విధాత, మెదక్ జిల్లా ప్రత్యేక ప్రతినిధి: మెదక్ నియోజక వర్గం పాపన్న పేట మండల బిఆర్ ఎస్ పార్టీ ఆత్మీయ సమావేశంలో మహిళలు నిరసన వ్యక్తం చేశారు. డ్వాక్రా మహిళలకు రుణాలు అందడం లేదని, పింఛన్‌లు మంజూరీ అయినా రావడం లేదంటూ మహిళలు పార్టీ పరిశీలకుడు, ఎమ్మెల్సీ ఏ.మల్లేశం ముందే నిరసన వ్యక్తం చేయడంతో ఆయన ప్రసంగం మమా అనిపించారు. ఐతే ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మహిళలతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
మహిళల నిరసనకు ముందు ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని రోల్ మోడల్ గా తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ని మళ్లీ ఒకసారి ఆశీర్వదించాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. పాపన్నపేట మండల పరిధిలోని లక్ష్మీ నగర్ గ్రామ శివారులోనీ ఫంక్షన్ హాల్లో గురువారం నిర్వహించిన సమావేషానికి ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అధ్యక్షత వహించారు.
తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ తెలంగాణ రాకమందు ఏ గ్రామంలో చూసినా నీటి కష్టాలు ఉండేవని పేర్కొన్నారు. గతంలో ఎవరైనా చనిపోతే స్నానాలు చేయడానికి నీళ్లు లేక పోయేవని సంబంధిత ఏఈకి చెప్పి కరెంటు వేయించుకుని స్నానాలు చేయాల్సిన పరిస్థితి అప్పట్లో ఉండేదన్నారు. అలాగే తాగునీటి కోసం ఆడపడుచులు పడరాని పాట్లు పడేవారని గ్రామ పొలిమేరలకు వెళ్లి చేదబావి నుండి నీళ్లు తెచ్చుకునే వారని పేర్కొన్నారు.
ఇప్పుడు ఇంటింటికి నల్లాల ద్వారా తాగునీరు అందిస్తున్న ఘనత కేసిఆర్ కు దక్కిందన్నారు. సీఎం కేసీఆర్ రైతు కష్టాలు తెలిసిన వ్యక్తి అని అందుచేతనే రైతులకు ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలను అమలుపరుస్తున్నారని తెలిపారు. 24 గంటల కరెంటుతో పాటు, రైతుబంధు, రైతు బీమా కార్యక్రమాలు చేపట్టడంతో పాటు రైతులకు సాగునీరు అందించడానికి కాలేశ్వరం ప్రాజెక్టు ఏర్పాటు చేసి వేలాది ఎకరాలకు నీరు అందిస్తున్న ఘనత కేసిఆర్‌కే దక్కింది అన్నారు. అప్పట్లో పాపన్నపేట మండలానికి సాగునీరు అందించడానికి సింగూరు నీరు ఘనపూర్ ఆనకట్టకు వదలాలంటే రైతులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఉండేదని, ఇప్పుడు అలా కాకుండా సమయానుకూలంగా నీరు వదులుతూ పంటలను రక్షిస్తున్న విషయాన్ని ఎమ్మెల్యే గుర్తు చేశారు.
తెలంగాణ రాకముందు ఏ గల్లీలో చూసినా చెత్తాచెదారం పేరుకుపోయేదని ప్రస్తుతం అలా కాకుండా గ్రామ గ్రామాన డంప్యాడ్ ఏర్పాటు చేసి చెత్త తరలించే వాహనాల ద్వారా ఎప్పటికప్పుడు గ్రామాలను పరిశుభ్రం చేయడం మూలంగా ఏ గ్రామంలో కూడా అశుభ్రత కనిపించడం లేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. దీంతో గ్రామీణ ప్రజలకు రోగాల బాధ తప్పిందని ఆరోగ్య తెలంగాణగా ఏర్పడిందని ఎమ్మెల్యే వెల్లడించారు. అంతే కాకుండా ప్రతి గ్రామంలో నర్సరీలు ఏర్పాటు చేసి వేలాది మొక్కలు పెంచడం మూలంగా పరిశుభ్రమైన గాలి అందుతుందని పద్మా దేవేందర్ రెడ్డి వివరించారు.
పద్మా దేవేందర్ రెడ్డి ప్రసంగం ముగిసిన వెంటనే పలు గ్రామాల మహిళలు స్టేజి వద్దకు వచ్చి అసరా, ఒంటరి మహిళ తదితర పింఛన్లు మంజూరు అయినా రావడం లేదని తమకు అర్హత ఉన్నా పింఛన్లు మంజూరు కాలేదని కొందరు, డ్వాక్రా రుణాలు చెల్లించినా మంజూరు కావడం లేదని మహిళలు పలు సమస్యలతో స్టేజి వద్దకు వెళ్ళారు. దీంతో ముఖ్య అతిథిగా హాజరైన ఇన్‌చార్జీ ఎమెల్సి మల్లేశం తన ప్రసంగాన్ని మమ అనిపించారు.
పాపన్నపేట మండల పరిధిలోని లక్ష్మీ నగర్ గ్రామ శివారులో ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనానికి పెద్ద సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు తరలివచ్చారు. ఇందులో భాగంగా పాపన్నపేట మండలం పరిధిలోని ఎల్లాపూర్ గ్రామం నుండి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున బైక్లు, కార్లతో ర్యాలీ నిర్వహించారు. బి ఆర్ఎస్, ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి లకు అనుకూలంగా నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగింది. గాంధార్పల్లి చౌరస్తా వద్ద ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి కి గజమాల వేసి సన్మానించారు.
కార్యక్రమంలో ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, టిఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, పాపన్నపేట జడ్పిటిసి సభ్యురాలు షర్మిల, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు కుమ్మరి జగన్, ఏడుపాయల చైర్మన్ బాల గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్రామిరెడ్డి, మెదక్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అశోక్, పాపన్నపేట ఆర్యవైశ్య సంఘం నాయకులు బెజుగం శంకర్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.