BRS | బీఆర్ఎస్‌కు ఎదురుగాలి వీయ‌నుందా?

BRS | కొంప‌ ముంచ‌నున్న ముఖ్య‌మంత్రి అతి విశ్వాసం? ప్ర‌జ‌ల‌కు ప్ర‌వేశం లేని న‌వీన పాల‌నా సౌధాలు నేత‌ల‌కు ద‌క్క‌ని కేసీఆర్‌, కేటీఆర్ అపాయింట్‌మెంట్‌లు 30-40 సీట్లు మార్చ‌క‌పోతే ఆశ‌లు గ‌ల్లంతే కేసీఆర్ కుటుంబీకుల‌పైనా ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త‌! తెలంగాణ‌లో అధికార బీఆర్ఎస్‌ (BRS)కు వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్నాయా? అంటే నిజ‌మేన‌ని క్షేత్రస్థాయి ప‌రిశీల‌న‌లో తెలుస్తోంది. విధాత బృందాలు ప‌లు జిల్లాల్లో ప‌ర్య‌టించి, ప్ర‌జ‌ల‌ను ప‌ల‌క‌రిస్తే విభ్రాంతిక‌ర విష‌యాలు బ‌య‌టికొచ్చాయి. విధాత ప్ర‌త్యేకం: అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో […]

BRS | బీఆర్ఎస్‌కు ఎదురుగాలి వీయ‌నుందా?

BRS |

  • కొంప‌ ముంచ‌నున్న ముఖ్య‌మంత్రి అతి విశ్వాసం?
  • ప్ర‌జ‌ల‌కు ప్ర‌వేశం లేని న‌వీన పాల‌నా సౌధాలు
  • నేత‌ల‌కు ద‌క్క‌ని కేసీఆర్‌, కేటీఆర్ అపాయింట్‌మెంట్‌లు
  • 30-40 సీట్లు మార్చ‌క‌పోతే ఆశ‌లు గ‌ల్లంతే
  • కేసీఆర్ కుటుంబీకుల‌పైనా ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త‌!

తెలంగాణ‌లో అధికార బీఆర్ఎస్‌ (BRS)కు వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్నాయా? అంటే నిజ‌మేన‌ని క్షేత్రస్థాయి ప‌రిశీల‌న‌లో తెలుస్తోంది. విధాత బృందాలు ప‌లు జిల్లాల్లో ప‌ర్య‌టించి, ప్ర‌జ‌ల‌ను ప‌ల‌క‌రిస్తే విభ్రాంతిక‌ర విష‌యాలు బ‌య‌టికొచ్చాయి.

విధాత ప్ర‌త్యేకం: అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శ‌ని అన్న‌ట్లు, బీఆర్ఎస్‌.. ప్ర‌జ‌ల్లో ఇంత‌కుముందున్న‌ సెంటిమెంట్‌ను కోల్పోయింది. ప్ర‌జ‌ల‌తో టీఆర్ఎస్‌తో ఉన్న అనుబంధం బీట‌లు వారింది. క్షేత్ర‌స్థాయిలో నాయ‌కులు కూడా నిరాస‌క్త‌త వ్య‌క్తం చేస్తున్నారు. దీనికి ముఖ్య కార‌ణం కేసీఆర్ అతివిశ్వాసం. ‘ఏం కాదు, మ‌ళ్లీ మ‌న‌మే’ అనే లెక్క‌లేనిత‌నం. ఎవ‌రు చెప్పినా విన‌ని మొండిత‌నం. అయితే ఇవ‌న్నీ కేసీఆర్‌కు కొత్తేం కాదు. ఫ‌లితం అనుభ‌వించిన త‌ర్వాత తెలుసుకుంటాడు.

ఉద్య‌మకాలంలో ఆయ‌న‌కు ఈ అనుభవం ఉంది కానీ, అప్పుడు ప్ర‌జ‌లంతా తెలంగాణ వైపే ఉన్నారు. ఈసారి ప‌రిస్థితి అంత తేలిక‌గా ఏం లేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌లో క‌నీసం 40 మంది మీద తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. వీరిని క‌నుక మార్చ‌క‌పోతే అధికారం మీద ఆశ‌లు వ‌దులుకోవ‌డం ఉత్త‌మం. విచ్చ‌ల‌విడి అవినీతి, భూక‌బ్జాలతో వీరంతా కంపుకొడుతున్నారు.

సాధారణ ఎమ్మెల్యేలు మాత్రమే కాదు.. కేసీఆర్‌ కుటుంబం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నవారి పట్ల కూడా ప్రజల్లో వ్యతిరేకత ఉన్నది. బ‌హుశా ఈ విష‌యం ముఖ్య‌మంత్రికి, కేటీఆర్‌కు తెలిసేఉంటుంది. స‌మ‌యానికి మేలుకుంటే కొంతలో కొంత మేలు జ‌రిగే అవ‌కాశం ఉంది.

ఇదే కాక, అవినీతి అధికారుల‌కు కేసీఆర్ అంద‌లం అందిస్తున్నారు. ధ‌ర‌ణితో రైతుల కొంప‌లు ముంచిన సోమేశ్‌కుమార్‌కు మ‌ళ్లీ ప్ర‌ధాన స‌ల‌హాదారు ప‌ద‌వి ఇవ్వ‌డం ఇలాంటిదే. ఇప్ప‌టికీ ధ‌ర‌ణి ఓ కొలిక్కి రాకుండా కొర‌క‌రాని కొయ్య‌లా మిగిలిపోయిందంటే సోమేశ్ పుణ్య‌మే. ఆ మ‌హ‌నీయుడికి స‌చివాల‌యంలో ముఖ్య‌మంత్రి ఉండే ఆరో అంత‌స్తులో గ‌ది కేటాయించ‌డం ఇంకా ఘోరం.

ఇక తండ్రీకొడుకుల ప్ర‌వ‌ర్త‌న నాయ‌కుల‌కు మింగుడుప‌డ‌కుండా ఉంది. ఎవ‌రినీ ద‌గ్గ‌ర‌కు రానీయ‌కుండా, క‌ల‌వ‌కుండా ‘అంట‌రానిత‌నం’ పాటిస్తున్నారు. వారు అనుకున్న‌వారినే క‌లుస్తున్నారు త‌ప్ప‌, ఇత‌ర నాయ‌కుల‌కు, అధికారుల‌కు అటు ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లోకి, ఇటు సెక్రటేరియేట్‌లోకి ప్ర‌వేశ‌మే లేకుండా చేస్తున్నారు.

ఇక కొత్త స‌చివాల‌య‌మైతే మిల‌ట‌రీ హెడ్‌క్వార్ట‌ర్స్‌లా అష్ట‌దిగ్బంధ‌నంలోకి వెళ్లిపోయింది. కేవ‌లం మ‌హారాష్ట్ర నాయ‌కుల వ‌ర‌కే ప్ర‌వేశం ప‌రిమితం. నాయ‌కుడెప్పుడూ ప్ర‌జ‌ల్లో ఉండాల‌నే విష‌యం తెలియ‌ని వాడు కాదు కేసీఆర్‌. కానీ అంతా నేను చూసుకుంటాన‌నే భావం ఆయ‌న‌ను క‌ద‌ల‌నివ్వ‌డంలేదు. ఈ అంట‌రానిత‌నం బీఆర్ఎస్‌కు మ‌రో శాపం కాబోతోంది.

విచిత్ర‌మేమిటంటే, ప్ర‌జ‌లు ప్ర‌భుత్వం అందిస్తున్న అన్ని సంక్షేమ ప‌థ‌కాల ల‌బ్ధి పొందుతున్నారు కానీ, ఎందుక‌నో, వారికి పార్టీ రుచించ‌డంలేదు. ఎవ‌రిని ప‌లుక‌రించినా, అన్నీ అందుతున్నాయ‌నే అంటున్నారు కానీ, ఓటెవ‌రికి వేస్తారంటే స‌మాధానం చూద్దాం అని వ‌స్తోంది. బీజేపీ ప‌ట్ల సానుకూల దృక్ప‌థం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇదంత సోష‌ల్ మీడియాలో బీజేపీ చేస్తున్న విప‌రీత‌మైన ప్ర‌చారం వ‌ల్లే జ‌రుగుతోంది. నిజానిజాల సంగ‌తెలా ఉన్నా, వాటిని ప్ర‌జ‌లు న‌మ్ముతున్న‌ట్లుగా క‌నిపిస్తుంది.

ఐటీలో మేటిగా చెప్పుకుంటున్న కేటీఆర్ నాయ‌క‌త్వంలోని బీఆర్ఎస్ సోష‌ల్ మీడియా వింగ్ ఈ విష‌యంలో పూర్తిగా విఫ‌ల‌మైంది. బీజేపీ చేస్తున్న ప్ర‌చారాన్ని స‌మ‌ర్థ‌వంతంగా అడ్డుకోవ‌డంలో ఈ విభాగానికి పూర్తిగా అవ‌గాహ‌న కొర‌వ‌డింది. దాన్ని స‌రిచేయాల‌నే ఆలోచ‌న‌లో కూడా నాయ‌క‌త్వం ఉన్న‌ట్లు క‌నిపించ‌డం లేదు.

ఇవ‌న్నీ కాద‌న‌లేని స‌త్యాలు. కానీ, వీట‌న్నింటినీ స‌రిచేసుకుంటే ప‌రిస్థితులు అనుకూలంగా మార‌వ‌చ్చు. పైగా కేసీఆర్ బ‌య‌ట‌కువ‌చ్చి మాట్లాడ‌గ‌లిగితే మార్పు త‌థ్యం. అంద‌రినీ క‌లుపుకుపోవాల‌నే భావ‌న టానిక్ లాంటిది. వారిలో ఈ మార్పు మ‌ళ్లీ అధికారాన్ని క‌ట్ట‌బెట్టే అవ‌కాశాన్ని క‌ల్పిస్తుంది. లేదంటే, హైటెన్ష‌న్ షాక్ మాత్రం ఖాయం.

పూర్తిగా మ‌త‌విద్వేష రాజ‌కీయాల‌తో మ‌మేక‌మై ఉన్న బీజేపీకి క‌ర్ణాట‌క ఫ‌లితం చెంప‌పెట్టులాంటిది. కాంగ్రెస్ పూర్తి ఐక‌మ‌త్యంతో ప‌నిచేసి, బీజేపీ దాష్టీకాన్ని స‌మ‌ర్థవంతంగా అడ్డుకుని, తిరుగులేని విజయాన్ని సాధించింది. అటువంటి వ్యూహ‌మే ఇక్క‌డ బీఆర్ఎస్‌కు కూడా అవ‌స‌రం.

దేశ‌భక్తి అంటే బీజేపీకి ఓటు వేయ‌డ‌మే అనే అజ్ఞానం నుండి ప్ర‌జ‌ల‌ను దూరం చేస్తేనే బీఆర్ఎస్‌కు మ‌నుగ‌డ‌. ఓప‌క్క‌, శాస్త్ర విజ్ఞానం కొత్త‌పుంత‌లు తొక్కుతుంటే, కృత్రిమ మేధ‌ మ‌నిషి ఉనికినే స‌వాల్ చేస్తుంటే, ఇంకా మ‌తం రంగు పులుముకుని బీజేపీ చేస్తున్న నీచ రాజ‌కీయాలు దేశాన్ని శ‌తాబ్దాల‌పాటు వెన‌క్కినెట్టేస్తాయి.

గుజ‌రాత్ మోడ‌ల్‌, డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కార్‌, బుల్డోజ‌ర్ స‌ర్కార్‌ల నిజ‌స్వ‌రూపం బ‌ట్ట‌బ‌య‌లు చేయ‌గ‌లిగితేనే రాష్ట్రాలు, దేశం క‌ష్టాల‌నుండి గ‌ట్టెక్కుతాయి. అప్పుడు క‌శ్మీర్ ఫైల్స్‌, కేర‌ళ స్టోరీస్ కూడా బీజేపీని కాపాడ‌లేవు. నేటి క‌ర్ణాట‌క ఫ‌లిత‌మే రేపు అన్ని రాష్ట్రాల‌నుండి వ‌స్తేనే మ‌నం మ‌రో న‌వ‌భార‌తాన్ని చూడ‌గ‌లం.