహ్మద్‌ను అతని తల్లి ప్రశ్నించింది. పొంతన లేని సమాధానాలు చెప్పడంతో.. అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తల్లి ఫిర్యాదుతో కోడలు హత్య వెలుగు చూసింది. మహ్మద్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.