శ్రీలంక గట్టి పోరాటం.. దక్షిణాఫ్రికా ఘ‌న విజ‌యం

  • By: sn    latest    Oct 08, 2023 2:21 AM IST
శ్రీలంక గట్టి పోరాటం.. దక్షిణాఫ్రికా ఘ‌న విజ‌యం

ఈ ఏడాది భార‌త్ వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా బోణి కొట్టింది. తొలి మ్యాచ్ లో సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్స్ వీరవిహారం చేయ‌డంతో నాలుగు వంద‌ల మార్క్ దాటింది. ఇక శ్రీలంక ఈ ల‌క్ష్యాన్ని బ్రేక్ చేసేందుకు గ‌ట్టిగా ప్ర‌య‌త్నించిన కూడా చ‌తిక‌లప‌డింది. వివరాల‌లోకి వెళితే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక పెద్ద మూల్య‌మే చెల్లించుకుంది. ద‌క్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్స్ క్వింటన్ డి కాక్ (100), రాస్సీ వాండర్ డస్సెన్ (108), ఐడెన్ మార్క్రమ్ (106) భారీ సెంచరీలతో చెలరేగ‌డంతో దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 428 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక జట్టు 44.5 ఓవర్లలో 326 పరుగులకు కుప్ప‌కూలింది.


శ్రీలంక బ్యాట్స్‌మెన్స్‌లో కుశాల్ మెండిస్ (76; 42 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. చరిత్ అసలంక (79; 65 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లు), డాసున్ శనక (68; 62 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపులు మెరిపించినా ల‌క్ష్యం మ‌రింత పెద్ద‌దిగా ఉండ‌డంతో శ్రీలంక‌కి ఓటమి త‌ప్ప‌లేదు.ఇక సౌతాఫ్రికా బౌల‌ర్స్‌లో కోయెట్జీ 3, మార్కో జాన్సన్ 2, రబాడ 2, కేశవ్‌ మహారాజ్ 2, ఎంగిడి ఒక వికెట్ తీసారు. ఇక సునామి ఇన్నింగ్స్ ఆడి సెంచరీ చేసి దక్షిణాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించిన ఐడెన్ మార్క్రమ్ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్ అందుకున్నారు.


సౌతాఫ్రికా, శ్రీలంక మ్యాచ్‌లో అనేక రికార్డులు న‌మోదు అయ్యాయి.సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్స్‌లో ముగ్గురు బ్యాట్స్‌మెన్స్ సెంచ‌రీలు చేశారు. వరల్డ్‌కప్‌లో 400కి పైగా స్కోర్ చేయడం.. దక్షిణాఫ్రికాకు ఇది మూడోసారి కాగా, వన్డే క్రికెట్‌ చరిత్రలో ఎక్కుసార్లు 400 పైచిలుకు పరుగులు చేసిన జట్టుగా దక్షిణాఫ్రికా స‌రికొత్త రికార్డ్ సృష్టించింది.. 2015 ఐర్లాండ్‌పై 411 పరుగులు, వెస్టిండీస్‌పై 408 పరుగులు చేసింది ద‌క్షిణాఫ్రికా. మొద‌ట్లో గ‌ట్టిగా ఆడుతూ చివ‌రికి చ‌తికిల ప‌డి ఫైన‌ల్ వ‌ర‌కు వెళ్ల‌లేక‌పోతుంది. ఇక శ్రీలంక తమ తదుపరి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో అక్టోబర్ 10న హైదరాబాద్ వేదికగా తలపడనుండగా, సౌతాఫ్రికా అక్టోబర్ 12 ఆస్ట్రేలియాతో లక్నో వేదికగా ఆడనుంది.